గోల్డెన్ గోల్‌మాల్ కు చెక్..! | Six Surveyors Special group with Formation | Sakshi
Sakshi News home page

గోల్డెన్ గోల్‌మాల్ కు చెక్..!

Published Sat, Dec 6 2014 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM

Six Surveyors Special group with Formation

- భూముల పరిరక్షణకు నడుం బిగించిన కలెక్టర్
- చౌటుప్పల్ మండలంలో 1250ఎకరాలకుపైగా గోల్డెన్ ఫారెస్ట్ భూములు
- దాదాపు 600ఎకరాలకుపైగా అన్యాక్రాంతం
- ఆరుగురు సర్వేయర్లతో ప్రత్యేక బృందం ఏర్పాటు
- నాలుగు రోజులుగా కొనసాగుతున్న సర్వే

 చౌటుప్పల్ : చౌటుప్పల్ పరిధిలో గోల్డెన్‌ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేసిన భూముల్లో నెలకొన్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు జిల్లా యం త్రాంగం రంగంలోకి దిగింది. భువనగిరి డివిజనల్ సర్వేయర్ నేతృత్వంలో ఐదుగురు సర్వేయర్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సభ్యులు నాలుగు రోజులుగా సర్వే చేస్తున్నారు. గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ సంస్థ.. 1995లో మూడేళ్లలో మీ డబ్బుకు రెట్టింపు సొమ్ము ఇస్తామని దేశవ్యాప్తంగా డిపాజిట్లు సేకరించి చౌటుప్పల్ మండలంలోని చౌటుప్పల్, తాళ్లసింగారం, లింగోజిగూడెం, తంగడపల్లి, పంతంగి గ్రామాల పరిధిలో 1258ఎకరాల భూములను కొనుగోలు చేసింది. ఆ తరువాత కాలంలో సంస్థ బోర్డు తిప్పేయడంతో, సంస్థ చైర్మన్‌ను పలు అవినీతి ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసి, జైలుకు పంపారు.

ఈ నేపథ్యంలో సంస్థలో డిపాజిట్లు చేసిన పలువురు డిపాజిట్‌దారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. చైర్మన్ జైలులోనే మృతిచెందారు. న్యాయస్థానం లిక్విడేటర్‌ను నియమించి, భూములను వేలం వేసి డిపాజిట్‌దారులకు సొమ్ము చెల్లించాలని తీర్పునిచ్చింది. భూముల వేలంపాటకు పలుమార్లు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. వివిధ కారణాలతో వేలంపాటలు పూర్తి కావడం లేదు.
 
అక్రమాలకు తెరతీసిన రెవెన్యూ అధికారులు
రెవెన్యూశాఖ లెక్కల ప్రకారం చౌటుప్పల్ మండలంలో గోల్డెన్‌ఫారెస్టు సంస్థకు 1258ఎకరాల భూములు ఉన్నాయి. కానీ వాస్తవానికి  అంతకంటే ఎక్కువే భూములున్నాయి. గోల్డెన్‌ఫారెస్ట్ సంస్థ కొనుగోలు చేసిన భూములన్నింటినీ తహసిల్దార్ కార్యాలయంలో రికార్డు మార్పిడీ చేయించలేదు. కొనుగోలు సమయంలోనే సంస్థలో చక్రం తిప్పిన ఇద్దరు తమ భార్యల పేరున భూములను రిజిస్ట్రేషన్ చేయించారు. సంస్థ పేరునే భూములున్నా అన్ని డాక్యుమెంట్‌లను సుప్రీంకోర్టుకు సమర్పించలేదు. చైర్మన్ అరెస్టు అనంతరం ఆ ఇద్దరు, రెవెన్యూ అధికారులు రెవెన్యూ చట్టాల్లోని లోపాలను ఆసరాగా చేసుకొని అక్రమాలకు తెరతీశారు. ఈ భూములున్ని హైవేకు ఇరువైపులా ఉండడం, 2005లో వచ్చిన రియల్ భూంతో ఈ భూములపై కన్నేశారు.

ఈ సమయంలో ఇక్కడ పని చేసిన తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు కొంతమంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని గోల్డెన్‌ఫారెస్టు సంస్థకు భూములను అమ్మిన రైతులు వృద్ధాప్యంలో ఉన్నారని, వారి వారసులని భార్యలు, కూతుళ్లు, కొడుకుల పేర రెండోసారి పట్టాపాస్‌పుస్తకాలు ఇచ్చారు. సదరు ఏజెంట్ల సహకారంతో భూములను అమ్మకానికి పెట్టారు. ఆ రైతు వచ్చి భూములను పట్టా చేసినందుకు ఎకరాకు ఇంత అంటూ ముట్టజెప్పారు. ఆ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు తక్కువ రే ట్లకు కొనగోలు చేసి, వెంచర్లు చేశారు. కొందరు కంపెనీలు పెట్టారు . ఇలా రెవెన్యూ ఉద్యోగులు, ఏజెంట్లు, రియల్ వ్యాపారులు కోట్లకు పడగలెత్తారు. ఆ తరువాతికాలంలో వచ్చిన మరికొందరు తహసీల్దార్‌లు కూడా ఇదే అక్రమ దందాను కొనసాగించారు. ఇలా దాదాపు 600ఎకరాల భూమి అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయింది. పలు కంపెనీ యజమానులు కూడ వందలాది ఎకరాల భూములను కబ్జాపెట్టారు.
 
భూముల పరిరక్షణకు సర్వే
 గోల్డెన్ భూముల్లో అక్రమాలకు పాల్పడి, రెవెన్యూ అధికారులు సస్పెన్షన్‌కు కూడ గురయ్యారు. ఇటీవల కాలంలో లింగోజిగూడెం శివారులో ఏర్పాటైన ఓ వెంచర్‌పై పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. సీఎం పేషీ వరకు ఫిర్యాదులు వెళ్లాయి. జిల్లా కలెక్టర్‌కు కూడ ఫిర్యాదులు చేశారు. వరుసగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ భూముల పరిరక్షణకు సర్వే చేసి, హద్దురాళ్లు నాటాలని నిర్ణయించారు. మొదటగా ఇతరుల కబ్జాల్లోని వెలికితీసేందుకు ఆరుగురు సర్వేయర్లతో బృందాన్ని ఏర్పాటు చేశారు. నాలుగు రోజులుగా సర్వే జరుగుతోంది. రామన్నపేట, చౌటుప్పల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గోల్డెన్ సంస్థ పేరిట రిజిస్ట్రేషన్ అయిన భూముల వివరాలను తీసుకొని, దాని ఆధారంగా సర్వే చేస్తున్నారు. సర్వే పూర్తి కాగానే అక్రమార్కుల చెరలో ఉన్న భూములన్నింటినీ స్వాధీనం చేసుకోనున్నారు. భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటాం : ఎన్.మధుసూదన్, ఆర్డీఓ, భువనగిరి చౌటుప్పల్, బీబీనగర్ మండలాల్లోని గోల్డెన్ ఫారెస్టు సంస్థకు చెందిన భూములన్నింటినీ సర్వే చేయిస్తున్నాం. చౌటుప్పల్ పూర్తికాగానే, బీబీనగర్‌లో సర్వే చేయిస్తా. ఇప్పటికే పలు కంపెనీలు కూడా భూములను ఆక్రమించినట్టు తేలింది. సర్వే తర్వాత భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement