సిటీకి సోలార్ | Solar To City | Sakshi
Sakshi News home page

సిటీకి సోలార్

Published Mon, Apr 11 2016 1:28 AM | Last Updated on Mon, Oct 22 2018 8:25 PM

Solar To City

నగరంలో ఇక సౌరశక్తితో వీధి దీపాలు
భవనాలపై రూఫ్‌టాప్ ప్యానళ్లు
రోజుకు 5.6 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం 
‘స్మార్ట్‌సిటీ’తో చోటుచేసుకోనున్న మార్పులు

 

హన్మకొండ : వరంగల్ నగరానికి సోలార్ సొబగులు రానున్నాయి. కాలుష్య రహితంగా విద్యుత్ దీపాలు వెలిగించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. స్మార్ట్‌సిటీ పథకం ద్వారా వరంగల్ నగరంలో భారీ స్థాయిలో 5 మెగావాట్లకు పైగా సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుని సమగ్ర నివేదికను సిద్ధం చేశారు. దీనికి అదనంగా నగరంలో రోజూ వెలువడే తడి చెత్త ఆధారిత బయోగ్యాస్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు.

 
స్మార్ట్‌తో ఆరంభం

స్మార్ట్‌సిటీ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 100 నగరాల్లో వరంగల్ ఒకటి. తొలివిడత పథకం అమలుకు సంబంధించి జనవరిలో ప్రకటించిన 20 నగరాల జాబితాలో స్థానం దక్కించుకునే అవకాశం వరంగల్‌కు త్రుటిలో తప్పింది. దీంతో రెండో విడతలో కచ్చితంగా స్థానం దక్కేలా సమగ్ర నివేదికను  రూపొందించారు. దాదాపు రూ. 2861 కోట్లతో రూపొందించిన ఈ ప్రణాళికలో కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి పెద్దపీట వేశారు. అందులో భాగంగా బయోగ్యాస్ ప్లాంటు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. తడి, పొడి చెత్త నిర్వహణలో భాగంగా తడిచెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేలా బయోగ్యాస్ ప్లాంట్లు నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుతం నగరంలో రెండు బయోగ్యాస్ ప్లాంట్లు పని చేస్తుండగా స్మార్ట్‌సిటీ పథకం కింద మరో రెండు నెలకొల్పాలని సమగ్ర నివేదికలో పేర్కొన్నారు. భద్రకాళి ఆలయం రోడ్డు, కాపువాడ వద్ద ఈ ప్లాంట్లు నెలకొల్పాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

 
5 మెగావాట్ల సోలార్ విద్యుత్

నగరంలో అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను సద్వినియోగం చేసుకుంటూ రోజుకు కనీసం ఐదు మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం నగరంలో ఉన్న విద్యుత్ దీపాల్లో 2500 లైట్లను పూర్తిగా సోలార్ ప్యానెల్ ఆధారిత విద్యుత్ దీపాలుగా మార్చాలని నివేదికలో సూచించారు. అదేవిధంగా నగరంలో ఉన్న భవనాలపై ఫొటోవోల్టాయిక్ (పీవీ) సోలార్ ప్యానెల్స్ ఏర్పాటును ప్రోత్సహించనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ భవనాలపై పెద్ద ఎత్తున పీవీ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు నగరంలో ఉన్న చెరువు తీర ప్రాంతాలను సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా మారుస్తారు. దీని కోసం నగరంలో గుర్తించిన చెరువుల తీర ప్రాంతం వెంట సోలార్ విద్యుత్ గొడుగులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగర పరిధిలో ఉన్న 14 చెరువుల వెంట ఈ తరహాలో సౌరగొడుగులను అమరుస్తారు. సగటున ప్రతి పది మీటర్లకు ఒక కిలోవాట్ వంతున సోలార్ శక్తిని ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. మొత్తంగా స్మార్ట్‌సిటీ పథకం ద్వారా ప్రతి రోజు 5.6 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయూలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను నగర సామాజిక అవసరాలకు వినియోగిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement