స్మార్‌టలో వరంగల్ టూరిజం
- ఆండ్రాయిడ్‌లో ఆవిష్కృతం
- అప్లికేషన్ రూపొందించిన నగర యువత
- రాడన్‌సోల్, యూడ్ క్యాంపస్ సంస్థల సహకారం
సాక్షి, హన్మకొండ: స్మార్ట్ ఫోన్లలో ఆండ్రాయిడ్ వేదికపై కాకతీయుల గడ్డ వివరాలను తెలిపే అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు వరంగల్‌లో పర్యాటక ప్రాంతాల వివరాలను తెలిపేందుకు తొలిసారిగా ‘వరంగల్ టూరిజం’ పేరుతో ఆండ్రాయిడ్ అప్లికేషన్ రూపొందించారు. ఖిలావరంగల్, కాకతీయ తోరణాలు, లక్నవరం, రామప్ప, పాకాల చెరువు వంటి పర్యాటక ప్రాంతాల వివరాలు ఇందులో ఉన్నాయి.
అదేవిధంగా వరంగల్ నగర మ్యాప్, ఇక్కడున్న త్రీస్టార్ హోటళ్ల వివరాలు ఈ యాప్‌లో పొందుపరిచారు. ఈ యాప్ బీటా వెర్షన్ కావడంతో పూర్తిస్థాయిలో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంది. ఈ అప్లికేషన్ రూపకల్పనలో వరంగల్ నగరానికి చెందిన జి.సుశాంత్ , జి.ప్రీతమ్, డి.వైదేహీ, జె.భానుకిరణ్, కె.శ్రావ్య, సల్మాన్ షరీఫ్, పి.వైష్ణవి, శ్రీదత్త మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు పాల్గొన్నారు. రాడన్‌సోల్, యాడ్ క్యాంపస్ సంస్థలు యాప్ రూపకల్పనకు సహకారం అందించాయి.
కేవలం 45 నిమిషాల వ్యవధిలోనే ఈ ఆప్‌ను గత ఆదివారం రూపొందించి గూగుల్ పరిశీలనకు పంపించారు. ఆండ్రాయిడ్ మొబైల్‌లో ప్లేస్టోర్‌లోకి వెళ్లి.. వరంగల్ టూరిజం అని టైప్ చేసి ఈ ఆప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్ సెర్చింగ్‌లో త్వరగా ఈ ఆప్ కనిపించకపోతే రాడన్‌సోల్ వరంగల్ టూరిజం అని టైప్ చేయడం ద్వారా సులువుగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.