పాలమూరులో సౌర వెలుగులు
ఐదు వేల ఎకరాల్లో వెయ్యి మెగావాట్ల విద్యుత్ కేంద్రం
తెలంగాణలో విద్యుత్ కొరత తీర్చేందుకు చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సోలార్ మిషన్‌లో భాగంగా మహబూబ్‌నగర్‌లో భారీ సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకానుంది. ఐదు వేల ఎకరాల్లో వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ఒప్పందాలను కుదుర్చుకుని, వెంటనే పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పారు. తెలంగాణ ఎదుర్కొంటున్న విద్యుత్ కొరతను తీర్చేందుకు అవసరమైన సహకారం అందిస్తామని, రాష్ర్టంలో 24 గంటల విద్యుత్ సరఫరాకు కృషి చేస్తామని శనివారం ఆయనను కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హామీ ఇచ్చారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో జరిగిన ఈ భేటీ సందర్భంగా రాష్ర్టంలో 4 వేల మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు, బొగ్గు కేటాయింపులపై చర్చ జరిగింది. ఇందుకు కావాల్సిన భూములు కేటాయిస్తే త్వరలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి పేర్కొనగా.. అందుకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ తెలిపారు. సమావేశం అనంతరం పీయూష్‌గోయల్ మీడియాతో మాట్లాడారు.
‘తెలంగాణ ముఖ్యమంత్రితో చాలా మంచి సమావేశం జరిగింది. కేంద్ర, రాష్ర్ట విద్యుత్ శాఖల అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నో అంశాలను అధికారులు ప్రస్తావించారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించాం. ప్రతి ఇంటికీ నాణ్యమైన, చౌకైన విద్యుత్ అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎన్టీపీసీ తరఫున తొలి దశలో 1,320 మెగావాట్ల ప్లాంట్‌ను వెంటనే ఏర్పాటు చేస్తాం. విడతలవారీగా సామర్థ్యాన్ని పెంచుతాం. సింగరేణికి సంబంధించి అవసరమైన అదనపు భూములు కేటాయించాలని కేసీఆర్‌ను కోరాను. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. భూ కేటాయింపులు జరిగిన వెంటనే పనులు ప్రారంభిస్తాం’ అని కేంద్ర మంత్రి వివరించారు. సోలార్ మిషన్‌లో తెలంగాణ రాష్ట్రానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. తెలంగాణలో ప్రస్తుతమున్న విద్యుత్ కొరత దృష్ట్యా అదనపు కేటాయింపులేమైనా చేస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. ప్రస్తుతానికి ఆ అవకాశం లేదన్నారు. సదరన్ గ్రిడ్‌ను పునరుద్ధరించకపోవడం వల్లే ఈ సమస్య ఉందని తెలిపారు. వచ్చే మార్చి వరకు వీలైనంత ఎక్కువ విద్యుత్‌ని కేటాయించే ప్రయత్నం చేస్తామన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య పీపీఏల రద్దు వివాదాన్ని ప్రస్తావించగా.. రాష్ర్ట విభజన చట్టం ప్రకారమే విద్యుత్ కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేశారు. కాగా, సౌర విద్యుత్ ప్లాంట్‌ను తన నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోతున్నందుకు కేంద్ర మంత్రికి ఎంపీ జితేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.