కటికాల రాజేష్
హిమాయత్‌నగర్: రాత్రి పది గంటల సమయంలో రోడ్డుపై ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటుంటే కానిస్టేబుల్ ఓ వ్యక్తిని చితకబాదాడు. దీనిపై మానవహక్కుల పరిశీలకుల సంఘం(హ్యూమన్ రైట్స్) డైరెక్టర్ కటికాల రాజేష్ స్పందించి కానిస్టేబుల్ సస్పైండ్ అయ్యేలా కృషి చేశాడు.
పసిబిడ్డ ఊపిరాడక చనిపోయే స్థితిలో ఉందని రక్షించాలని ఓ కార్పొరేట్ ఆసుపత్రిని ఆశ్రయించిన ఆ తల్లిదండ్రులకు చిక్కులు ఎదురయ్యాయి. మిషన్ వాడకుండానే పసిబిడ్డ కన్నుమూసింది.అయితే మీ పాప కోసమే మిషన్ తెచ్చామంటూ రూ.5లక్షలు బలవంతంగా దోచుకుని బిడ్డ శవాన్ని ఇచ్చారు. ఈ విషయంలో రాజేష్ చొరవ చూపి కన్నీటి పర్యంతంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు అండగా నిలిచి హాస్పిటల్ యాజమాన్యం దోచుకున్న ఆ రూ.5లక్షలు తిరిగి ఇప్పించాడు.
కంటికి కనిపించే ఈ రెండు ఘటనలు ఉదాహరణలు మాత్రమే. ఇటువంటి పదుల సంఖ్యలో తనవంత బాధ్యతగా పరిష్కరిస్తూ అమాయక ప్రజలు, బాధితులకు అండగా నిలుస్తున్నాడు రాజేష్.
ఖమ్మంలోని శ్రీనగర్‌కు కాలనీకి చెందిన కృష్టఫర్‌బాబు, జ్యోతిల కుమారుడు రాజేష్. తండ్రి ఖమ్మంలోని ఓ కాలేజ్‌లో ఫిజికల్ డైరెక్టర్‌గా చేస్తుండగా, తల్లి జ్యోతి గృహిణి. వీరు 30 ఏళ్ల క్రితం మాదాపూర్‌లో స్థిరపడ్డారు. రాజేష్ సాగర్‌రోడ్డులోని రాజమహేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఇంజనీరింగ్‌ను పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి సేవ చేయాలనే ఆలోచనతో ఉన్న రాజేష్ ఏడేళ్ల క్రితం మానవహక్కుల పరిశీలకుల సంఘం డైరెక్టర్‌గా విధుల్లో చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతని వద్దకు వస్తున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఓ వైపు ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్‌గా చేస్తూ హ్యూమన్‌రైట్స్‌లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. సొంతడబ్బులతో సమస్యలు పరిష్కరిస్తూ, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు.
వందల కొద్దీ సమస్యలు
రోజుకు పదుల సంఖ్యలో సమస్యలు. ఆ సమస్యలు పరిష్కరించాలి అంటే చాలా ఓపిక కావాలి. పోలీస్ శాఖకు చెందిన సమస్యలపై ఉన్నత అధికారులతో ఒకటికి రెండు సార్లు సంప్రదించి వారి సూచనలతో సమస్యలను పరిష్కరిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద రాత్రి 10గంటల సమయంలో ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు. ‘ఏంట్రా ఇక్కడ మీరు ఈ టైంలో ఉన్నారంటూ ప్రశ్నించాడో కానిస్టేబుల్. ఏమీ లేదు సర్, ఫ్రెండ్ వస్తే మాట్లాడుతున్నానంటూ రవి అనే వ్యక్తి బదులిచ్చారు. నాకే ఎదురు సమాధానం చెబుతావా అంటూ అందరూ చూస్తుండగానే రవిని కానిస్టేబుల్ కొట్టాడు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతం అవుతూ హ్యూమన్ రైట్స్ రాజేష్‌ను ఆశ్రయించాడు. దీంతో బాధితుడికి న్యాయం చేసేవరకు రాజేష్ నిద్రపోలేదు. ఇలా అనేక సమస్యలను పరిష్కరిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు రాజేష్.
ఇంకా అనేక సేవలు...
నగరంలోని దేవాలయల వద్ద ఆకలితో అలమటిస్తున్న వారిని చేరదీస్తాడు రాజేష్. సమీపంలోని హోటల్‌కు తీసికెళ్లి వారికి కడుపునిండా అన్నం పెట్టిస్తాడు. మంచి బట్టలు కొనుక్కోమని డబ్బులు కూడా ఇస్తాడు. ఇటువంటి వారికి ఓ ఆదరణ, గూడు కల్పించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నట్లు రాజేష్ వివరించారు. నగరంలోని పలు కూడళ్ల వద్ద బిచ్చమెత్తుకునే వారికి, రోడ్లపై రాత్రి సమయంలో నిద్రపోయే వారికి దుప్పట్లు, ఆహార పొట్లాలు పంచడం రాజేష్ ఆనవాయితీగా మలుచుకున్నాడు.
పరిష్కరించే వరకు నిద్రపట్టదు
మానవహక్కుల పరిశీలకుల సంఘం డైరెక్టర్‌గా నా వద్దకు వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నాను. బాధితులు మా వద్దకు ఎంతో ఆశతో వస్తారు. వారితో మాట్లాడి వారికి ఏ ఇబ్బంది కలగకుండా సమస్య పరిష్కానికి కష్టపడుతున్నాను. ఎవ్వరి ఏ ఇబ్బంది ఉన్నా..కార్యాలయానికి వచ్చి నేరుగా సంప్రదించవచ్చు.– కటికాల రాజేష్, మానవహక్కులపరిశీలకుల సంఘం డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment