సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ నెట్‌వర్క్: ఎట్టకేలకు చినుకులు పడ్డాయి. రైతన్నల్లో ఆశలు చిగురించాయి. విత్తనాలు వేయడంలో రైతులు నిమగ్నమయ్యారు. జిల్లాలో సగటున 60.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. గడిచిన నాలుగేళ్లతో పోలిస్తే ఈ ఏడాది అదను మీదనే తొలకరి కురిసింది. నైరుతి పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో వారం రోజలుగా విత్తనాలు గుప్పిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు లక్ష హెక్టార్లలో విత్తనాలు వేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముందుగా వర్షాలు కురిసిన గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లో వేసిన విత్తనం మొలకెత్తింది. ఈ రెండు నియోజకవర్గాల్లోనే అత్యధికంగా వర్షపాతం నమోదైంది.
గజ్వేల్ సబ్‌డివిజన్ పరిధిలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్ మండలాల పరిధిలో మొత్తం 44వేల హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగానూ ఈసారి 58వేల హెక్టార్లలో పంటలు సాగువుతాయని వ్యవసాయశాఖ అంచనావేసింది. కురుస్తున్న వర్షాలతో రైతులు విత్తనాలు వేస్తున్నారు. మొక్కజొన్న 8385 హెక్టార్లు, పత్తి 7157, కందులు 159, సోయాబీన్ 62, కూరగాయలు 50 హెక్టార్లలో సాగయ్యింది. అన్నీ కలుపుకొని మొత్తం 15,813 హెక్టార్లలో పంటలు సాగుచేసినట్లు అంచనా.. మరో మూడు రోజుల్లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగనున్నదని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జిన్నారం, రామచంద్రాపురం మండలాల్లో కూరగాయల సాగు కోసం నారు పోశారు.
విస్తారంగా సాగు...
సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట, నంగునూరు, చిన్నకోడూరు మండలాల్లోని వివిధ గ్రామాల్లో రైతులు 13,600 హెక్టార్లలో మొక్కజొన్న విత్తనాలు వేశారు. 5,100 హెక్టార్లలో పత్తి విత్తనాలు విత్తారు. అదే విధంగా 1150 హెక్టార్లలో వరి నాటేందుకు వరి నారు పోశారు. మరో 7,800 హెక్టార్లలో ఆరు తడి పంటలైన కూరగాయలు, కంది, చిరు ధాన్యాల పంటలు వేశారు. ఇందులో సిద్దిపేట మండలంలో 6వేల హెక్టార్లలో మొక్కజొన్న, 1200 హెక్టార్లలో పత్తి, 400 హెక్టార్లలో వరి, 1200 హెక్టార్లలో ఆరుతడి పంటలు సాగు చేశారు. నంగునూరు మండలంలో 3600 హెక్టార్లలో మొక్కజొన్న, 2700 హెక్టార్లలో పత్తి, 300 హెక్టార్లలో వరి, 3000 హెక్టార్లలో ఆరుతడి పంటలు, చిన్నకోడూరు మండలంలో 4 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 1200 హెక్టార్లలో పత్తి, 450 హెక్టార్లలో వరి, 3600 హెక్టార్లలో ఆరుతడి పంటలు సాగు చేసినట్లు అధికారులు చెప్తున్నారు.
జోరుగా విత్తనాలు
వారం రోజులుగా వర్షాలు కురిశాయి. రెండు రోజుల నుంచి వర్షం తెరిపి ఇవ్వడంతో రైతాంగం విత్తనాలు వేసే పనిలో పడ్డారు. డివిజన్‌లో 5,720హెక్టార్లలో పెసర, 2,968 హెక్టార్లలో మినుము విత్తనాలు వేసినట్లు అంచనా. సోయా 1897హెక్టార్లలో సాగు చేస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో కనీసం 15 వేల హెక్టార్లలతో విత్తనాలు వేయడం పూర్తి అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది.
జనం అంతా పంట చేలల్లోనే...
జహీరాబాద్ నియోజకవర్గంలో సోమవారం కురిసిన ఓ మోస్తరు వర్షానికి రైతులు ఖరీఫ్ పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. దాదాపు 25 వేల హెక్టార్లల్లో విత్తనాలు విత్తినట్లు అంచనా. జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల్లో ఖరీఫ్ కింద మినుము, పెసర మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, కంది పంటలను సాగు చేసే పనులు ప్రారంభించారు.
నార్లు పోశారు...
నర్సాపూర్ మండలంలో 4,500ఎకరాల వరి సాగుకు గాను 200 ఎకరాలకు సరిపడా వరి నారు పోశారు. 2,400ఎకరాల మొక్కజొన్న సాగుకు 70ఎకరాలలో విత్తనం వేశారు. వెల్దుర్తి మండలంలో సుమారు ఏడు వేల ఎకరాలకు గాను వెయ్యి ఎకరాల్లో మొక్కజొన్న విత్తనం వేయగా 2,500ఎకరాలకు సరిపడా వరినారు పోశారు. కొల్చారం,హత్నూర మండలాల్లో వర్షాలు చాలా తక్కువగా ఉన్నందున విత్తనం,నారు పోసే పనులు రైతులు ఇంత వరకు చేపట్టలేదు. దుక్కి దున్నాలన్న సాలు వచ్చే పరిస్థితి లేదు. కౌడిపల్లి మండలంలో 24వేల ఎకరాల వరి సాగుకు 400 ఎకరాలకు సరిపడా వరినారు పోయగా మొక్కజొన్న విత్తనం ఇంకా వేయలేదు. శివ్వంపేట మండలంలోఎనిమిది వేల ఎకరాలలో సాగు చేయాల్సి ఉండగా అందులో సుమారు పది శాతం పొలాల్లో నారు పోశారు.
జోగిపేటలో జోరుగా...
అందోలు నియోజకవర్గంలో దాదాపు 15 వేల హెక్టార్లలో విత్తనాలు వేసినట్టు అంచనా. మునిపల్లి మండలంలో 25వేల ఎకరాలు, రేగోడ్ మండలంలో 21వేలు, టేక్మాల్ మండలంలో 15 వేల ఎకరాల్లో పత్తి గింజలు విత్తినట్టు సమాచారం. నియోజకవర్గంలో ఎక్కువగా జనుము, మక్కలు, పెసరు విత్తనాలు వేస్తున్నారు.
ఆశల మొలక
Published Sat, Jun 20 2015 2:40 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM
Advertisement
Advertisement