గంట పనికి మరో గంట
వేతనం అదనం
సింగరేణి సంస్థపై పెరుగుతున్న ఆర్థిక భారం
గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణి సంస్థలో సాధారణంగా నిర్వహించే డ్యూటీ కన్నా ఆ తర్వాత వచ్చే ఓవర్‌టైమ్ (ఓటీ) పైనే కొందరు ఉద్యోగులు ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల అదనంగా వేతనాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో కంపెనీపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
భూగర్భ గనులు, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లో యంత్రాలు పనిచేసే చోట, వర్క్‌షాపులు, సంబంధిత విభాగాల్లో ఓటీ డ్యూటీలు ఎక్కువగా ఉంటున్నాయనేది స్పష్టమవుతోంది. గనుల్లో ఏదైనా యంత్రం నిలిచిపోతే మరమ్మతు పేరుతో ఉన్న సమయాన్ని సదరు టెక్నీషియన్లు వెచ్చిస్తున్నారు. అయితే తిరిగి ఆ యంత్రానికి అవసరమైన పరికరాన్ని తీసుకెళ్లి బిగిస్తేనే అది నడుస్తుంది. ఆ తర్వాతనే అది బొగ్గు ఉత్పత్తిలో భాగస్వామ్యమవుతుంది. అయితే నిలిచిపోయిన యంత్రాలకు తక్కువ సమయంలో మరమ్మతు చేయాల్సి ఉన్నప్పటికీ కొందరు టెక్నీషియన్లు కావాలనే కాలక్షేపం చేస్తూ తన డ్యూటీ సమయం అయిపోయిందని వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్నారు.
ఈ క్రమంలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో సంబంధిత సెక్షన్ సూపర్‌వైజర్లు, అధికారులు సదరు టెక్నీషియన్‌ను బతిమిలాడి యంత్ర మరమ్మతులు పూర్తిచేయడానికి ఓవర్‌టైమ్ కేటాయిస్తున్నారు. ఇందుకోసమే వేచిచూసే వారు ఆ యంత్రానికి మరమ్మతులు చేపట్టి ఓవర్‌టైమ్ పొందుతున్నట్లు తెలుస్తోంది. గంట సమయం అదనంగా పనిచేస్తే రెండు గంటల ఓవర్‌టైమ్ వేతనాన్ని యాజమాన్యం చెల్లిస్తోంది. దీంతో సాధారణ డ్యూటీ కన్నా ఓటీ పనులపైనే దృష్టి పెడుతున్నట్లు గుర్తించిన యాజమాన్యం ఓటీల సంఖ్యను తగ్గించి డ్యూటీ సమయంలోనే యంత్రాల మరమ్మతులు చేయించేలా ఆయా గనులు, ఓసీపీల అధికారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఓటీలను ఇవ్వడాన్ని ప్రోత్సహిం చకూడదని క్షేత్రస్థాయి అధికారులకు సూచించినట్లు తెలిసింది. అయితే యంత్రాలు మరమ్మతులకు గురైనపుడు అవసరమైన స్పేర్‌పార్ట్స్ అందుబాటులో ఉంచాల్సిన యాజమాన్యం అలా చేయకపోవడం వల్లనే ఓటీలలో పనిచేయాల్సి వస్తున్నదనే వాదన సైతం వినిపిస్తోంది. ఈ విధానంపై పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరిగితేనే ఓటీల సంఖ్య తగ్గే అవకాశం ఉందని సీనియర్లు పేర్కొంటున్నారు.
డ్యూటీ కన్నా ఓటీ పైనే ప్రేమ
Published Mon, Jan 12 2015 10:15 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement