ఎస్‌ఐ, కానిస్టేబుల్‌పై వేటు
గ్యాంగ్‌రేప్ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యంపై ఎస్పీ సీరియస్
కరీంనగర్ క్రైం : వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన దళిత యువతి(20)పై గ్యాంగ్‌రేప్ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై వేటు పడింది. వీణవంక ఎస్సై కిరణ్, కానిస్టేబుల్ పర్శరాములను సస్పెండ్ చేస్తూ ఎస్పీ జోయల్‌డేవిస్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గ్యాంగ్‌రేప్ ఘటనపై ఎస్పీ స్వయంగా విచారణ చేపడుతున్న సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాధితురాలిని, ఆమె స్నేహితురాలిని తన కార్యాలయూనికి పిలిచి దాదాపు మూడు గంటలపాటు విచారణ నిర్వహించారు.
అనంతరం పోలీసుల నిర్లక్ష్యంపై ఎస్సై కిరణ్‌ను, ట్రైనింగ్ క్యాంప్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న కానిస్టేబుల్ పర్శరాములును పిలిచి వారి నుంచి వివరాలు సేకరించారు. నలుగురి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు. సంఘటన జరిగిన రోజు నిందితుడు శ్రీనివాస్ నుంచి తప్పించుకున్న బాధితురాలి స్నేహితురాలు తన ఇంటికి వెళ్లి తండ్రి సెల్ నుంచి ఎస్సై కిరణ్ సెల్‌కు కాల్ చేసి జరిగిన సంఘటన గురించి చెప్పింది. వెంటనే ఎస్సై కిరణ్ కానిస్టేబుల్ పర్శరాములుకు సదరు సెల్ నంబర్ ఇచ్చి వివరాలు తెలుసుకోవాలని చెప్పారు. కానిస్టేబుల్ సదరు నంబరుకు ఫోన్ చేసి వివరాలు సేకరించినప్పటికీ.. ఆ తర్వాత కనీసం విచారణ చేయలేదు. పర్శరాములు నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో సమస్య పరిష్కారమైనట్లు భావించానని ఎస్సై వివరణ ఇచ్చుకున్నట్లు తెలిసింది.
హోంమంత్రి ఆదేశాలతో...
గ్యాంగ్‌రేప్ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో హోంమంత్రి నారుుని నర్సింహారెడ్డి మంగళవారం డీజీపీ అనురాగ్‌శర్మతో మాట్లాడి వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో డీజీపీ అనురాగ్‌శర్మ ఎస్పీ జోయల్‌డేవిస్ నుంచి పూర్తి వివరాాలు సేకరించి హోంమంత్రికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. హోంమంత్రి సూచనల మేరకు శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని డీజీపీ ఎస్పీని ఆదేశించారు. బాధితురాలి స్నేహితురాలు ఫోన్ చేసి సంఘటన గురించి చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎస్సై కిరణ్, కానిస్టేబుల్ పర్శరాములను సస్పెండ్ చేస్తూ ఎస్పీ జోయల్‌డేవిస్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
రెండు మూడు రోజుల్లో చార్జీషీట్
ఇప్పటికే గ్యాంగ్‌రేప్ నిందితులైన శ్రీనివాస్, అంయ్య, రాకేశ్‌లను రిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అంజయ్య, రాకేశ్ మేజర్లా.. కాదా అనే విషయూన్ని వైద్య పరీక్షల ద్వారా తేల్చిన తర్వాత రెండు మూడు రోజుల్లో చార్జీషీట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. నిందితులిద్దరికీ నేడో రేపో వైద్యపరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిసింది.