పసి పాపలతో పరుగులు | Short Circuit In Warangal MGM Hospital Kids Ward | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 28 2018 5:30 PM | Last Updated on Fri, Sep 28 2018 5:32 PM

Short Circuit In Warangal MGM Hospital Kids Ward - Sakshi

వార్డు నుంచి తమ పిల్లలను తీసుకుని పరుగులు తీస్తున్న తల్లిదండ్రులు, అటెండెంట్లు

అది వరంగల్‌ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రి నవజాతశిశు సంరక్షణ కేంద్రం. అందులో 23 మంది శిశువులు చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం.. సమయం సరిగ్గా 7.50 గంటలవుతోంది. పిల్లల వార్డులోని ఏసీ నుంచి పొగలు వచ్చాయి. ఏమి జరిగిందని ఆలోచించే లోపే పొగలు గది మొత్తాన్ని కమ్ముకున్నాయి.. ఒక్కసారిగా భయంతో తల్లులు, అటెండెంట్లు పిల్లలను పొత్తిళ్లలో అదిమిపట్టుకుని ప్రాణభయంతో పరుగులు తీశారు. ఆస్పత్రి ప్రాంగణంలోకి చేరుకున్న  వెంటనే పెద్ద శబ్దంతో ఏసీ పేలిపోయి మంటలు ఎగిశాయి. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఎంజీఎం(వరంగల్‌) : వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి పిల్లల వార్డులో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. చికిత్స పొందుతున్న పసిగుడ్డులను చేతపట్టుకుని తల్లులు భయంతో పరుగులు తీయడం కలకలం రేపింది. నవజాత శిశువులు చికిత్స పొందుతున్న వార్డులోని ఏసీ నుంచి పొగలు రావడంతో తల్లులు తమ చిన్నారులను పట్టుకుని పరుగులు తీశా రు. వారు బయటకు వచ్చిన తర్వాత కొద్ది నిమిషా ల్లో ఏసీ పేలి వార్డులో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది వాహనంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. 

విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ప్రమాదం..
ఎంజీఎంలోని నవజాతశిశు సంరక్షణ కేంద్రం (ఎస్‌ఎన్‌ఎస్‌యూ)స్టెప్‌డౌన్‌ వార్డులో 23 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం 7.50 గంటల సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఏసీ నుంచి వచ్చిన పొగలు వార్డును కమ్మేస్తోంది. విషయాన్ని గమనించిన ఆ శిశువుల తల్లులకు ఏమి చేయాలో తోచలేదు. ఒక్కసారిగా తమ చిన్నారులను పొత్తిళ్లలో అదిమి పట్టుకుని ప్రాణభయంతో ఆస్పత్రి ప్రాంగణంలోకి పరుగులు తీశారు. వెంటనే స్పందించిన సెక్యూరి టీ, వైద్యసిబ్బంది ఆస్పత్రిలో ఉన్న విలువైన పరికరాలను బయటకు తీసుకువచ్చే పనిలోపడ్డారు. ఇం తలోనే పొగలు వెలువడుతున్న ఏసీ పక్కనే ఉన్న ఆక్సిజన్‌ పైపు సైతం లీక్‌ కావడంతో ఒక్కసారిగా ఏసీ పేలిపోయి గదిలో పెద్ద ఎత్తున మంటలు వ్యా పించాయి. వైద్యసిబ్బంది అగ్నిమాపక అధికా రులకు సమాచారం అందించడగా ఫైరింజన్‌తో సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పివేశారు.

చెట్ల కిందే శిశువులతో తల్లుల నిరీక్షణ..
ఈ ఘటనతో షాక్‌కు గురైన శిశువుల తల్లులు తమ పిల్లలతో ఆస్పత్రిలోని చెట్ల కింద నిరీక్షించా రు. వారిని వార్డుకు తరలించాల్సిన పరిపాలనాధికారులు గంట పాటు ఆస్పత్రి ప్రాంగణంలోకి చేరుకోలేదు. ఎంజీఎంలో ముగ్గురు ఆర్‌ఎంఓలతో పాటు, ఒక సూపరింటెండెంట్‌ స్థాయి అధికారి నిత్యం పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే ఘట న జరిగి గంట సమయం దాటినా అటువైపు అధి కారులెవరూ రాకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో పిడియాట్రిక్‌ విభాగ వైద్యులు వచ్చి వారికి ధైర్యం చెబుతూ పక్క వార్డులోకి తరలించారు. 

మరోమారు మంటలంటూ పరుగులు..
ఏసీ పేలిన ఘటన అనంతరం వైద్యసిబ్బంది పరిపాలనాధికారులు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తూ చిన్నారులకు చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో 9.30 గంటలకు మరో ఏసీ నుంచి పొగలు వస్తున్నాయని ఎవరో చెప్పడంతో పక్క వార్డులో చికిత్స పొందుతున్న 100 చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పిల్లలను ఎత్తుకుని బయటకు పరుగులు తీశారు. అసలు ఆస్పత్రిలో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. వెంటనే సిబ్బంది అప్రమత్తమై ఏం జరగులేదని చెప్పడంతో వారిని  వార్డులకు తరలించి చిక్సిత అందించారు.

మరమ్మతుకు నోచుకోనీ పరికరాలు..
ఎంజీఎం ఆస్పత్రి ప్రధాన వార్డులో కాలంచెల్లిన పరికరాలతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తున్నది. మూడు, నాలుగు నెలల క్రితం ఏసీలకు మరమ్మతు చేసి పెద్ద ఎత్తున బిల్లులు డ్రా చేసినట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఆస్పత్రిలోని ఏఎంసీ, ఐఎంసీ, పోస్టు ఆపరేటివ్‌ వంటి విభాగాల్లో ఏప్పుడూ ఏసీలు సక్రమంగా పనిచేయడం లేదు. అయినా మరమ్మతుల పేరుపై బిల్లులు మాత్రం చెల్లిస్తుండం పరిపాటిగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారు. 

23 మంది చిన్నారులు సురక్షితం
నవజాతశిశు సంరక్షణ వార్డులో చికిత్స పొందుతున్న 23 మంది చిన్నారులకు ఏలాంటి ప్రమాదం లేదని పిడియాట్రిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. వారిని వేరే వార్డులోకి తరలించి చికిత్సఅందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రిలోని రెండు నవజాతశిశు సంరక్షణ కేంద్రాల్లో 40 పకడలు మాత్రమే మంజూరు కాగా ప్రతి రోజు 80 నుంచి 100 మందికి పైగా చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. నవజాతశిశువులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆయన వివరించారు.– డాక్టర్‌ విజయ్‌కుమార్, పిడియాట్రిక్‌ విభాగాధిపతి
 
ప్రాణభయంతో పరుగులు పెట్టాం..
మాది ఖమ్మం జిల్లా. కామెర్ల వ్యాధితో బాధపడుతున్న నా బిడ్డ 13 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. ఆస్పత్రిలో ఉన్న ఏసీ నుంచి పొగలు రావడంతో ప్రాణభయంతో పరుగులు పెట్టాం. బయటకు రాగానే ఏసీ పేలి మంటలు లేచాయి.– విజయలక్ష్మి, చిన్నారి తల్లి

అదృష్టవశాత్తు బయటపడ్డాం..
ఏసీ నుంచి పొగలు రావడంతో చిన్నారులును ఎత్తుకుని తల్లులు బయటకు పరుగులు తీశారు. వార్మర్‌లను బయటకు తీసుకువస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఏసీ పేలిపోయింది. ఆ సమయంలో మంటలు ఎగిసిపడ్డాయి. నాతో పాటు హసీనా, సుచరిత సిబ్బంది బయట ఉండడంతో ప్రాణపాయస్థితి నుంచి బయటపడ్డాం.– రమ్య, స్టాఫ్‌నర్సు

మేయర్, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు పరామర్శ
ఎంజీఎం ఆస్పత్రి పిల్లల విభాగంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఏసీ పేలిన విషయాన్ని తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు, మేయర్‌ నన్నపునేని నరేందర్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో చిక్తిత్స పొందుతున్న చిన్నారుల తల్లుల వద్దకు వెళ్లి పరామర్శించారు. వారివెంట స్థానిక కార్పొరేటర్‌ రిజ్వానా షమీమ్‌ మసూద్,  టీఆర్‌ఎస్‌ నాయకులు అల్లం నాగరాజు, ఆకారపు మోహన్‌ తదితరులు ఉన్నారు.

నూతన ఎంసీహెచ్‌ బ్లాక్‌ను ఉపయోగంలోకి తేవాలి
ఎంజీఎం ఆస్పత్రి పిల్లల విభాగానికి మంజూరైన పడకల కంటే అందులో చికిత్స పొందే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. నిర్మాణ పనులు పూర్తయిన మాత శిశు సంరక్షణ కేంద్ర భవనాన్ని వెంటనే వినియోగంలోకి తీసుకురావాలి.– పరుశరాములు,  చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌

ప్రభుత్వానిదే బాధ్యత
ఎంజీఎం ఆస్పత్రి పిడియాట్రిక్‌ విభాగంలో జరిగిన విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌కు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ జనసమితి యువజన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్‌ తిరునహరి శేషు డిమాండ్‌ చేశారు. ప్రమాదం జరిగిన వార్డును పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కాలం చెల్లిన ఏసీలను వాడడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పేర్కొన్నారు. ఎంజీఎం అధికారులు రోగులకు సరైన వైద్యం అందించడంలో విఫలమవుతున్నారని ఆరోపించారు.– తిరుణహరిశేషు, టీజేఎస్‌ యువజన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్‌ 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement