
గాలిలో తేలుతూ ఆకాశ అందాలను తిలకిస్తూ విందు ఆరగిస్తే ఎంత బాగుంటుందో కదా! భూమికి 160 అడుగుల ఎత్తులో రుచుల ఘుమఘుమలు ఆస్వాదిస్తే భలేగా ఉంటుంది కదా! ఈ వినూత్న అనుభవం మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన స్కై డైనింగ్ రెస్టారెంట్ ద్వారా నగరవాసులకు అందుబాటులోకి రానుంది.
సాక్షి, సిటీబ్యూరో: దేశంలోనే రెండో స్కై డైనింగ్ రెస్టారెంట్ నగరంలో కొలువుదీరింది. గాల్లో తేలుతూ చవులూరించే రుచులను ఆస్వాదించే వినూత్న అనుభవం నగరవాసులకు అందుబాటులోకి రానుంది. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెస్టారెంట్ రూపకర్తలు, క్లౌడ్ డైనింగ్ రెస్టారెంట్స్ డైరెక్టర్లు దేవిదత్ కొలి, తరుణ్ కొలి ఈ స్కై డైనింగ్ వివరాలు తెలిపారు. మాదాపూర్‌లోని శిల్పారామం ఎదురుగా రెస్టారెంట్ నెలకొల్పామని, క్రేన్ల సహాయంతో అతిథులను 160 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లి విందు ఆస్వాదించే ఏర్పాటు దీని ప్రత్యేకత అని తెలిపారు. ఈ రెస్టారెంట్‌ను శనివారం ప్రారంభించనున్నట్లు చెప్పారు. నోయిడాలో తొలి రెస్టారెంట్ నెలకొల్పా మన్నారు. ఇందులోకి 14 ఏళ్లలోపు పిల్లలకు ప్రవేశం లేదు. ఈ రెస్టారెంట్‌లోకి వెళ్లాలంటే ఒక్కొక్కరికీ రూ.4,999.