పశువులపైనా వైరస్‌ పడగ | Some Animals Infected With Lumpy Skin Disease In Telangana | Sakshi
Sakshi News home page

పశువులపైనా వైరస్‌ పడగ

Published Sun, Jun 7 2020 2:41 AM | Last Updated on Sun, Jun 7 2020 8:39 AM

Some Animals Infected With Lumpy Skin Disease In Telangana - Sakshi

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండలంలో పాక్స్‌ వైరస్‌ సోకిన దూడ 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రజానీకంపై ఒకపక్క కరోనా వైరస్‌ పంజా విసురుతోంటే, మరోపక్క మూగజీవాలపై పాక్స్‌ వైరస్‌ కుటుంబానికి చెందిన వైరస్‌ పడగ విప్పుతోంది. ఈ వైరస్‌తో సోకుతున్న ‘లంపీస్స్కిన్‌‌‌‌ వ్యాధి’కారణంగా ఆవులు, దూడల చర్మంపై బొడిపెలు వస్తున్నాయి. ఈ వైరస్‌ గతేడాది నవంబర్, డిసెంబర్‌ మాసాల్లో ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసి, ఈ ఏడాది మార్చి నాటికి మన రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించినట్టు పశువైద్య వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మంతో పాటు ప్రస్తుతం కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని ఆవులు, దూడల్లో దీన్ని గుర్తించామని, గేదెల్లో మాత్రం లక్షణాలు కనిపించలేదని అంటున్నాయి. ఈ వైరస్‌ తీవ్రత ఈసారి కొంచెం ఎక్కువే ఉందని, పశుసంవర్థక శాఖ అప్రమత్తంగానే ఉందని, ఇప్పటికే దీని నివారణకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామని, పాడి రైతులు ఈ వైరస్‌ను గుర్తిస్తే ఆందోళన చెందకుండా తమను సంప్రదించాలని ఆ శాఖ అధికారులు సూచిస్తున్నారు. (సీఎం ఆఫీసులో కరోనా కలకలం)

అమ్మతల్లి తరహాలో.. 
మనుషులకు అమ్మతల్లి (మశూచి) సోకినట్టే ఆవులకూ ఈ వైరస్‌ సోకుతుందని తెలుస్తోంది. ఈ వైరస్‌ వల్ల వచ్చే వ్యాధి కారణంగా పశువుల ఒంటి నిండా పెద్దపెద్ద బొడిపెలు వస్తున్నాయి. ఒడిశా రాష్ట్రం నుంచి ఏపీలోని విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాల మీదుగా అటవీ ప్రాంతాల నుంచి ఈ వైరస్‌ ఖమ్మం జిల్లాలోకి వచ్చిందని అధికారులు అంటున్నారు. వైరస్‌ను గుర్తించిన వెంటనే రింగ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామని చెబుతున్నారు. ఎక్కడైనా ఒక ఆవులో ఈ వైరస్‌ లక్షణాలు గుర్తిస్తే ఆ ఆవు ఉన్న గ్రామానికి 5 కిలోమీటర్ల చుట్టూ ఉన్న అన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ చేశామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అంటున్నారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒక్క కొత్తగూడెం జిల్లాలోనే 6వేలకు పైగా ఆవులకు ఈ వ్యాధి సోకగా 23 చనిపోయినట్టు సమాచారం. ఈ జిల్లాలోనే 17వేలకు పైగా ఆవులకు వ్యాక్సినేషన్‌ చేశారు. మిగిలిన జిల్లాల్లోనూ దీని ప్రభావం తీవ్రంగానే కనిపిస్తోంది. పెద్దగా భయపడాల్సిన పని లేదని అధికారులు అంటున్నా రైతులు ఈ వైరస్‌పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. (ఒక్కరోజే  206 కేసులు..)

ఆందోళన అవసరం లేదు 
వైరస్‌ పూర్తి నియంత్రణలో ఉంది. దీన్ని గుర్తించగానే మా శాఖ అప్రమత్తమైంది. వ్యాక్సినేషన్‌ పూర్తిస్థాయిలో చేశాం. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ వ్యాధి లక్షణాలు గుర్తిస్తే వెంటనే పశువైద్యులను సంప్రదిస్తే తగిన చికిత్స అందిస్తారు.– రాంచందర్, అడిషనల్‌ డైరెక్టర్, పశుసంవర్థక శాఖ 

మనుషులకు సోకే అవకాశం లేదు..
పశువుల్లో కనిపిస్తున్న ఈ వైరస్‌ కారణంగా మనుషులకు ఎలాంటి ఇబ్బంది లేదని పశువైద్య వర్గాలు తెలిపాయి. ఈ వైరస్‌కి జూనోటిక్‌ లక్షణం లేదని, మనుషులకు ఎట్టి పరిస్థితుల్లో సోకే అవకాశం లేదని అంటున్నారు. ఈ వైరస్‌ సోకిన పశువులకు కూడా సకాలంలో వైద్యం అందిస్తే ప్రాణహాని ఉండదని, మరణాల రేటు చాలా తక్కువని చెబుతున్నారు. గతంలో కూడా ఈ వైరస్‌ మన రాష్ట్రంలో కొన్నేళ్ల పాటు ఉందని, అయితే ఇప్పుడు కొంత తీవ్రంగా ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement