వాకౌట్ చేయడం నేరమా!
మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్: అబద్ధాలతో కూడిన గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ వాకౌట్ చేస్తే, గవర్నర్‌ను అగౌరవపరిచారంటూ అధికార పక్ష సభ్యులు అనడం సరికాదని శాసన మండలి విపక్షనేత షబ్బీర్ అలీ అన్నారు. శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మండలిలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మంత్రి పదవుల్లో కొనసాగుతున్న కొందరు గతంలో ఇదే గవర్నర్‌పై ప్రసంగ పుస్తకాలను విసిరికొట్టారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజారంజకమైన పాలన సాగుతున్నట్లయితే, ఇందిరాపార్క్ వద్ద ధర్నాలంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అధికార పక్షాన్ని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆకుల లలిత మాట్లాడుతూ.. రెండు పడకల ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, దళితులకు మూడెక రాలు, మైనారిటీలు, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అధికార పక్షం గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, పాత విషయాలు మినహా తాజాగా గవర్నర్ ప్రసంగంలో కొత్త అంశాలేమీ లేవని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు విమర్శించారు. కాగా, విపక్షాలు కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి మద్దతు తెలుపుతూ నారదాసు లక్ష్మణ్‌రావు, భూపతిరెడ్డి, ఎమ్మెస్ ప్రభాకర్, నారాయణరెడ్డి, ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి, గంగాధర్‌గౌడ్ ప్రసంగించారు.