భార్యతో కలసి తల్లిదండ్రులను చంపేందుకు యత్నం..
నల్లబెల్లి(నర్సంపేట): తల్లిదండ్రుల నోట్లో బలవంతంగా గడ్డిమందు పోసి వారిని చంపేందుకు భార్యతో కలసి ప్రయత్నించాడో ప్రబుద్ధుడు. వారు పెనుగులాడడంతో బతికిబయటపడ్డారు. వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడపల్లి శివారు గొల్లెపల్లిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన గాధం కేతమ్మ–బొంద్యాలుకు ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. కుమార్తె భర్త కన్నుమూయగా.. ఆమెకు చెందిన నగలను కుమారుడు మహిపాల్ తీసుకున్నాడు. వాటిని ఫైనాన్స్‌లో కుదువపెట్టాడు. కుమార్తె తన నగలను అడిగినప్పుడల్లా తల్లిదండ్రులు మహిపాల్‌ను ప్రశ్నించేవారు.
దీంతో ఆగ్రహం పెంచుకున్న కొడుకు తన భార్య మానసతో కలిసి తల్లిదండ్రులను ఇంటి నుంచి వెళ్లగొట్టేందుకు పలుమార్లు గొడవ పడేవాడు. రెండు రోజుల క్రితం కూడా గొడవ జరగగా.. ఆదివారం వారు కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారన్న కోపం.. తరచూ నగలు అడుగుతున్నారని వారు రాత్రి పడుకున్న తర్వాత 11 గంటల సమయంలో మహిపాల్– మానసలు ఇంట్లోని గడ్డిమందును తల్లిదండ్రుల నోట్లో పోసేందుకు ప్రయత్నించారు.
వారు పెనుగులాడడంతో దుస్తులపై పడింది. దీంతో వారు సోమవారం మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై మేరుగు రాజమౌళి వివరణ కోరగా గడ్డిమందు నోట్లో పోసి చంపేందుకు ప్రయత్నించారని గాధం కేతమ్మ–బొంద్యాలు ఫిర్యాదు చేశారని, ఇందులో అనుమానాలు ఉన్నాయని తెలిపారు.