గతానికి భిన్నంగా..! | Special story On Ganesh Nimajjanam | Sakshi
Sakshi News home page

గతానికి భిన్నంగా..!

Published Thu, Sep 20 2018 10:53 AM | Last Updated on Thu, Sep 20 2018 10:53 AM

Special story On Ganesh Nimajjanam - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ‘గణేష్‌’ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు జాగ్రత్తలు చేపట్టనున్నారు. నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ ఆదేశాల మేరకు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు నిఘా, తనిఖీలు, గస్తీ, సోదాలు ముమ్మరం చేశారు. ప్రధాన ఉరేగింపు, నిమజ్జనం జరిగే చెరువుల వద్ద, నగర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. ప్రతి చిన్న విషయాన్నీ పెద్దదిగా చేసి చూపిస్తూ, వదంతులతో బల్క్‌ ఎస్సెమ్మెస్‌లు, సోషల్‌మీడియా ద్వారా ప్రచారం చేయడం ఇటీవల కాలంలో పెరిగింది. 

కొన్ని సందర్భాల్లో ఇవి కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతున్నాయి. నగరంలో గతంలో చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న అధికారులు పుకార్లను తీవ్రంగా పరిగణించాలని నిర్ణయించారు. దీనికోసం ఆయా సర్వీస్‌ ప్రొవైడర్లతోనూ సమన్వయంగా పని చేయనున్నారు. వదంతులను వ్యాపింపజేస్తున్న ఎస్సెమ్మెస్‌లు, సోషల్‌మీడియాలపై టెక్నికల్‌ నిఘా ఉంచే ఏర్పాటు చేశారు. దీనికోసం సైబర్‌ క్రైమ్‌ పోలీసుల అధీనంలో ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేశారు. సామూహిక నిమజ్జనాన్ని తిలకించడానికి ప్రతి ఏడాదీ మహిళా భక్తులు సైతం అధిక సంఖ్యలో వస్తుంటారు. దీన్ని అదనుగా చేసుకుని ఆకతాయిలు, స్నాచర్లు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని దష్టిలో పెట్టుకున్న సిటీ పోలీసులు ఈసారి గతానికి భిన్నంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

 ఈవ్‌టీజర్లుకు చెక్‌ చెప్పడానికి 100 షీటీమ్‌ బృందాలను వివిధ ప్రాంతాల్లో మోహరిస్తున్నారు. దీంతో పాటు స్నాచర్లుకు చెక్‌ చెప్పేందుకు సీసీఎస్, టాస్క్‌ఫోర్స్‌లకు చెందిన డెకాయ్‌ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. వీరు అనుమానాస్పద, కీలక ప్రాంతాల్లో మఫ్టీల్లో సాధారణ వ్యక్తుల మాదిరి తిరుగుతూ నిఘా వేసి ఉంచుతారు. దాదాపు 40కి పైగా డెకాయ్‌ టీమ్స్‌ మోహరిస్తున్న ఉన్నతాధికారులు ఇందులో క్రైమ్‌ వర్క్‌పై పట్టున్న వాళ్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో ఎవరికైనా పుకార్లతో కూడిన సందేశాలు వస్తే వాటిని తక్షణం పోలీసుల దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేస్తున్నారు. వీటిని మరో గ్రూపులోకో, వ్యక్తిగతంగానో ఫార్వర్డ్‌ చేస్తే సాంకేతిక నిఘాతో వారిని కనిపెట్టేలా ఏర్పాట్లు చేశారు. అలాంటి వారిపై ఐటీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేయనున్నారు. వదంతితో కూడిన సందేశాన్ని సృష్టించడం ఎంత నేరమో... దాన్ని ప్రచారం చేయడం సైతం అదే స్థాయి నేరమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.  

సీసీ కెమెరాలతో గట్టి నిఘా..
నిమజ్జనం ఊరేగింపు నగరంలోని 25 పోలీసుస్టేషన్ల పరిధి నుంచి సాగనుంది. ఈ నేపథ్యంలో పూర్తి మార్గాన్ని నిశితంగా పరిశీలించేందుకు పోలీసులు సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఆయా మార్గాల్లో శాశ్వత ప్రాతిపదికన ఉన్న కెమెరాలకు తోడు అదనంగా భారీ సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నారు. హుస్సేన్‌సాగర్‌ చుట్టూనే దాదాపు 90 కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నింటిలోని దృశ్యాలను ఎప్పటికప్పుడు బషీర్‌బాగ్‌ కమిషనరేట్‌లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో (సీసీసీ) పాటు ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్స్‌ నుంచి చూసే ఆస్కారం ఉంది. వీటితో పాటు ఎన్టీఆర్‌ మార్గ్, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్‌ గణేష్‌ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ‘టీఎస్‌ కాప్‌’ యాప్‌తో అనుసంధానించారు. ఫలితంగా వీటిలోని దృశ్యాలను అధికారులు, సిబ్బంది తమ ట్యాబ్స్, సెల్‌ఫోన్లలో ఎప్పటికప్పుడు చూసుకునే అవకాశం ఏర్పడనుంది.  

బాలాపూర్‌ గణ పతి సైతం..
గణేష్‌ శోభాయాత్ర నగర వ్యాప్తంగా దాదాపు 117.3 కిమీ పరిధిలో సాగనుందని పోలీసులు అంచనా వేశారు. పాతబస్తీతో కూడిన దక్షిణ మండలంలో అత్యధికంగా 39.3 కిమీ పరిధిలో ఈ యాత్ర జరగనుంది. బాలాపూర్‌ గణేషుడు సైతం ఇదే మార్గంలో రానుండటం గమనార్హం. ఇప్పటికే ఊరేగింపులు జరిగే శోభాయాత్ర మార్గాన్ని పలుమార్లు పరిశీలించిన కొత్వాల్‌ అంజనీకుమార్‌ బందోబస్తు, భద్రత చర్యల్లో అనేక మార్పు చేర్పులు సూచించారు. తాజాగా బుధవారం జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి మరోమారు రూట్‌లో పర్యటించారు.  

శోభాయాత్ర మార్గాలు ఇలా..  
 సౌత్‌జోన్‌: 39.3 కి.మీ 
 ఈస్ట్‌జోన్‌: 8.4 కి.మీ 
 సెంట్రల్‌ జోన్‌: 6.4 కి.మీ 
 వెస్ట్‌జోన్‌: 30.5 కి.మీ 
 నార్త్‌జోన్‌: 33 కి.మీ 
 మొత్తం: 117.3 కి.మీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement