సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓటమి చెంది ‘మాజీ’లయిన జిల్లా నాయకులకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. వారికి ఉన్న భద్రతను తొలగించాలని రాష్ట్రస్థాయిలో ఉండే ‘భద్రతా సమీక్ష కమిటీ’ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు జిల్లాలో వారికి గన్‌మెన్‌లను తొలగించారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం జిల్లాలో మొత్తం 30 మందికి పైగా మాజీ ప్రజాప్రతినిధుల భద్రతను తొలగించినట్టు సమాచారం. దీంతో వీరంతా ఇప్పుడు తమ భద్రతను పునరుద్ధరించుకునే పనిలో పడ్డారు.
భద్రత ఏర్పాటు చేయాలంటూ ఆయా పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి నేతలతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు సిఫారసులు చేయించుకుంటున్నారు. వారే స్వయంగా లేఖలు రాసి తమ భద్రతను పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వీరి విజ్ఞప్తులను పరిశీలించిన జిల్లా పోలీసు యంత్రాంగం ఎవరెవరికి భద్రత ఉంచాలనే అంశంపై ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినట్టు సమాచారం.
ఓడిపోయిన వారికి ‘నో’
గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉండి ఇటీవలి ఎన్నికలలో ఓడిపోయిన నేతలందరికీ దాదాపు భద్రత తొలగించారు. వీరితో పాటు రాజకీయాలతో సంబంధమున్న మరికొందరి ప్రముఖుల భద్రతను కూడా తీసేశారు. ఇలా తీసేసిన వారిలో మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు డాక్టర్లు, విద్యాసంస్థల అధిపతులు, ఇతర ప్రముఖులు ఉన్నట్టు సమాచారం. వీరితో పాటు మాజీ మంత్రులుగా పనిచేసి, ఇప్పుడు ఓడిపోయిన వారు, గెలిచినా ఎమ్మెల్యేలుగా మిగిలిపోయిన వారికి కూడా భ ద్రత త గ్గించేశారు.
గతంలో మంత్రిగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఓ ప్రజాప్రతినిధికి మాత్రం గతంలో ఉన్న భద్రతనే కొనసాగిస్తున్నట్టు పోలీసు వర్గాలు చెపుతున్నాయి. ఇక, మిగిలిన మాజీలందరికీ భద్రతను తొలగించారు. అటు కేంద్రంలో, ఇటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నాయకులు కూడా ఇందులో ఉన్నారు. దీంతో వీరంతా తమ భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ ఆయా పార్టీల రాష్ట్ర స్థాయి నేతలతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.
తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తాము భద్రత లేకుండా ఎందుకు తిరగాలని, తమకు వెంటనే భద్రత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కొందరు మాజీలు పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఆయా నేతల వారీగా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రస్థాయి ఇంటెలిజెన్స్ విభాగానికి నివేదిక పంపారు. ఈ నివేదికలో ఎవరికి భద్రత అవసరమో లేదో తెలియజేస్తూ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నివేదికను ఇంటెలిజెన్స్ పరిశీలించిన తర్వాతే.. తొలగించిన మాజీలకు మళ్లీ భద్రత పునరుద్ధరించాలా వద్దా అనే దానిపై జిల్లా పోలీసు యంత్రాంగం నిర్ణయం తీసుకోనుంది.
భద్రత కరువు
Published Mon, Aug 25 2014 2:09 AM | Last Updated on Wed, Aug 15 2018 7:18 PM
Advertisement
Advertisement