సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు 10 జిల్లాల ప్రాతిపదికనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. అందుకు అవసరమైన ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు చెప్పారు. 8,792 పోస్టులకు పాత జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ వివరాలను టీఎస్‌పీఎస్సీకి పంపినట్లు వెల్లడించారు. సోమవారం సచివాలయంలో టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి, విద్యా శాఖ ఉన్నతాధికారులతో ఉద్యోగ నియామక ప్రక్రియపై ఆయన సమీక్షించారు.
అనంతరం మాట్లాడుతూ.. ఉపాధ్యా య పోస్టులకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తుందని వెల్లడించారు. 10 జిల్లాల ప్రకారం టీఎస్‌పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ ఇస్తుందా.. పాత నోటిఫికేషన్‌కే సవరణ నోటిఫికేషన్ ఇస్తుందా అన్నది టీఎస్‌పీఎస్సీ చూసుకుంటుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా వద్దా అనేది కూడా టీఎస్‌పీఎస్సీ వెల్లడిస్తుందని చెప్పారు. ఏజెన్సీ, వెనుకబడ్డ జిల్లాల నిరుద్యోగుల లబ్ధి కోసమే కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చామని వివరించారు. కొంతమంది కావాలనే ప్రతిదానికీ కోర్టుకు వెళ్తున్నారని ఆరోపించారు.
నిరుద్యోగులూ.. ఆందోళన వద్దు
టీచర్ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు నిరాశ చెందొద్దని కడియం శ్రీహరి సూచించారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు వచ్చే ఏడాది ఆగస్టులోగా 1.08 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి తీరుతామని హామీ ఇచ్చారు. త్వరలో వాటి భర్తీకి క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు.
ఇప్పటికే 29 వేల పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. కొందరు రాజకీయ కొలువుల కోసమే ‘కొలువులకై కొట్లాట’లు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల కోసం నిరుద్యోగులను రెచ్చగొట్టడం సరికాదన్నారు. రాజకీయాల కోసం ఎవరికో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కొలువుల కొట్లాట ఎవరు చేస్తున్నారో.. నాయకులెవరో తమకు తెలుసని పేర్కొన్నారు.
విద్యార్థుల ఆత్మహత్యలు దురదృష్టకరం
విద్యార్థులు తమ సమస్యలను పోరాడి గెలవాలని సూచించారు. ఆత్మహత్యలకు పాల్పడొద్దని విజ్ణప్తి చేశా రు. ఆత్మహత్యలను ఏ ప్రభుత్వమూ ప్రోత్సహించదని, వాటిని పార్టీలు రాజకీయం చేయొద్దని సూచించారు. ఓయూ విద్యార్థి సూసైడ్ లెటర్, అతడి చేతిరాతను పోల్చి చూస్తే నకిలీయో, అసలో తేలుతుందని, అలాంటప్పుడు అలా ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు భావ దారిద్య్రంలో ఉన్నాయని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment