పేరు చెప్పరు.. ఊరూ చెప్పరు..!  | Somalian Refugees Staying In Hyderabad With Proper Certificate | Sakshi
Sakshi News home page

పేరు చెప్పరు.. ఊరూ చెప్పరు..! 

Published Thu, Nov 21 2019 7:51 AM | Last Updated on Thu, Nov 21 2019 7:52 AM

Somalian Refugees Staying In Hyderabad With Proper Certificate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పాక్‌ చెరలో చిక్కిన ప్రశాంత్‌ను భారత్‌కు తీసుకురావాలని అతడి తండ్రి బాబూరావు వేడుకుంటున్నారు. సైబర్‌ క్రైమ్‌లో చిక్కి, అక్రమంగా వచ్చినట్లు తేలి చంచల్‌గూడ జైల్లో ఉన్న ఇక్రమ్‌ను పాకిస్థాన్‌కు పంపాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు విషయాలు అటుంచితే... పాస్‌పోర్ట్, వీసా సహా ఎలాంటి ధ్రువీకరణపత్రాలు లేకుండా సిటీలో అక్రమంగా నివసిస్తూ చిక్కిన సోమాలియన్ల కథ మరోలా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) ఆధీనంలోని డిపోర్టేషన్‌ సెంటర్‌లో ఉన్న ఈ ఎనిమిది మంది తమ స్వదేశానికి వెళ్లేదేలేదని మొండికేస్తున్నారు. తమ వివరాలు చెప్పకుండా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. అక్రమంగా నివసిస్తూ పట్టుబడిన విదేశీయులతో పాటు వివిధ నేరాల్లో చిక్కిన వారినీ పోలీసులు అరెస్టు చేయడం, తమ ఆధీనంలోకి తీసుకోవడం చేస్తారు. వీరిపై సంబంధిత కేసులు నమోదు చేసిన తర్వాత దాని తీరును బట్టి తదుపరి చర్యలు తీసుకుంటారు.

వీరిని ఆయా దేశాలకు బలవంతంగా తిప్పి పంపడానికి (డిపోర్టేషన్‌) ప్రయత్నాలు చేపడతారు. అవి పూర్తయ్యే వరకు అధీకృత ప్రదేశం/ప్రాంతంలో వారిని నిర్భంధించి ఉంచుతారు. దీన్నే పారిభాషికంగా డిపోర్టేషన్‌ సెంటర్‌గా పిలుస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ సెంటర్‌ విశాఖపట్నంలో ఉండేది. రాష్ట్రంలో ఎక్కడ చిక్కిన వారినైనా అక్కడే ఉంచి డిపోర్టేషన్‌ ప్రక్రియ చేపట్టేవారు. రాష్ట్ర విభజన అనంతరం చాలా కాలం పాటు తెలంగాణలో ఇలాంటి సెంటర్‌ ఏర్పాటు చేయలేదు. ఆరు నెలల క్రితమే హైదరాబాద్‌ సీసీఎస్‌ను డిపోర్టేషన్‌ సెంటర్‌గా నిర్దేశిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అప్పటి నుంచి నగరంలో పట్టుబడిన విదేశీయులను ఇక్కడే ఉంచుతున్నారు. రెండు నెలల క్రితం నగర వ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చేసిన దాడుల్లో ఎలాంటి పత్రాలు లేకుండా నివసిస్తున్న ఎనిమిది మంది నల్లజాతీయులకు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిని వెంటనే ఆయా దేశాలకు పంపడం సాధ్యం కావట్లేదు. చిక్కిన వివరాలను ఫారినర్స్‌ రీజనల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌కు (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) పంపి, అక్కడి నుంచి ఆయా దేశాలకు చెందిన ఎంబసీలకు సమాచారం ఇవ్వడం ద్వారా వివరాలు పొంది, వారి సహకారంతోనే డిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.

ఇది పూర్తయ్యే వరకు డిపోర్టు కావాల్సిన వారిని సీసీఎస్‌ ఆధీనంలోని డిపోర్టేషన్‌ సెంటర్‌లోనే ఉంచుతున్నారు. ప్రస్తుతం ఈ సెంటర్‌లో నైజీరియన్, సోమాలియా, సూడన్‌ దేశాలకు చెందిన వారు డిపోర్టేషన్‌కు సిద్దంగా ఉన్నారు. మిగిలిన వారితో ఇబ్బంది లేకపోయినా సోమాలియా దేశానికి చెందిన వారు మాత్రం తమ స్వదేశానికి వెళ్లేందుకు విముఖత చూపుతున్నారు. అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తాము తిరిగి వెళితే బతకలేని పరిస్థితి ఉందని చెబుతూ తమ పూర్తి వివరాలు చెప్పడానికీ ఇష్టపడటం లేదు. ఆ వివరాలు లేనిదే ఆయా రాయబార కార్యాలయాలను సంప్రదించడం సాధ్యం కాదని పోలీసులు పేర్కొంటున్నారు. దీంతో ఈ సోమాలియన్ల విషయంలో అధికారులు యూనైటెడ్‌ నేషన్స్‌ హ్యూమన్‌ రైట్‌ కౌన్సిల్‌ (యుఎన్‌హెచ్‌ఆర్‌సీ) సహాయం తీసుకోవాలని నిర్ణయించారు. వారికి లేఖ రాయడం ద్వారా ఆ విభాగం ఎంపిక చేసిన దేశాలకు శరణార్ధులుగా పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిపోర్టేషన్‌ సెంటర్‌లో ఉన్న వారిలో సోమాలియాకు చెందిన ఓ వ్యక్తి తన కుటుం బతో సహా అక్రమంగా వలసవచ్చి బెంగుళూరులో ఉంటున్నాడు. ఇటీవల నగరానికి వచ్చి తన స్నేహితుల వద్ద ఉండగా పోలీసులకు చిక్కాడు. తమ దేశానికి వెళ్లడానికి విముఖత చూపుతున్న ఇతడు కనీసం తన కుటు ంబం వివరాలు చెప్పట్లేదని అధికారులు పేర్కొన్నారు. దీంతో అతడి కుటుంబం వివరాలు తెలుసుకోవడానికి ఆ దేశ ఎంబసీ సాయం తీసుకోవాలని నిర్ణయించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement