తమ్ముడూ.. రాఖీ కట్టించుకోకుండా వెళ్లావేంట్రా.. | Sister tie Rakhi her brother dead body | Sakshi
Sakshi News home page

తమ్ముడూ.. రాఖీ కట్టించుకోకుండా వెళ్లావేంట్రా..

Published Tue, Aug 8 2017 8:13 AM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM

తమ్ముడి మృతదేహానికి రాఖీ కడుతున్న సోదరి - Sakshi

తమ్ముడి మృతదేహానికి రాఖీ కడుతున్న సోదరి

‘‘ఒరేయ్‌ తమ్ముడూ.. నాకు అండగా ఉంటావనుకున్నాన్రా.. రాఖీ కట్టించుకోకుండా వెళ్లావేంట్రా...?’’ అంటూ అక్క శిరీష గుండె బాదుకుంటూ ఏడుస్తుంటే.. చూపరులంతా చలించిపోయారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.
 
ఖమ్మం‌: సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువులో ఆదివారం గల్లంతైన యువకుడు కొక్కొండ వినోద్‌చారి(22) మృతిచెందాడు. వినోద్‌చారి మృతదేహాన్ని చూడగానే తల్లి విజయలక్ష్మి, తండ్రి గిరిబాబు, అక్క శిరీష గుండె పగిలేలా రోదించారు. బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్నేహితుల రోజున గల్లంతై, రక్షాబంధన్‌ నాడు విగతుడిగా బయటికొచ్చాడు.
 
తమ్ముడికి అదే చివరి రాఖీ..! 
సత్తుపల్లి ఆస్పత్రి మార్చురీలో వినోద్‌ మృతదేహం. పక్కనే అక్క శిరీష కూర్చుంది. తమ్ముడి మొహం వైపూ చూస్తూ.. ‘‘ఒరేయ్‌ తమ్ముడూ.. లేవరా... రాఖీ కట్టించుకోరా...!’’ ఏడుస్తూనే ఉంది. ఇంతలో ఎవరో రాఖీ తీసుకొచ్చి ఆమె చేతికిచ్చారు. తమ్ముడి చేతిని లేపి ఆ రాఖీ కడుతూనే.. ‘‘తమ్ముడూ.. నీకు ఇదే చివరి రాఖీరా... ఇక నుంచి నేనెవరికి కట్టాలిరా..?’’ అని కన్నీటితో ప్రశ్నిస్తూ మృతదేహంపై పడిపోయింది. అక్కడున్న అందరి హృదయాలు.. ఆ దృశ్యంతో బరువెక్కాయి. కొందరు మౌనంగా.. ఇంకొందరు బిగ్గరగా రోదించారు.
 
ముందు రోజు ఏం జరిగిందంటే...
ఆదివారం.. స్నేహితుల దినోత్సవం. సత్తుపల్లి పట్టణానికి చెందిన మల్లిశెట్టి హిమకిరణ్, కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన గోల్డ్‌ షాపు యజమాని కొక్కొండ గిరిబాబు కుమారుడు వినోద్‌చారి(22) మంచి మిత్రులు. సత్తుపల్లిలోని సాయిస్ఫూర్తి కళాశాలలో డిప్లొమా కోర్సు చదివారు. నెల్లూరులో మల్లిశెట్లి హిమకిరణ్, హైదరాబాద్‌లో కొక్కొండ వినోద్‌.. ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. స్నేహితుల దినోత్సవం రోజున సత్తుపల్లిలో మిగతా మిత్రులతో సరదాగా గడిపారు.
 
ఆదివారం ఉదయం ఈ ఇద్దరు కలిసి బేతుపల్లి చెరువు అలుగు చూసేందుకు కారులో వెళుతున్నారు. అది అదుపుతప్పి అదే చెరువులోకి దూసుకెళ్లింది. ఇద్దరూ అతి కష్టంగా డోర్లు తెరుచుకుని పైకి చేరుకున్నారు. ఇంతలో స్థానికులు వచ్చి వారిద్దరినీ ఒడ్డుకు తీసుకొస్తున్నారు. అంతలోనే, వినోద్‌ చేతిలోని సెల్‌ఫోన్‌ పడిపోయింది. దానిని తీసుకునేందుకు అతడు ఒక అడుగు ముందుకు వెళ్లాడు. రక్షించేందుకు వచ్చిన వారి చేతిలో నుంచి జారి చెరువులోని నీటిలో పడిపోవడం.. గల్లంతవడం క్షణాల్లో జరిగిపోయింది.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement