మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : సింగరేణి సమస్యల పుట్టగా మారింది. కార్మికులు కష్టాల కొలిమిలో సతమతం అవుతున్నారు. తమ బాధలు తీర్చి.. సమస్యలు పరిష్కరించే వారి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటుతో కొత్త ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నారు. తమ సమస్యలు తీరుస్తారని ఆశిస్తున్నారు. సింగరేణి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది.
వీటి పరిధిలో భూగర్భ గనులు, 15 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి. దాదాపు 64 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. కోల్‌బెల్ట్‌లో 11 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల.. కరీంనగర్ జిల్లాలోని మంథని, రామగుండం.. వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి.. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం అసెంబ్లీ స్థానాలను.. అదేవిధంగా ఐదు పార్లమెంటు స్థానాలకు ఆదిలాబాద్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి పార్లమెంటు స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను సింగరేణి కార్మికులు గెలిపించారు.
మెజార్టీ ప్రజాప్రతినిధులతోపాటు గుర్తింపు సంఘం కూడా టీఆర్‌ఎస్‌కు అనుబంధం కావడంతో కార్మికులు వీరిపై ఆశలు పెట్టుకున్నారు. కార్మికుల సమస్యలు తీర్చడంతోపాటు సింగరేణి సంస్థ అభివృద్ధిపై కూడా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆశలతో ఎదురు చూస్తున్నారు.
గుర్తింపు సంఘం
సింగరేణి కార్మిక గుర్తింపు సంఘంగా టీఆర్‌ఎస్ అనుబంధ సంఘం టీబీజీకెఎస్ 2012 జూన్‌లో గెలిచింది. గెలిచిన కొద్ది రోజులకే సంఘంలో గ్రూపు తగాదాలు తలెత్తి కార్మికుల సమస్యలు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. సంఘం అంతర్గత కలహాలను ఆసరా చేసుకుని యాజమాన్యం కార్మికులను వేధింపులకు గురిచేస్తోందని సంఘం కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. సంఘం ఆధిపత్య పోరు కాస్త కోర్టు వరకు వెళ్లి అంతర్గత ఎన్నికల్లో బలాబలాలు చూసుకోవాల్సిన పరిస్థితి మొట్ట మొదటిసారిగా సింగరేణి చరిత్రలో తెచ్చి నమ్మిన కార్మికులకు తలవంపులు తెచ్చిపెట్టారు. ఈ సమస్యను పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చొరవ తీసుకొని అంతర్గత గొడవను పరిష్కరించినచో అధికారుల నుంచి వేధింపులు తగ్గుతాయని కార్మికులు ఆశపడుతున్నారు.
స్ట్రక్చర్ సమావేశం
అధికారులకు, కార్మికులకు మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉండటానికి ఈ సమావేశం ఎక్కువగా ఉపయోగపడుతుంది. సింగరేణి ఉన్నతాధికారులతో గుర్తింపు సంఘం దశలవారీగా సమావేశం నిర్వహించి గని, ఏరియా, సింగరేణిస్థాయి సమస్యలు పరిష్కరించాలి. చివరి సమావేశం తేదీ 05-03-2013న జరిగింది. అప్పటినుంచి సమావేశం లేదు. దీంతో కార్మికుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంలా తయారైంది. గడిచిన 14 నెలల నుంచి యాజమాన్యంతో చర్చలు లేవంటే కార్మికుల పరిస్థితి ఏ మేరకు ఉందో తెలిసి పోతుంది.
రక్షణ వారోత్సవాలు
సింగరేణి వ్యాప్తంగా గనులు, డిపార్ట్‌మెంటులవారీగా ఏటా యాజమాన్యం రక్షణ వారోత్సవాలు నిర్వహించాలి. ప్రతి డిసెంబర్ నుంచి జనవరి వరకు వారోత్సవాలను కార్మికుల సమక్షంలో జరిపి వారికి రక్షణ పై అవగాహన కల్పిస్తారు. దీంతో గనిలో ప్రమాదాలు అరికట్టడంతోపాటు నివారించడానికి అవగాహన ఉపయోగ పడుతుంది. ఈ ఏడాది సింగరేణిలో ఎక్కడ కూడ రక్షణ వారోత్సవాలను గుర్తింపు సంఘం గ్రూపు తగాదాల నేపథ్యంలో అధికారులు నిర్వహించలేక పోయారనే ఆరోపణలు కార్మికుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
జన్మభూమి పథకం
ప్రతి గనిలో జన్మభూమి పథకం పేరిట అధికారులు కార్మికుల హోదాతో సంబంధం లేకుండా ఉపరితల పనులను అదనంగా చేయిస్త్తున్నారు. మస్టరు పడగానే వారివారి పనిలోకి వెళ్లే ముం దు ఉపరి తలం పైన ఉన్న అదనపు పనులను కార్మికులచే చేయించడాన్ని గుర్తింపు సంఘం పట్టించు కోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకం అమలు తీరుపై కార్మికులు సంఘంపై గుర్రుగా ఉన్నారు.
గాలి సరఫరా
భూగర్భ గనిలో కార్మికులకు సరిపడేంత పరిశుభ్రమైన గాలిని సరఫరా చేసే బాధ్యత ఆ గని ఉన్నతాధికారులది. మూడు బదిలీల సమయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కార్మికులకు సరిపడేంత గాలి, సరి పడేంత పర్యవే క్షణలో సరిచూసుకోవాలి. ఈ సమస్యపై కార్మికులు గగ్గోలు పెట్టినా అధికారులు, గుర్తింపు సంఘం నాయకులు పట్టించుకోవడం లేదు.
పనిముట్లు
బొగ్గు ఉత్పత్తికి ఉపయోగపడే వస్తువులతోపాటు కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు కూడా సకాలంలో ఇవ్వకుండా కార్మికులపై అధికారులు పనిభారం పెంచినా నాయకులు పట్టించుకోక పోవడంపై కార్మికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు నాణ్యమైన బూట్లు, డ్రిల్ రాడ్, బిట్స్, ఏకరూప దుస్తులు, నూతన సాంకేతిక పరిజ్ఞానంకు సరిపడే ఎలక్ట్రికల్, ఫిట్టర్ పనిముట్లు నేటికి కార్మికులకు సకాలంలో సరఫరా కావడం లేదు. దీంతో కార్మికులపై పనిభారం పడుతోంది.
విజిలెన్స్
సింగరేణిలో అవినీతిని అరికట్టడానికి ఈ విభాగాన్నియాజమాన్యం నియమించింది. అవినీతిని పక్కకు పెట్టి ఆకాశరామన్న ఉత్తరాలకే ప్రధాన్యతను ఇస్తూ అమాయక కార్మికులను వేధించడానికి మాత్రమే ఈ విభాగం పనిచేస్తున్నదనేది జగమెరిగిన సత్యం. ఇటీవల బొగ్గు కుంభకోణమే విజిలెన్స్ పని విధానానికి తార్కాణం. దీన్ని అరికట్టని నేపథ్యంలో కార్మికులు బలి కాక తప్పదు.
ఆదాయపు పన్ను
జాతీయ స్థాయిలో ఎయిర్ ఫోర్స్, నేవీ, రక్షణ విభాగాల్లో పనిచేసే వారికి ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది. అంత కంటే ప్రమాధకర పరిస్థితుల్లో కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి కూడా ఆదాయపు పన్ను మినహాయింపు చట్టాన్ని తీసుకొస్తామని టీఆర్‌ఎస్ నాయకులు హామీ ఇచ్చారు. ఈ హామీకి కట్టుబడి గెలిచిన నాయకులు ఉండాలి.
డిపెండెంట్ ఉద్యోగాలు
సింగరేణిలో రద్దయిన డిపెండెంట్ ఉద్యోగాలను మళ్లీ పునరుద్ధరిస్తామని గుర్తింపు సంఘం ఎన్నికలతోపాటు, ఇటీవలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నాయకులు కార్మికులకు హామీ ఇచ్చారు. 2002 రద్దయిన ఈ పథకం నేటికి అమలుకు నోచుకోలేదు. దీనిని అమలు చేయాల్సిన బాధ్యత గెలిచిన ప్రజాప్రతినిధులపై ఉంది.
వైద్య, విద్య
సింగరేణిలో ఉన్న ప్రస్తుల ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయిలో అన్ని వసతులతో తీర్చిదిద్ది కార్మికులకు అందుబాటులోకి తీసుకురావల్సిన అవసరం ఉంది. మెరుగైన చికిత్స కోసం ప్రస్తుతం యాజమాన్యం హైదరాబాద్ పంపి చేతులు దులుపుకుంటుంది. అదే విధంగా కార్మికులు తమ పిల్లల నాణ్యమైన విద్య కోసం కార్పొరేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. దీనిని అరికట్టడానికి సింగరేణి పాఠశాలలను ఆధునికీకరించాలి.
కొత్త గనులు
సింగరేణిలో ఉపరితల గనుల నిర్మాణం నిలిపివేయాలి. భూగర్భ గనుల నిర్మాణం చేపట్టి యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి. దీంతోపాటు బొగ్గు ఆధారిత పరిశ్రమలను స్థాపించి యువతకు ఉపాధి చూపే విధంగా ఎంపీలు, ఎమ్యెల్యేలు చొరవ చూపాలి.
సమ్మె వేతనం
తెలంగాణ రాష్ట్రం అవతరణ కోసం కార్మికులు సకల జనుల సమ్మెలో నెల రోజులపాటు పాల్గొని ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఈ సమ్మె వేతనాన్ని ఇప్పిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. అమలు చేయాల్సిన బాధ్యత గెలిచిన నాయకుల అందరిపై ఉంది.
ఆదరించాం.. ఆదుకోండి..!
Published Tue, May 20 2014 1:37 AM | Last Updated on Sun, Sep 2 2018 4:19 PM
Advertisement
Advertisement