జిల్లాలో మినీ క్యాసినోలు..! | Some Hotels Are Mini Casinos In Nizamabad | Sakshi
Sakshi News home page

జోరుగా మూడు ముక్కలాట..

Published Thu, Aug 8 2019 12:33 PM | Last Updated on Thu, Aug 8 2019 12:38 PM

Some Hotels Are Mini Casinos In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: జిల్లాలో పేకాట జోరుగా సాగుతోంది.. మూడు ముక్కలాట నిలువునా ముంచెస్తోంది! రాష్ట్రంలో పేకాట క్లబ్బులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంటే జిల్లాలో మాత్రం ఇందుకు విరుద్ధంగా నడుస్తోంది. జిల్లా వ్యాప్తంగా పేకాట యథేచ్ఛగా కొనసాగుతోంది. నిజామాబాద్‌ నగరంతో పాటు పలు గ్రామాల్లో ప్రత్యేకంగా స్థావరాలను ఏర్పాటు చేసుకుని పత్తాలాట నడుస్తోంది. ఈ క్రమంలో రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయి. అడపాదడపా జరుపుతున్న దాడుల్లోనే రూ.లక్షల్లో నగదు పట్టుబడుతోందంటే జిల్లాలో ఏ స్థాయిలో జూదం కొనసాగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జూదానికి అలవాటు పడిన పేకాటరాయుళ్లు చాలా మంది అప్పుల పాలవుతున్నారు. అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లడానికి పేకాట కారణమవుతోంది. కొందరు తమ ఆస్తులను అమ్ముకుని పేదలుగా మారుతున్నారు. పేకాట స్థావరాల్లో రాత్రి, పగలూ తేడా లేకుండా పోయింది. సెలవులు వస్తే మాత్రం జూదం జోరందుకుంటుంది.

టాస్క్‌ఫోర్స్‌ దాడులు
ఆర్మూర్‌ మండలం గోవింద్‌పేట్‌ శివారుల్లో ఓ కోళ్ల ఫారంలో ఏర్పాటు చేసిన పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం దాడి చేశారు. మొత్తం 13 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసిన పోలీసులు.. వీరి నుంచి రూ.4 లక్షల నగదు, తొమ్మిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా బుధవారం నిజామాబాద్‌ నగరంలోని 5వ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనూ పత్తాలాట స్థావరంపై కూడా పోలీసులు దాడి చేశారు. ఇక్కడ కూడా రూ. 1.25 లక్షల నగదు పట్టుబడటం గమనార్హం. రెంజల్‌ మండలం నాగారం శివారులో ఏర్పాటు చేసిన పేకాట స్థావరంపై కూడా టాస్క్‌ఫోర్స్‌ బృందం ఆదివారం దాడి చేసింది. సుమారు రూ.లక్ష వరకు నగదుతో పాటు కార్లు, బైక్‌లు, సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

నగరంలో మినీ క్యాసినోలు..?
నగరంలోని కొన్ని హోటళ్లు మినీ క్యాసినో (జూద గృహాలు)లుగా విలసిల్లుతున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆయా హోటళ్లలో ప్రత్యేకంగా ఓ ఫ్లోర్‌లోని కొన్ని గదులను పేకాట కోస మే కేటాయించి జూదాన్ని కొనసాగిస్తున్నట్లు సమాచారం. పేకాట స్థావరమే హోటల్‌ కావడంతో ఆట వద్దకే మందు, విందు అన్నిం టిని సరఫరా చేస్తున్నారు. జూదం యథేచ్ఛగా సాగుతోందనే సమాచారం సంబంధిత పోలీసు అధికారులకు ఉన్నప్పటికీ వాటి జోలికి వెళ్లడం లేదనే విమర్శలున్నాయి. ఎప్పుడైనా దాడులు చేసి కేసులు నమోదు చేసిన్పటికీ.. ఆ హోటల్‌ వివరాలు, పేకాటరాయుళ్ల పేర్ల ను బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడుతుండడం విశేషం.

గుట్టుగా నిర్వహణ..
కొందరు నిర్వాహకులు పేకాట స్థావరాలను గుట్టుగా నిర్వహిస్తున్నారు. కేవలం నగరంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలాచోట్ల పేకాట స్థావరాలు వెలిశాయి. కేటు పేరుతో ఒక్కో ఆటకు రూ.500 నుంచి రూ.వెయ్యి, రూ.2 వేల చొప్పున ఆటను బట్టి వసూలు చేస్తున్నారు. ఇలా కేటు వసూలు చేస్తున్న నిర్వాహకులు పేకాట రాయుళ్లకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు.

ఎస్‌హెచ్‌వోలకు మెమోలు..
టాస్క్‌ఫోర్స్‌ బృందం దాడులు చేస్తున్న ఘటనలపై స్థానిక పోలీస్‌స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలకు పోలీసు ఉన్నతాధికారులు మెమోలు జారీ చేయాలని నిర్ణయించారు. ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలోనే పెద్ద ఎత్తున పేకాట స్థావరాలు వెలిసి, రాత్రి పగలూ తేడా లేకుండా జూదం కొనసాగుతుంటే కనీసం పట్టించుకోకపోవడం వెనుక పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆయా చోట్ల పేకాట స్థావరం వెలిసిందనే సమాచారం టాస్క్‌ఫోర్స్‌ అధికారుల వరకు వెళ్లిందంటే స్థానిక పోలీసులు చూసీచూడనట్లు వదిలేలినట్లేనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి బాధ్యులుగా చేస్తూ సంబంధిత అధికారులకు మెమోలు జారీ చేయాలని సీపీ కార్తికేయ నిర్ణయించినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement