
సాక్షి, హైదరాబాద్: సమత కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు హైకోర్టు బుధవారం ఆమోదం తెలిపింది. ఐదవ అదనపు సెషన్స్, ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక కోర్టుగా ఏర్పాటు చేస్తున్నట్లు న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అసిఫాబాద్ జిల్లాలోని ఎల్లాపటార్‌లో గత నెల 24న ముగ్గురు యువకులు దళిత మహిళపై సామూహికంగా అత్యాచారం చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. సమత కేసులో ప్రత్యేక కోర్టు ఏర్పాటు కావడంతో రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
దిశ ఘటన తర్వాత ప్రభుత్వం వేగంగా స్పందించిందని మంత్రి గుర్తు చేశారు. సమత కేసులో కూడా సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిందని వెల్లడించారు. దోషులకు వెంటనే శిక్షలు పడేలా, భాదితులకు సత్వర న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆడపిల్లల వైపు వక్రబుద్ధితో చూడాలంటేనే భయపడే విధంగా కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని ఇంద్రకరణ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. (చదవండి: వివాహితపై అత్యాచారం.. హత్య)
Comments
Please login to add a commentAdd a comment