ఆంధ్రప్రదేశ్‌కు బై బై
కాగజ్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్ : సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు వీడ్కోలు పలికేందుకు తెలంగాణ సిద్ధమైంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించనుంది. దీంతో సుమారు ఐదున్నర దశాబ్దాలకు పైగా కొనసాగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన గుర్తులు చెరిగిపోనున్నాయి. ఇక పాత రాష్ట్రానికి సంబంధించిన బోర్డు ఈ ఒక్క రోజు కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై తెలంగాణ ప్రభుత్వం పేరుతో బోర్డులు రాయాలన్న ఆదేశాలను అధికారులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ కల సాకారం కాబోతోందన్న సంబరాల్లో ఉన్నారు.
కోటి ఆశలతో కొత్త రాష్ట్రంలో పని చేయడానికి ఉద్యోగులు, సామాన్యులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ సంబరాలను మే 30, 31న నిర్వహించగా.. ఆదివారం సెలవు దినం కావడంతో ఆంధ్ర రాష్ట్రానికి బై బై చెబుతూ తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం పలికేందుకు అధికారులు, ప్రజలు సిద్ధమవుతున్నారు. జూన్ ఒకటి ఆదివారం కావడం, జూన్ 2న సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఉద్యోగులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చివరి వర్కింగ్ డే ముగిసింది. ఇప్పటికే మే నెలకు సంబంధించిన వేతనాలు పొందారు. ఫిబ్రవరిలో యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేసిన నాటి నుంచి ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు పని చేస్తామా అన్న ఆసక్తితో ఉన్నారు.
జూన్ 23వరకు ఎన్నికల కోడ్ ఉండగా.. అది తొలగినప్పటికీ ఎలాంటి పనులు చేయలేకపోయిన ఉద్యోగులు వారి ఆశలకు అనుగుణంగా అపాయింటెడ్ డే దగ్గర పడింది. ఇన్నాళ్లూ సమైక్య రాష్ట్రంలో పనిచేసిన ఉద్యోగులు ఒక్కసారిగా స్వంత రాష్ట్రంలో పనిచేయబోతున్నామనే భావన వారిలో ఆనందాన్ని నింపుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగ సంఘాలు లక్ష్యం నెరవేరడంతో రాష్ట్ర ప్రగతిలోనూ కీలక పాత్ర పోషించాలని సామాన్య ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
మారనున్న బోర్డులు
ప్రభుత్వ కార్యాలయాల బోర్డులన్నీ ఆదివారం రోజు మారిపోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనే పదాలను తొల గించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనే బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. సకలజనుల సమ్మె కాలంలోనే ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ ఆంధ్రప్రదేశ్ తొలగించి టీజీ అన్న అక్షరాలను ఉద్యమకారులు రాసినప్పటికీ.. అధికారికంగా వాటికి విలువ లేకుం డా ఉన్నాయి. రాష్ట్రం ఏర్పాటు కానుండడంతో జూన్ 2న తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనే బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాలకు అనుగుణంగా ఆదివారం బోర్డులు మారనున్నాయి. తమ చిరకాల వాంఛ ఇన్నాళ్లకు తీరుతోందని ఉద్యోగ సంఘాలు, ఉద్యమకారులు సంబరాలకు సిద్ధమవుతున్నారు.