సాక్షి, హన్మకొండ : అహోసీత... అహో లక్ష్మణా.... మొదటిసారిగా త్రేతాయుగంలో మారీచుడు, రాముని గొంతుతో మాట్లాడి వేరేవారి గొంతును అనుకరించడం విన్నాం. ఆ తర్వాత ద్వాపరయుగానికి చెందిన భారతంలో విరాటపర్వంలో భీముడు గొంతుమార్చి మాట్లాడి సైరంధ్రిని అంతమొందించాడు. గౌతమునిలా మాట్లాడి ఇంద్రుడు అహల్యను ఏమార్చాడు.... ఆ తర్వాత చానాళ్లు ఈ విద్య మరుగున పడిపోయింది.
మళ్లీ కలియుగంలో పేరిని శివతాండం ఆవిర్భవించిన కాకతీయ గడ్డపై పుట్టిన నేరేళ్ల వేణుమాధవ్ గొంతులో తిరిగి ప్రాణం పోసుకుంది. అక్కడి నుంచి ప్రపంచమంతా వ్యాపించి... ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ ప్రతినిధులకు బైబిల్‌లోని టెన్‌కమాండ్‌మెంట్స్‌కు గొంతుతోనే కళ్లకు కట్టినట్లు చూపించేంత వరకు వెళ్లింది.
మలుపుల ప్రవాహం
నేరేళ్ల వేణుమాధవ్ తండ్రి నేరెళ్ల శ్రీహరి వరంగల్‌లో సబ్‌డివిజనల్ అధికారిగా ప్రభుత్వ ఉద్యోగి. కొడుకు డిగ్రీ పూర్తి చేసి తహశీల్దార్ అవ్వాలనేది ఆయన కోరిక. కానీ వేణుమాధవ్ ఆశయం వేరు ఆనాటి స్టార్‌హీరో చిత్తూరు నాగయ్య అంటే వల్లమానిన అభిమానం. వెండితెరపై నాగయ్య కనబరిచిన అభినయం, సంభాషణలు పలికే తీరు బాల వేణుమాధవ్‌ను నీడలా వెంటాడేవి. దానితో నాగయ్య నటించిన ప్రతి సినిమాను మిస్సవకుండా చూడటం, ఆయనలా మాట్లాడటం, అభినయించడం చేసేవారు. మిమిక్రీ కళకు తొలి బీజం పడింది కూడా అక్కడే. ఆ తర్వాత కేవలం నాగయ్య ఒక్కడినే కాకుండా ఓ సన్నివేశంలో వచ్చే అన్ని పాత్రలను అనుకరించడం.. ఆ తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులు... బయటి జనాలు వారి యాసలు ఇలా ప్రతీ దాన్ని పరిశీలించడం, ఆపై అభినయించడం ఆయనకు చిన్నతనంలో నిత్యకత్యం అయ్యింది. ఇక్కడే మిమిక్రీ కళ బీజం నుంచి మొక్కగా రూపాంతరం చెందింది.
ఆ తర్వాత అందరు నటులను అనుకరించడం స్టేజ్‌షోలను ఇవ్వడం చేసేవారు. ఇప్పుడు మిమిక్రీ అంటున్న ఈ కళను అప్పుడు ఏ పేరుతో పిలవాలో తెలియక ప్రత్యేక ప్రతిభగా చెప్పుకునే వారు. తహశీల్దార్ కావాల్సిన కొడుకు సినిమాలంటూ తిరగడం తండ్రి కోపానికి కారణమైంది. దానితో తండ్రి చేతిలో దెబ్బలు. ‘ సినిమాలు, అనుకరణలు ఇవన్నీ వొదిలేయ్ హయిగా చదువుకో, చదువు కడుపు నింపుతుంది కానీ సినిమాలు కావు’ అంటూ తల్లి ఊరడింపులు. అనుకరణ వద్దంటూ ఎవరెంతగా చెప్పినా ‘ నాగయ్య గారి అభినయం, గొంతు అనుక్షణం నన్ను వెంటాడేవి. అందుకే ఎవ్వరేమన్నా సరే నాగయ్య సినిమా చూడటం మానలేదు. ఇంటికొచ్చాక ఆయనలా అభినయించడం వదలలేదు. దానితో అంతా నాకు పిచ్చిపట్టిందని అనుకునేవారు. అంతగా నాకు అనుకరణపై వ్యామోహం పెరిగింది’ అని చెబుతారు నేరెళ్ల.
మాష్టారు పోత్సాహంతో మిమిక్రీ మాష్టారుగా ..
ఇలా అనుకరణ వ్యామోహంలో తలామునకలై ఉన్న కాలంలో మెట్రిక్యులేషన్ ఫలితాలు వచ్చాయి. మొదటిసారి పరిక్షలో ఫెయిల్. బాధపడలేదు. ఎందుకంటే చదువు, ఉద్యోగం వీటన్నింటి కంటే మిమిక్రీయే గొప్పదని ఆయన భావించేవారు. రెండో ప్రయత్నంలో పాస్ అయ్యారు. ఆ తర్వాత ఇంటర్ చదివేందుకు వరంగల్ గవర్నమెంట్ కాలేజీలో ప్రవేశం. మిమిక్రీకి మొదటిసారిగా ఓ కళగా గుర్తింపు వచ్చింది ఇక్కడే. అనుకరణ కళను ఎవరూ ఆదరించని కాలంలో ఆ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరామనర్సు గారు నేరెళ్లలో ఒక ప్రత్యేకమైన కొత్త ప్రతిభ దాగి ఉందనే విషయాన్ని పసిగట్టారు. చదువు ఒక్కటే ప్రతిభ కాదు కళలు కూడా సమాంతర ప్రతిభనే అనే అభిప్రాయాన్ని ఆయన కలిగి ఉండేవారు. అందుకే నేరెళ్లలో మొగ్గతొడిగిన ప్రత్యేక ప్రతిభను మిమిక్రీ అనే పెద్ద చెట్టుగా ఎదిగేందుకు అవసరమైన పోత్రాహం అందించారు. ఎంతగా ప్రోత్సహించారంటే ఆర్థిక పరిస్థితుల కారణంగా సినిమాలు చూసేందుకు నేరెళ్ల వద్ద డబ్బులు లేకుంటే తన జీతంలో నుంచి ఇచ్చేంతగా.
‘ఒక రోజు నేను దిగాలుగా ఉన్నాను. సార్ నన్ను పిలిచి ‘‘ఏంటీ సమస్య’’ అన్నారు. అప్పటికే అమ్మ చనిపోవడంతో పాటు నాన్నకు పక్షవాతం వచ్చింది. ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. దానితో నాలో ఏమూలో పేరుకుపోయిన నైరాశ్యం. ఈ నేపథ్యంలో ఇష్టమైన సినిమాలు చేసే అవకాశం లేకపోవడం. అదే విషయం సారుకు చెబితే, వెంటనే ఆయన రూ.60 నా చేతిలో పెట్టి నచ్చిన పని చేయమన్నారు’ అని గతం గుర్తు చేసుకున్నారు వేణుమాధవ్. గురువు ఇచ్చిన సొమ్ముతో నచ్చిన సినిమాలు చూసి వాటిల్లో ఆర్టిస్టుల గొంతులు, సన్నివేశాలు, నేపథ్య సంగీతంలో అన్ని గురుగారి ముందు ప్రదర్శించారు. అప్పటికే వేణుమాధవ్‌లో దాగున్న ప్రతిభ గురించి తెలిసినా.. ఆ రోజు చూపిన ప్రదర్శనకి ఆయన అబ్బురపడి ఆయన ‘ యు విల్ బీ ఏ గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ది వరల్డ్’ అని దీవించారు. ఆయన వాక్కు ఫలించింది. తదనంతర కాలంలో నేరెళ్ల లెక్కకు మిక్కిలిగా ప్రశంసలు, అవార్డులు, రివార్డులు పొందినా ప్రారంభంలో వెంకట రామనర్సు గారు ఇచ్చిన ప్రశంసలు ప్రత్యేక మైనదని చెబుతారు.
అవకాశలు సష్టించుకోవడం
అన్ని సార్లు అవకాశాలు తలుపు తట్టి పిలవవు. కొన్ని సార్లు పక్కనే ఉంటాయి. వాటిని మన మే పసిగట్టి ఒడిసి పట్టుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టడంతో టీచర్ ఉద్యోగంలో చేరిపోయారు నేరెళ్ల వేణుమాధవ్. చరిత్రలో వచ్చే ఔరంగజేబు, అక్బరు, శివాజీ, జూలియస్ ఇతర పాత్రలు వచ్చినప్పుడు ఆ పాత్రల్లోకి పరాకాయ ప్రవేశం చేసి అభినయిస్తూ పాఠాలు బోధించేవారు. జీతం డబ్బులతో కంఫర్ట్ జోన్‌లో కూరుకుపోయి కళను మర్చిపోలేదాయన. తనలో దాగున్న కళకు మరింతగా సానబెట్టడం చేశారు. టీచర్‌గా సెలవులు ఎక్కువగా ఉండటంతో ప్రదర్శనలు ఇచ్చేందుకు ఎక్కువ సమయం దొరికేది. ప్రతిచోట ఆశ్చర్యం, ప్రశంసలే.. అలా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా వరంగల్ నుంచి న్యూయార్క్ వరకు వెళ్లారు.
ఎనిమిది పదుల వయసులో ప్రవేశించిన ఏ కొత్త శబ్ధం విన్నా దాన్ని అనుకరించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తండ్రి కోరిక మేరకు తహశీల్దార్ అయ్యింటే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసేవారు కావచ్చు. కానీ తన కిష్టమైన పని చేయడం వల్ల ఓ కొత్త కళకు ప్రాణం పోయగలిగారు. దానితో వందల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించగలిగారు. ఇప్పుడు చిత్రసీమలో ఉన్న చాలామంది హస్యనటులు మిమిక్రీ ఆధారంగానే అందులోకి ప్రవేశించగలిగారు. అంతే కాదు మిమిక్రీకి ఓ కళగానే కాదు ఓ శాస్త్ర రూపం కూడా వేణుమాధవే కల్పించారు. ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మిమిక్రీని ఓ కోర్సుగా నిర్వహిస్తున్నారు. తెలుగులో అనుకరణ, ఇంగ్లీష్‌లో ఇంప్రెషనిస్ట్ అనే ప్రత్యేక ప్రతిభకు మిమిక్రీ అనే ఓ కళా రూపాన్ని ఇచ్చిన ఘనత నిస్సందేహంగా నేరెళ్ల వేణుమాధవ్ కే దక్కుతుంది.
- భానుమతి గారి గొంతును అనుకరించడం చాలా కష్ట పడాల్సి వచ్చింది.
- ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చిన ఐటమ్ ‘ టెన్ కమాండ్‌మెంట్స్’
- గొప్ప ప్రశంస ఐక్యరాజ్య సమితి సమావేశంలో ప్రదర్శించిన ఏకైక కళ మిమిక్రీనే.
- అమెరికా అధ్యక్షుడు జాన్‌ఎఫ్ కెనడీ గొంతుతో మిమిక్రీ చేసినప్పుడు ఆయన ఇచ్చిన ప్రశంస మరిచిపోలేనిది.
- ప్రత్యక్ష శిష్యులు 72 మంది. ఏకలవ్య శిష్యులు వేలలో.
- 17 ఏళ్ల పాటు టీచర్‌గా పనిచేశారు.
- పీవీగారి ప్రోద్భలంతో 1972 నుంచి ఆరేళ్ల పాటు ఎంఎల్‌సీగా ఉన్నారు.
వరంగల్ నుంచి న్యూయార్క్ వరకు జరిగిన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు... మరెన్నో మలుపులు. అడ్డంకులు ఎదురైన చోట ఆ ప్రవాహం ఆగిపోలేదు అక్కడే మరో మలుపు తీసుకుని గమ్యం వైపు సాగింది. అదే విధంగా కుటుంబ పరిస్థితి సహకరించక అడుగు ముందుకు పడక ఆగాల్సి వచ్చిన చోట విశ్రాంతి తీసుకోలేదు. తన ప్రతిభకు మరింత పదును పెట్టారు. అందుకే తన గొంతును ఆసరగా చేసుకుని ప్రపంచాన్ని మూడు సార్లు చుట్టిరాగలిగారు. ఓ కొత్త కళకు ప్రాణం పోశారు. దానికి శాస్త్రరూపం ఇచ్చారు. నేడు ప్రత్యక్షంగా పరోక్షంగా వందల మందికి మిమిక్రీ కళతో గుర్తింపు ఉపాధి లభించేలా చేశారు. మరెందరికో స్ఫూర్తి ప్రదాత అవగలిగారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment