హైదరాబాద్‌సిటీ (అమీర్‌పేట): కొత్తగా ఇల్లు నిర్మించుకున్న ఓ సైనికుడు గృహప్రవేశం కోసం ఇంటికి వచ్చాడు... అయితే, తండ్రి అనారోగ్యంతో మంచం పట్టడం.. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఆర్‌నగర్ ఎసై్స సైదులు కథనం ప్రకారం... అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడకు చెందిన ఎం.మధు పెద్ద కుమారుడు సతీష్ కుమార్(25) రెండేళ్ల క్రితం సైన్యంలో చేరి ప్రస్తుతం మీరట్‌లో పని చేస్తున్నాడు. ఎల్లారెడ్డిగూడలో ఇల్లు నిర్మించుకుని గృహప్రవేశం నిమిత్తం ఫిబ్రవరి 7న నగరానికి వచ్చాడు. మూడు రోజుల క్రితం గృహప్రవేశం పూర్తి చేసుకున్న సతీష్ గత రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు.
ఉదయానికి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెంది ఉన్నాడు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులతోనే సతీష్ ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్థారణకు వచ్చారు. మృతుడి తండ్రి మధుకు పక్షవాతం వచ్చి ఇంటికే పరిమితం కాగా తల్లి, తమ్ముడు, సోదరి బాగోగులు అతడే చూసుకుంటూ వస్తున్నాడు. సతీష్ డబ్బుతోనే ఇటీవల ఇల్లు నిర్మించారు. ఈ నేపథ్యంలో సుమారు రూ. 6 లక్షల అప్పు చేశాడు. తండ్రి అనారోగ్యంతో మంచం పట్టడం, అప్పుల కారణంగా అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇంటికి పెద్ద దిక్కైన సతీష్ మృతి చెందడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయాడు. సోదరుడు మహేష్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సైనికుడి ఆత్మహత్య
Published Thu, Feb 26 2015 12:41 AM | Last Updated on Mon, Oct 22 2018 8:44 PM
Advertisement