లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. కనిపెంచిన తల్లిదండ్రుల పట్ల సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించింది ఓ కూతురు. ప్రియుడితో మాట్లాడవద్దని చెప్పినందుకు కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లిదండ్రులను అతి కిరాతకంగా హత్య చేసింది. ఇంటి రక్తపు మడుగులో మృతదేహాలు పడి ఉండటాన్ని గమనించిన ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మార్చి 15న ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బుధవారం శిఖాపూర్ పోలీస్ స్టేషన్ అధికారి ప్రేమ్ చంద్ శర్మ వెల్లడించారు. యూపీలోని బులందషహర్ ప్రాంతంలో మహ్మద్ షబ్బీర్(47). రెహానా(44) కుటంబం నివాసం ఉంటోంది. వీరికి నలుగురు కూతుళ్లు. పెద్ద అమ్మాయి (15 ఏళ్లు)8 తరగతి చదువుతోంది. ఇటీవల బాలికకు ఓ యువకుడితో(22) పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.
ప్రియుడితో తరుచూ ఫోన్లో మాట్లాడటం, బయట తిరగడం గమనించిన తల్లిదండ్రులు కూతురిని మందలించారు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కొన్ని రోజులుగా పాఠశాలకు కూడా పంపించడం లేదు. దీంతో తల్లిదండ్రులపై కోపం పెంచుకున్న కూతురు వారిని అడ్డుతొలగించుకునేందుకు కుట్ర పన్నింది. మార్చి 14న మెడికల్ షాప్‌లో పనిచేసే తన ప్రియుడి ద్వారా నిద్రమాత్రలు తీసుకొచ్చింది. వీటిని అన్నంలో కలిపి తల్లిదండ్రులకు ఇచ్చింది.
తిన్న తర్వాత దంపతులు ఇంటి ముందు మంచంపై నిద్రలోకి జారుకున్నారు. దీంతో కూతురు గొడ్డలితో తల్లిదండ్రుల తలలు నరికి చంపింది. మృతదేహాలను బెట్‌షీట్‌తో కప్పేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి బయట నుంచి తాళం వేసి, తాళాలను తన తండ్రి దిండు కింద దాచిపెట్టింది. అనంతరం పక్కింటి వాళ్ల డాబా ఎక్కి ఇంట్లోకి వెళ్లి పడుకుంది.
పక్కింటి వారి సమాచారంతో అనుమానస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు కూతురిని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆమె సెల్‌ఫోన్‌లో ఓ వ్యక్తిని నిద్రమాత్రలు తీసుకురమ్మని చెప్పినట్లు ఉండటంతో హత్య చేసింది 15 ఏళ్ల మైనరేనని పోలీసులు నిర్దారించారు.
తన ప్రియుడితో మాట్లాడకుండా నిబంధనలుపెట్టినందుకే చంపినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. మైనర్ నిందితురాలిని అరెస్ట్ చసి జువైనల్ హోంకు తరలించారు., ఆమెకు సహకరించిన ప్రియుడును కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment