మద్యం ప్రియుడిపై వైన్స్ సిబ్బంది దాడి
గిర్నిబావి(దుగ్గొండి) : మద్యం బాటిళ్లను ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించినందుకు మద్యం షాపు సిబ్బంది కొనుగోలుదారుడిపై దాడి చేసిన సంఘటన మండలంలోని గిర్నిబావిలో శుక్రవారం జరిగింది. రాయపర్తి మండలం బుర్హాన్‌పల్లి గ్రామానికి చెందిన ఇంతల వీరన్న తన బంధువులతో కలిసి గీసుకొండ మండలం కొమ్మాల గ్రామానికి పెళ్లి వేడుకలకు వచ్చాడు. అక్కడి నుంచి మద్యం తాగడానికి కొందరు బంధువులతో కలిసి గిర్నిబావిలోని వినాయక వైన్స్‌కు వచ్చాడు. ఓ బీరు తీసుకున్నాడు. అయితే బీరుకు రూ.115 ఇవ్వాలని సిబ్బంది చెప్పారు.
అయితే మా దగ్గర రూ.100 కే ఇస్తున్నారు. మీరు ఎందుకు ఎక్కువ తీసుకుంటారని ప్రశ్నించాడు. దీంతో గొడవ పెద్దదిగా మారి వీరన్నపై షాపు సిబ్బంది వంశీ, పాలడుగు రాజు, పెరుమాండ్ల ప్రవీణ్ దాడి చేసి కొట్టారు. దీంతో వీరన్నకు కన్ను కింది భాగంలో, పెదవులపై, దంతాలకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వీరన్నను నర్సంపేటకు తరలించారు. దాడికి పాల్పడ్డ ముగ్గురు షాపు సిబ్బంది పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధితుడి పిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.