ఇన్‌స్పెక్టర్‌పై వేటు? | SI Suspended Deer Hunting case | Sakshi
Sakshi News home page

ఇన్‌స్పెక్టర్‌పై వేటు?

Published Tue, Mar 28 2017 3:23 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

SI Suspended Deer Hunting case

వేటగాళ్లకు సహకరించినందుకు చర్యలు
అటవీశాఖ ఇచ్చిన   ఫిర్యాదులోని పేర్లు
ఎఫ్‌ఐఆర్‌లో నమోదుకాని వైనం
కోర్టు వరకు వెంట వచ్చిన ఏ4ను అరెస్టు చేయని పోలీసులు


మహదేవపూర్‌ (మంథని): దుప్పుల వేట కేసులో వేటగాళ్లకు సహకరిస్తున్నాడన్న అభియోగాలపైన పోలీసు ఉన్నతాధికారులు ఓ సీఐపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తు పారదర్శకంగా లేకపోవడం.. వేటగాళ్లకు సహకరించినట్లు వచ్చిన ఆరోపణలపై జిల్లా ఎస్‌పీ ఆర్‌.భాస్కరన్‌ కేసు విచారణ నుంచి ఓ సీఐని తప్పించడంతో పాటు వేటుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. దుప్పుల వేట ఘటనలో రేంజర్‌ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న ఫజల్‌ మహ్మద్‌ఖాన్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చకపోగా.. గుర్తు తెలియని ఐదుగురుపై కేసు నమోదు చేశాడని, వేటలో పాల్గొన్న కరీముల్లాఖాన్, అస్రార్‌ ఖురేషీలతో పాటు షికారు సత్తయ్యను ఆయుధంతో సహా పోలీసుస్టేషన్‌లో అప్పగించిన అక్బర్‌ఖాన్‌ను అరెస్టు చేయలేదని సీఐపై ఆరోపణలున్నాయి.

అలాగే, గత శుక్రవారం రాత్రి లొంగిపోయిన వేటగాళ్లను మంథని జడ్జి ఎదుట ప్రవేశపెట్టిన సమయంలోనూ వెంట ఉన్న అక్బర్‌ఖాన్‌ను అరెస్టు చేయకపోవడాన్ని పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించినట్లు తెలిసింది. వేటకు నాయకత్వం వహించింది అక్బర్‌ఖాన్, మున్నాలేనని విచారణలో తెలడంతో అక్బర్‌ఖాన్‌కు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

 ముగ్గురు వేటగాళ్లను కోర్టులో హాజరుపర్చేందుకు వెళ్లిన వాహనంలో ఒక ఏఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్ల వెంట ఏ4గా నమోదైన నిందితుడు అక్బర్‌ఖాన్‌ సైతం ప్రయాణించినట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో వారిపైనా చర్యకు సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. వన్యప్రాణులను వధించిన వేటగాళ్ల కన్నా ముందు వారికి సహకరించిన పోలీసు, అటవీశాఖ అధికారులకు శిక్షలు పడే అవకాశాలున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement