
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాలయాల్లో సమగ్ర విద్యావిధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం గురుకుల సొసైటీల నిర్ణయాలకు తగినట్లుగా ఆయా పాఠశాలల్లో బోధన, బోధనేతర కార్యక్రమాలు సాగుతున్నాయి. కేజీ టు పీజీ విద్యా కార్యక్రమంలో భాగంగా అన్ని గురుకుల పాఠశాలల్లో ఒకే తరహా బోధన, అభ్యసనతోపాటు బోధనేతర కార్యక్రమాలన్నీ ఒకే పద్ధతిలో ఉండాలని నిర్ణయించింది. దీంతో అన్ని గురుకుల సొసైటీలకు సమగ్ర వార్షిక ప్రణాళికను రూపొందించి అమలు చేయాల్సిందిగా సూచించింది. సమగ్ర వార్షిక ప్రణాళిక రూపకల్పనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల సొసైటీ కార్యదర్శులకు సూచనలు చేసింది. ప్రస్తుతం సొసైటీల వారీగా రూపొందించిన ప్రణాళిక ఆధారంగా సమగ్ర ప్రణాళికను తయారు చేస్తారు.
జూన్ 1 నుంచే అమలు..
పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పాఠశాల ప్రారంభం నుంచి ముగింపు వరకు చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి అకడమిక్ క్యాలెండర్ తయారు చేస్తారు. ఈ క్యాలెండర్ ఆధారంగా ప్రభుత్వ పాఠశాలల్లో రోజువారీ కార్యక్రమాలు అమలు చేస్తారు. ఇదే తరహాలో గురుకుల విద్యా సంస్థల సొసైటీ సైతం ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తుంది. సొసైటీలు ఎవరికివారు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుంటున్నప్పటికీ.. కొన్ని కార్యక్రమాల్లో వ్యత్యాసం ఉండటంతో ఒకే తరహా ఫలితాలు రావడం లేదనే భావన ఉంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అన్ని గురుకుల పాఠశాలల్లో సమగ్ర వార్షిక ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో అన్ని సొసైటీ కార్యదర్శులకు సూచనలు చేసిన ప్రభుత్వం.. ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదించాలని స్పష్టం చేసింది. సొసైటీ కార్యదర్శులు తయారు చేసిన సమగ్ర ప్రణాళికకు ప్రభుత్వ ఆమోదం దక్కిన వెంటనే అమల్లోకి వస్తుంది. జూన్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండటంతో ఆ రోజు నుంచే సమగ్ర ప్రణాళిక అమలు చేసేలా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.
ఒకే సమయపాలన, ఒకేసారి పరీక్షలు..
సమగ్ర ప్రణాళికతో అన్ని గురుకుల పాఠశాలల పనివేళలు ఒకే తరహాలో ఉంటాయి. విద్యార్థుల డైట్ మెనూ, పాఠ్యాంశ బోధన, అభ్యసనా కార్యక్రమాలు, సమ్మెటివ్, ఫార్మెటివ్ పరీక్షలు కూడా ఒకేసారి జరుగుతాయి. బోధన కార్యక్రమాలతో పాటు బోధనేతర కార్యక్రమాలైన క్రీడలు, ఇతర శిక్షణ కార్యక్రమాలు నిర్ణీత తేదీల్లో ఉండటంతో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణ సులభతరమవుతుంది. విద్యార్థుల కార్యక్రమాలతోపాటు ఉపాధ్యాయులు కూడా అన్ని సొసైటీలకు కలిపి ఒకేచోట శిక్షణ కార్యక్రమాలు చేపడితే నిధుల వ్యయం కూడా కలసి వస్తుందని భావించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.