nerella venu madhav
-
గొంతుతో మాయ చేస్తారు!
వారు గొంతుతో మాయ చేస్తారు.. తమ స్వరంతో పలు రకాల ధ్వనులను అనుకరిస్తూ ఆశ్చర్య పరుస్తారు.. ప్రకృతి సవ్వడులు.. పక్షులు, జంతువుల అరుపులు, ప్రముఖులను అనుకరిస్తూ వాహ్వా అనిపిస్తారు. తమ కళతో ప్రజలను రంజింపచేస్తారు మిమిక్రీ కళాకారులు..ప్రపంచ ప్రఖ్యాత ధ్వని అనుకరణ సామ్రాట్ నేరేళ్ల వేణుమాధవరావు జన్మదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 28న ప్రపంచ మిమిక్రీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆర్మూర్: ధ్వని అనుకరణలో సత్తా చాటుతున్నారు జిల్లాకు చెందిన పలువురు కళాకారులు.. ఆర్మూర్ పట్టణానికి చెందిన బోండ్ల నారాయణ, నాగుబాయిల కుమారుడు బోండ్ల ఆనంద్ అనే యువకుడు 24 ఏళ్లుగా మిమిక్రీ రంగంలో రాణిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. చిన్నతనం నుంచే కళల వైపు ఆకర్షితుడైన ఆనంద్ తన గురువు జాదూ యుగంధర్ రంగనాథ్ వద్ద మిమిక్రీ మెలకువలు నేర్చుకున్నాడు. మిమిక్రీ సీనియర్ కళాకారుడు, మెజీషియన్ అయిన తన గురువుతో కలిసి ఇప్పటి వరకు సుమారు ఐదు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఆనంద్ తన మిమిక్రీ ద్వారా సినీ నటులు, రాజకీయ నాయకులను, పశు, పక్షాదులు, వాహన సముదాయాలకు సంబంధించిన దాదాపు 62 రకాల ధ్వనులను పలికించగలడు. ప్రతి ఏటా ఆర్మూర్‌లో నిర్వహించే దసరా ఉత్సవాల్లో ఆనంద్ మిమిక్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రెండు దశాబ్దాలకు పైగా ధ్వని అనుకరణతో మన్ననలు పొందుతున్న ఆనంద్ పలు బిరుదులను సైతం సొంతం చేసుకున్నాడు. ప్రపంచ ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ పేరిట నెలకొలి్పన అవార్డును సైతం ఆనంద్ అందుకున్నాడు. మూడేళ్ల క్రితం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మిమిక్రీ కళాకారుల వర్క్‌షాప్‌లో నేరెళ్ల వేణమాధవ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని సైతం అందుకున్నాడు. జిల్లా కేంద్రంలోని ఆక్స్ఫార్డ్ స్కూల్లో కావ్య విద్యా విషయక సమాఖ్య ఆధ్వర్యంలో మిమిక్రీ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. తెలంగాణ జానపద కళాకారుల సంఘం వారు మిమిక్రీ కళారత్న అవార్డును, కావ్య విద్య విషయ సమాఖ్య వారు మిమిక్రీ స్టార్ బిరుదును ప్రదానం చేశారు. రుణపడి ఉంటా మిమిక్రీ కళను నమ్ముకొన్న నన్ను ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రతీ ఒక్కరికీ రుణపడి ఉంటాను. నా తల్లిదండ్రులు, గురువు రంగనాథ్, భారత్ గ్యాస్ మేనేజర్ సుమన్ ప్రోత్సాహంతో మిమిక్రీ చేస్తున్నా. ఈ కళను మరింత మెరుగు పర్చుకొని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనే సంకల్పంతో కష్టపడుతున్నాను. – బోండ్ల ఆనంద్ సత్తా చాటుతున్న తండ్రీకూతుళ్లు.. నిజామాబాద్‌కల్చరల్ : మిమిక్రీలో రాణిస్తూ ఇంటిపేరుగా మార్చుకున్నాడు మల్లాపూర్ గ్రామానికి చెందిన శంకర్.. ఆయన దివ్యాంగుడైనా కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నారు. సినీ తారలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల్లో ప్రముఖ వ్యక్తుల కంఠధ్వనులను అనుకరించడం, ప్రకృతి శబ్ధాలను పలకడంలో పట్టు సాధించారు. మిమిక్రీతో పాటు వెంట్రిలాక్విజం కూడా నేర్చుకున్నారు. ఆయనతో కూతురు భార్గవిని కూడా మిమిక్రీ రంగంలోకి దిగించి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందుతున్నారు తండ్రీకూతుళ్లు.. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల వేణుమాధవ్ ఆధ్వర్యంలో 2017లో జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యశాలలో భార్గవి తొలి ప్రదర్శన ఇచ్చి ఎంతగానో ఆకట్టుకుంది. ప్రశంసలే బహుమానాలు కళాకారులకు ప్రేక్షకుల ప్రశంసలే బహుమానాలు. వారి ప్రోత్సహంతో ముందకు సాగుతున్నా. కళను ప్రదర్శిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాను. – శంకర్ -
‘నేరేళ్ల’ కుటుంబానికి బాబూమోహన్ పరామర్శ
వరంగల్: విఖ్యాత మిమిక్రీ కళాకారుడు దివంత నేరేళ్ల వేణుమాధవ్ కుటుంబ సభ్యులను సినీ నటుడు, అంథోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన మిమిక్రీ ప్రదర్శనలతో ప్రపంచ దేశాల్లో గుర్తింపు తెచ్చిన మహావ్యక్తి అని కొనియాడారు. ఆయన మరణం మిమిక్రీ ప్రపంచానికి తీరని లోటు అన్నారు.ఆయన వెంట వరంగల్‌కు చెందిన సినీ నటుడు శ్యామల గణేష్, గుళ్లపెల్లి శ్రీనివాస్, బొమ్మల అంబేడ్కర్, డీడీ, ఏఐఆర్ ప్రొగ్రాం హెడ్ ఎంవీ.వాసుప్రసాద్‌లు పాల్గొన్నారు. -
వేల గొంతుకల రేడు ఇక లేరు..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఒక్క గొంతులో వేల గొంతులకు ప్రాణం పోసిన మిమిక్రీ బ్రహ్మ ఇక లేరు. ధ్వన్యనుకరణ సమ్రాట్, పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ (85) ఈ లోకాన్ని వీడి వెళ్లారు. 60 ఏళ్లుగా మిమిక్రీ కళకు ఎనలేని సేవలు చేసిన ఆయన వరంగల్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. 1932 డిసెంబర్ 28న వరంగల్‌లో జన్మిం చిన ఆయనకు నలుగురు పిల్లలు. వేణుమాధవ్ కొన్ని నెలలుగా పార్కిన్సన్స్, శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. 15 రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు లోనవడంతో కుటుంబీకులు స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. వారంరోజుల చికిత్స అనం తరం ఆరోగ్యం కుదుటపడటంతో ఇంటికి తీసుకొ చ్చారు. ఆదివారం మళ్లీ అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. పరిస్థితి మెరుగుపడటంతో సోమవారం సాయంత్రం ఇంటికి తెచ్చారు. మంగళవారం ఉదయం మళ్లీ అనారోగ్యానికి గురై తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి వెండితెర వేల్పు నాగయ్య గొంతును అనుకరించడంతో మొదలైన నేరెళ్ల ప్రయాణం ఐక్యరాజ్యసమితిలో టెన్ ‘కమాండ్మెంట్స్’ను వినిపించడంతో పతాక స్థాయికి చేరుకుంది. «ధ్వని అనుకరణకు మిమిక్రీ అనే కళగా గుర్తింపు రావడానికి, యూనివర్సిటీలో మిమిక్రీని ఓ కోర్సుగా అందుబాటులోకి తేవడానికి వేణుమాధవే కారణం. ప్రత్యక్ష్యంగా 72 మందికి, పరోక్షంగా వేలమందికి ఆయన గురువుగా ఉన్నారు. అనేక అంతర్జాతీయ అవార్డులు, రివార్డులు అందుకుని రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చారు. తరలి వచ్చిన అభిమాన లోకం వేణుమాధవ్ ఇక లేరన్న విషయం తెలియగానే ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు అభిమానులు, శిష్యులు ఇంటికి తరలివచ్చారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీలు సీతారాంనాయక్, బండా ప్రకాష్, నగర మేయర్ నన్నపునేని నరేందర్, సీపీ రవీందర్‌తో పాటు ఎమెల్యేలు, ఆయన సమకాలికులు, కళాకారులు, అధికారులు, రాజకీయ నేతలు చివరిసారి నివాళులు అర్పించేందుకు తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేశపతి శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సాయంత్రం 7.50 గంటలకు ఆటోనగర్ శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. నేరెళ్ల పెద్ద కుమారుడు శ్రీనాథ్ ఆయన చితికి నిప్పు అంటించారు. తండ్రి కోరిక.. తహసీల్దార్ నేరేళ్ల వేణుమాధవ్ తండ్రి నేరెళ్ల శ్రీహరి. ఆయన వరంగల్‌లో సబ్ డివిజనల్ అధికారిగా పని చేశారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత వేణుమాధవ్‌ను తహసీల్దార్ చేయాలన్నది తండ్రి కోరిక. అయితే వేణుమాధవ్.. తండ్రి ఆశలకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ధ్వని అనుకరణపై ఇష్టంతో పుస్తకాలు, కాలేజీల కంటే సినిమా థియేటర్.. అందులో నటుల గొంతులను అనుకరించడంపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో టీచర్ ఉద్యోగంలో చేరారు. చరిత్ర బోధించే సమయంలో.. ఔరంగజేబు, అక్బరు, శివాజీ, జూలియస్ పాత్రల్లోకి పరాకాయ ప్రవేశం చేసి అభినయిస్తూ పాఠాలు చెప్పేవారు. మొత్తంగా 17 ఏళ్ల పాటు టీచర్‌గా పనిచేశారు. ప్రభుత్వ ఉద్యోగం రాగానే దానికే పరిమితం కాకుండా సెలవుల్లో మిమిక్రీ ప్రదర్శనలు ఇస్తూ తనలోని కళను సజీవంగా ఉంచారు. నాగయ్యపై అభిమానంతో వెండితెర తొలితరం స్టార్‌హీరోల్లో ఒకరైన చిత్తూరు నాగయ్యకుæ వేణుమాధవ్ వీరాభిమాని. నాగయ్య అభినయం, సంభాషణలు పలికే తీరుకు ముగ్ధుడయ్యేవారు. నాగయ్య నటించిన ప్రతి సినిమాను తప్పకుండా చూడడం, ఆయనలా మాట్లాడడం, అభినయించడం దినచర్యగా మారింది. ఆ అలవాటే కాలక్రమంలో మిమిక్రీ కళకు బీజం వేసింది. నాగయ్య ఒక్కడినే కాకుండా ఆయా సన్నివేశంలో వచ్చే అన్ని పాత్రలను అనుకరించడం మొదలుపెట్టారు. అక్కడ్నుంచి ఇంట్లో కుటుంబ సభ్యులు, బయటి జనాలను, వారి యాసలు ఇలా ప్రతీ దాన్ని పరిశీలించడం, అభినయించడం మొదలుపెట్టారు. సినిమాలు చూడడం, నటుల గొంతుతో మాట్లాడడం ఎక్కువై పోవడంతో తండ్రి చేతిలో దెబ్బలు, తల్లి ఓదార్పులు నిత్యకృత్యమయ్యాయి. ఓ దశలో వేణుమాధవ్‌కు పిచ్చి పట్టింది అనే స్థాయిలో ఆయన సాధన కొనసాగింది. వెన్ను తట్టిన కాలేజీ ప్రిన్సిపల్ వేణుమాధవ్ మెట్రిక్యులేషన్ చదువుతున్న రోజులవి. ధ్వని అనుకరణ కళను ఎవరూ ఆదరించని కాలంలో ఆయన ప్రతిభను ఆ కళాశాల ప్రిన్సిపల్ వెంకటరామనర్సు తొలిసారిగా గుర్తించారు. ‘‘ఆర్థిక పరిస్థితుల కారణంగా సినిమాలు చూసేందుకు నా దగ్గర డబ్బులు లేకుంటే ఆయన డబ్బులు ఇచ్చేవాడు. ఒకరోజు నేను దిగాలుగా ఉన్నా. సార్ నన్ను పిలిచి.. ఏంటీ సమస్య అని అడిగారు. అప్పటికే అమ్మ చనిపోయింది. నాన్నకు పక్షవాతం వచ్చింది. ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. నాలో నైరాశ్యం నెలకొంది. నాకు ఇష్టమైన సినిమాలు చూసే అవకాశం లేకపోయింది. అదే విషయం సారుకు చెబితే, వెంటనే రూ.60 నా చేతిలో పెట్టి నచ్చిన పని చేయమన్నారు. సార్ ఇచ్చిన డబ్బుతో నచ్చిన సినిమాలు చూసేవాడిని. ఆ సినిమాల్లోని ఆర్టిస్టుల గొంతులను, సన్నివేశాలను నేపథ్య సంగీతాన్ని... ఇలా అన్ని అంశాలను సార్ ముందు ప్రదర్శించేవాడిని. ఇలా ఒక రోజు చూపిన ప్రదర్శనకి సార్ అబ్బురపడ్డారు. ‘యు విల్ బీ ఏ గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ది వరల్డ్’ అని దీవించారు. సారు వాక్కు ఫలించింది. లెక్కకు మిక్కిలిగా ప్రశంసలు, అవార్డులు, రివార్డులు పొందినా.. మొదట్లో వెంకట రామనర్సు సారు ప్రశంసలు ప్రత్యేకమైనవి’’ అని ఓ ఇంటర్వూ్యలో వేణుమాధవ్ చెప్పారు. అప్పుడు ‘మిమిక్రీ’ పేరే లేదు.. ధ్వని అనుకరణ చేసిన ప్రతిచోట అద్భుత స్పందన వస్తుండడంతో నేరెళ్ల నటులందరి గొంతును అనుకరిస్తూ స్టేజ్‌షోలను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు మిమిక్రీ అంటున్న ఈ కళను అప్పుడు ఏ పేరుతో పిలవాలో తెలియక ‘ప్రత్యేక ప్రతిభ’గా చెప్పుకునే వారు. ఇదే ఆ తర్వాత మిమిక్రీగా పేరు పొందింది. అనతి కాలంలోనే మిమిక్రీ కళతో వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించగలిగారు. ఇప్పుడు చిత్రసీమలో ఉన్న చాలామంది హస్యనటులు మిమిక్రీ ఆధారంగానే అందులోకి ప్రవేశించగలిగారు. మిమిక్రీకి ఓ కళగానే కాదు.. ఓ శాస్త్ర రూపం ఇచ్చేందుకు వేణుమాధవ్ శ్రమించారు. ఆయన కష్టం ఫలితంగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మిమిక్రీని ఓ కోర్సుగా ప్రవేశపెట్టారు. కళ ఏమిటో తెలియని దాన్ని శాస్త్రం దాకా తీసుకురావడం వెనుక వేణుమాధవ్ ప్రతిభ, పట్టుదల ఉన్నాయి. చదువు, ఉద్యోగం కన్నా గొప్పది.. మిమిక్రీ కళ కూడా ఎన్నో కళల్లాగే చాలా ప్రాచీనమైనదని వేణుమాధవ్ అనేవారు. ‘‘రావణుడు సీతను అపహరించే సమయంలో ‘అహో సీత... అహో లక్ష్మణా...’అని మారీచుడు రాముడి గొంతును అనుకరించాడు. ఇది త్రేతాయుగంలో జరిగింది. ఆ తర్వాత ద్వాపరయుగంలో మిమిక్రీ ఘటనలు ఉన్నాయి. విరాటపర్వంలో భీముడు గొంతుమార్చి మాట్లాడి సైరంధ్రిని అంతమొందించాడు. గౌతముడిలా మాట్లాడి ఇంద్రుడు అహల్యను ఏమార్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఆ ప్రాచీనమైన కళ నాలో స్వతహాగా ఉండడం వల్లే నేను ఈ స్థాయికి రాగలిగా’’ అని ఆయన చెప్పేవారు. తొలినాళ్లలో అనుకరణ వ్యామోహంలో మెట్రిక్యులేషన్లో మొదటిసారి పరీక్షలో ఫెయిల్ అయినా ఆయన బాధపడలేదు. ‘‘చదువు, ఉద్యోగం వీటన్నింటి కంటే మిమిక్రీయే గొప్పదని నా భావన. తండ్రి కోరిక ప్రకారం తహసీల్దార్ అయి ఉంటే మహా అంటే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూ ఉండేవాడిని. ఇలా ఓ కళను ప్రపంచవ్యాప్తం చేసి ఉండేవాడిని కాదు’’ అని అనేక సందర్భాల్లో వేణుమాధవ్ చెప్పారు. మిమిక్రీ కళతో మొత్తం మూడుసార్లు ప్రపంచ పర్యటనలు చేసిన ఆయన.. ఎనిమిది పదుల వయసులోనూ ఏ కొత్త శబ్దం విన్నా దాన్ని అనుకరించేందుకు ప్రయత్నించేవారు. ‘టెన్ కమాండ్మెంట్స్’తో అంతర్జాతీయ ఖ్యాతి వేణుమాధవ్‌కు ప్రత్యక్ష శిష్యులు 72 మంది, ఏకలవ్య శిష్యులు వేల మంది ఉన్నారు. బైబిల్ నేపథ్యం ఆధారంగా తీసిన ‘టెన్ కమాండ్మెంట్స్’లోని సంభాషణల అనుకరణ ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మంచి పేరు తెచ్చింది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శించిన ఏకైక కళ మిమిక్రీ కావడం, దాన్ని వేణుమాధవ్ స్వయంగా చేసి చూపడం విశేషం. అమెరికా అధ్యక్షుడు జాన్ఎఫ్ కెనడీ గొంతుతో ఆయన చేసిన మిమిక్రీకి ఐక్యరాజ్య సమితి కార్యాలయం చప్పట్లతో మార్మోగిపోయింది. వేణుమాధవ్ పుట్టిన రోజైన డిసెంబర్ 28ని ప్రపంచ మిమిక్రీ దినోత్సవంగా ఆయన శిష్యులు నిర్వహిస్తున్నారు. వరంగల్ నుంచి న్యూయార్క్ వరకు నేరెళ్ల వేణుమాధవ్ చేసిన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. అయినా ఆయన ఎక్కడా ఆగిపోలేదు. తన ప్రతిభకు మరింత పదును పెట్టి ప్రపంచాన్ని మూడుసార్లు చుట్టి వచ్చి, కొత్త కళకు ప్రాణం పోసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. 12 చిత్రాల్లో నటన బీఎన్ రెడ్డి ప్రోత్సాహంతో వేణుమాధవ్ 12 చిత్రాల్లో నటించారు. వేణుమాధవ్ మిమిక్రీ ప్రదర్శనలు వీక్షించేందుకు మాజీ రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, వీవీ గిరి, ఫక్రుద్దీన్, జైల్‌సింగ్, నీలం సంజీవరెడ్డి, మాజీ ప్రధాని పీవీ నర్సింహరావులు ఆసక్తి చూపించేవారు. అవార్డులు.. రివార్డులు 2001లో పద్మశ్రీ పురస్కారం 1978లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి కళాప్రపూర్ణ బిరుదు ఏయూ, కేయూ, ఇగ్నో నుంచి గౌరవ డాక్టరేట్లు 1972–1978వరకు ఎమ్మెల్సీగా సేవలు 1976–1977 ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ 1975లో వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివెల్‌కు తెలుగు కాన్ఫరెన్స్ సెక్రటరీగా.. 1974–1978 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యులు 1976–1978 కాకతీయ యూనివర్సిటీ సెనెట్ సభ్యులు, సౌత్ జోన్ కల్చరల్ సెంటర్(తంజావూర్) మెంబర్ 1995–1996 దూరదర్శన్ ప్రోగ్రామ్ అడ్వయిజరీ కమిటీ మెంబర్ 1993–1996: ఆంధ్రప్రదేశ్ టెలికం అడ్వయిజరీ కమిటీ మెంబర్ 1993–1996 జోనల్ రైల్వే యూçజర్ కమిటీ మెంబర్ 1972–1975: ఏపీ లెజిస్లేటివ్ లైబ్రరీ కమిటీ మెంబర్ 1974–1978: రవీంద్రభారతి కమిటీ మెంబర్ 1975: ఏపీ అకాడమీస్ రివ్యూ కమిటీ మెంబర్ 1973–1975 రోటరీయన్, రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ గౌరవ సభ్యులు కళా రంగానికి తీరని లోటు: సీఎం కేసీఆర్ నేరేళ్ల వేణుమాధవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిమిక్రీ కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తెచ్చిపెట్టిన వ్యక్తిగా వేణుమాధవ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. మిమిక్రీని పాఠ్యాంశంగా, అధ్యయనాంశంగా మలిచి ఆ కళకు పితామహుడిగా పేరు పొందారన్నారు. ఆయన మృతి కళా రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘నేరెళ్ల’ మృతి తెలుగుజాతికి తీరనిలోటు: జగన్ సాక్షి, అమరావతి: ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు, అంతర్జాతీయంగా తెలుగువారికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకు వచ్చిన స్వరబ్రహ్మ నేరెళ్ల వేణు మాధవ్ మృతి యావత్ తెలుగు జాతికి తీరని లోటు అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో... దేశవ్యాప్తంగా ఆయనకు అసంఖ్యాకంగా అభిమానులున్నారని, దశాబ్దాలుగా ఆయన వందల మంది మిమిక్రీ కళాకారులకు మార్గదర్శనం చేశారని జగన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పలు భారతీయ భాషల్లో స్వరానుకరణ, హాలీవుడ్ నటుల స్వరాలను కూడా అలవోకగా పలికించడంతో పాటు హాస్యం పండించడం ద్వారా ఆయన కోట్ల హృదయాలకు చేరువయ్యారని అన్నారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలుగు జాతికి గర్వకారణం: కేవీ రమణాచారి స్వర బ్రహ్మ నేరెళ్ల వేణుమాధవ్ మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు అని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. ఆయన తెలుగువాడు కావటం తెలుగు జాతికి ఎంతో గర్వకారణమన్నారు. తన ప్రతిభతో కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకొన్నారని కొనియాడారు. -
నేరెళ్ల వేణుమాధవ్ ఫోటోలు మీ కోసం
-
అనుకరించడం ఓ గొప్ప అనుభూతి
సాక్షి, హన్మకొండ : అహోసీత... అహో లక్ష్మణా.... మొదటిసారిగా త్రేతాయుగంలో మారీచుడు, రాముని గొంతుతో మాట్లాడి వేరేవారి గొంతును అనుకరించడం విన్నాం. ఆ తర్వాత ద్వాపరయుగానికి చెందిన భారతంలో విరాటపర్వంలో భీముడు గొంతుమార్చి మాట్లాడి సైరంధ్రిని అంతమొందించాడు. గౌతమునిలా మాట్లాడి ఇంద్రుడు అహల్యను ఏమార్చాడు.... ఆ తర్వాత చానాళ్లు ఈ విద్య మరుగున పడిపోయింది. మళ్లీ కలియుగంలో పేరిని శివతాండం ఆవిర్భవించిన కాకతీయ గడ్డపై పుట్టిన నేరేళ్ల వేణుమాధవ్ గొంతులో తిరిగి ప్రాణం పోసుకుంది. అక్కడి నుంచి ప్రపంచమంతా వ్యాపించి... ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ ప్రతినిధులకు బైబిల్లోని టెన్కమాండ్మెంట్స్కు గొంతుతోనే కళ్లకు కట్టినట్లు చూపించేంత వరకు వెళ్లింది. మలుపుల ప్రవాహం నేరేళ్ల వేణుమాధవ్ తండ్రి నేరెళ్ల శ్రీహరి వరంగల్‌లో సబ్‌డివిజనల్ అధికారిగా ప్రభుత్వ ఉద్యోగి. కొడుకు డిగ్రీ పూర్తి చేసి తహశీల్దార్ అవ్వాలనేది ఆయన కోరిక. కానీ వేణుమాధవ్ ఆశయం వేరు ఆనాటి స్టార్హీరో చిత్తూరు నాగయ్య అంటే వల్లమానిన అభిమానం. వెండితెరపై నాగయ్య కనబరిచిన అభినయం, సంభాషణలు పలికే తీరు బాల వేణుమాధవ్‌ను నీడలా వెంటాడేవి. దానితో నాగయ్య నటించిన ప్రతి సినిమాను మిస్సవకుండా చూడటం, ఆయనలా మాట్లాడటం, అభినయించడం చేసేవారు. మిమిక్రీ కళకు తొలి బీజం పడింది కూడా అక్కడే. ఆ తర్వాత కేవలం నాగయ్య ఒక్కడినే కాకుండా ఓ సన్నివేశంలో వచ్చే అన్ని పాత్రలను అనుకరించడం.. ఆ తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులు... బయటి జనాలు వారి యాసలు ఇలా ప్రతీ దాన్ని పరిశీలించడం, ఆపై అభినయించడం ఆయనకు చిన్నతనంలో నిత్యకత్యం అయ్యింది. ఇక్కడే మిమిక్రీ కళ బీజం నుంచి మొక్కగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత అందరు నటులను అనుకరించడం స్టేజ్‌షోలను ఇవ్వడం చేసేవారు. ఇప్పుడు మిమిక్రీ అంటున్న ఈ కళను అప్పుడు ఏ పేరుతో పిలవాలో తెలియక ప్రత్యేక ప్రతిభగా చెప్పుకునే వారు. తహశీల్దార్ కావాల్సిన కొడుకు సినిమాలంటూ తిరగడం తండ్రి కోపానికి కారణమైంది. దానితో తండ్రి చేతిలో దెబ్బలు. ‘ సినిమాలు, అనుకరణలు ఇవన్నీ వొదిలేయ్ హయిగా చదువుకో, చదువు కడుపు నింపుతుంది కానీ సినిమాలు కావు’ అంటూ తల్లి ఊరడింపులు. అనుకరణ వద్దంటూ ఎవరెంతగా చెప్పినా ‘ నాగయ్య గారి అభినయం, గొంతు అనుక్షణం నన్ను వెంటాడేవి. అందుకే ఎవ్వరేమన్నా సరే నాగయ్య సినిమా చూడటం మానలేదు. ఇంటికొచ్చాక ఆయనలా అభినయించడం వదలలేదు. దానితో అంతా నాకు పిచ్చిపట్టిందని అనుకునేవారు. అంతగా నాకు అనుకరణపై వ్యామోహం పెరిగింది’ అని చెబుతారు నేరెళ్ల. మాష్టారు పోత్సాహంతో మిమిక్రీ మాష్టారుగా .. ఇలా అనుకరణ వ్యామోహంలో తలామునకలై ఉన్న కాలంలో మెట్రిక్యులేషన్ ఫలితాలు వచ్చాయి. మొదటిసారి పరిక్షలో ఫెయిల్. బాధపడలేదు. ఎందుకంటే చదువు, ఉద్యోగం వీటన్నింటి కంటే మిమిక్రీయే గొప్పదని ఆయన భావించేవారు. రెండో ప్రయత్నంలో పాస్ అయ్యారు. ఆ తర్వాత ఇంటర్ చదివేందుకు వరంగల్ గవర్నమెంట్ కాలేజీలో ప్రవేశం. మిమిక్రీకి మొదటిసారిగా ఓ కళగా గుర్తింపు వచ్చింది ఇక్కడే. అనుకరణ కళను ఎవరూ ఆదరించని కాలంలో ఆ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరామనర్సు గారు నేరెళ్లలో ఒక ప్రత్యేకమైన కొత్త ప్రతిభ దాగి ఉందనే విషయాన్ని పసిగట్టారు. చదువు ఒక్కటే ప్రతిభ కాదు కళలు కూడా సమాంతర ప్రతిభనే అనే అభిప్రాయాన్ని ఆయన కలిగి ఉండేవారు. అందుకే నేరెళ్లలో మొగ్గతొడిగిన ప్రత్యేక ప్రతిభను మిమిక్రీ అనే పెద్ద చెట్టుగా ఎదిగేందుకు అవసరమైన పోత్రాహం అందించారు. ఎంతగా ప్రోత్సహించారంటే ఆర్థిక పరిస్థితుల కారణంగా సినిమాలు చూసేందుకు నేరెళ్ల వద్ద డబ్బులు లేకుంటే తన జీతంలో నుంచి ఇచ్చేంతగా. ‘ఒక రోజు నేను దిగాలుగా ఉన్నాను. సార్ నన్ను పిలిచి ‘‘ఏంటీ సమస్య’’ అన్నారు. అప్పటికే అమ్మ చనిపోవడంతో పాటు నాన్నకు పక్షవాతం వచ్చింది. ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. దానితో నాలో ఏమూలో పేరుకుపోయిన నైరాశ్యం. ఈ నేపథ్యంలో ఇష్టమైన సినిమాలు చేసే అవకాశం లేకపోవడం. అదే విషయం సారుకు చెబితే, వెంటనే ఆయన రూ.60 నా చేతిలో పెట్టి నచ్చిన పని చేయమన్నారు’ అని గతం గుర్తు చేసుకున్నారు వేణుమాధవ్. గురువు ఇచ్చిన సొమ్ముతో నచ్చిన సినిమాలు చూసి వాటిల్లో ఆర్టిస్టుల గొంతులు, సన్నివేశాలు, నేపథ్య సంగీతంలో అన్ని గురుగారి ముందు ప్రదర్శించారు. అప్పటికే వేణుమాధవ్‌లో దాగున్న ప్రతిభ గురించి తెలిసినా.. ఆ రోజు చూపిన ప్రదర్శనకి ఆయన అబ్బురపడి ఆయన ‘ యు విల్ బీ ఏ గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ది వరల్డ్’ అని దీవించారు. ఆయన వాక్కు ఫలించింది. తదనంతర కాలంలో నేరెళ్ల లెక్కకు మిక్కిలిగా ప్రశంసలు, అవార్డులు, రివార్డులు పొందినా ప్రారంభంలో వెంకట రామనర్సు గారు ఇచ్చిన ప్రశంసలు ప్రత్యేక మైనదని చెబుతారు. అవకాశలు సష్టించుకోవడం అన్ని సార్లు అవకాశాలు తలుపు తట్టి పిలవవు. కొన్ని సార్లు పక్కనే ఉంటాయి. వాటిని మన మే పసిగట్టి ఒడిసి పట్టుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టడంతో టీచర్ ఉద్యోగంలో చేరిపోయారు నేరెళ్ల వేణుమాధవ్. చరిత్రలో వచ్చే ఔరంగజేబు, అక్బరు, శివాజీ, జూలియస్ ఇతర పాత్రలు వచ్చినప్పుడు ఆ పాత్రల్లోకి పరాకాయ ప్రవేశం చేసి అభినయిస్తూ పాఠాలు బోధించేవారు. జీతం డబ్బులతో కంఫర్ట్ జోన్లో కూరుకుపోయి కళను మర్చిపోలేదాయన. తనలో దాగున్న కళకు మరింతగా సానబెట్టడం చేశారు. టీచర్‌గా సెలవులు ఎక్కువగా ఉండటంతో ప్రదర్శనలు ఇచ్చేందుకు ఎక్కువ సమయం దొరికేది. ప్రతిచోట ఆశ్చర్యం, ప్రశంసలే.. అలా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా వరంగల్ నుంచి న్యూయార్క్ వరకు వెళ్లారు. ఎనిమిది పదుల వయసులో ప్రవేశించిన ఏ కొత్త శబ్ధం విన్నా దాన్ని అనుకరించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తండ్రి కోరిక మేరకు తహశీల్దార్ అయ్యింటే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసేవారు కావచ్చు. కానీ తన కిష్టమైన పని చేయడం వల్ల ఓ కొత్త కళకు ప్రాణం పోయగలిగారు. దానితో వందల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించగలిగారు. ఇప్పుడు చిత్రసీమలో ఉన్న చాలామంది హస్యనటులు మిమిక్రీ ఆధారంగానే అందులోకి ప్రవేశించగలిగారు. అంతే కాదు మిమిక్రీకి ఓ కళగానే కాదు ఓ శాస్త్ర రూపం కూడా వేణుమాధవే కల్పించారు. ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మిమిక్రీని ఓ కోర్సుగా నిర్వహిస్తున్నారు. తెలుగులో అనుకరణ, ఇంగ్లీష్‌లో ఇంప్రెషనిస్ట్ అనే ప్రత్యేక ప్రతిభకు మిమిక్రీ అనే ఓ కళా రూపాన్ని ఇచ్చిన ఘనత నిస్సందేహంగా నేరెళ్ల వేణుమాధవ్ కే దక్కుతుంది. భానుమతి గారి గొంతును అనుకరించడం చాలా కష్ట పడాల్సి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చిన ఐటమ్ ‘ టెన్ కమాండ్మెంట్స్’ గొప్ప ప్రశంస ఐక్యరాజ్య సమితి సమావేశంలో ప్రదర్శించిన ఏకైక కళ మిమిక్రీనే. అమెరికా అధ్యక్షుడు జాన్ఎఫ్ కెనడీ గొంతుతో మిమిక్రీ చేసినప్పుడు ఆయన ఇచ్చిన ప్రశంస మరిచిపోలేనిది. ప్రత్యక్ష శిష్యులు 72 మంది. ఏకలవ్య శిష్యులు వేలలో. 17 ఏళ్ల పాటు టీచర్‌గా పనిచేశారు. పీవీగారి ప్రోద్భలంతో 1972 నుంచి ఆరేళ్ల పాటు ఎంఎల్సీగా ఉన్నారు. వరంగల్ నుంచి న్యూయార్క్ వరకు జరిగిన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు... మరెన్నో మలుపులు. అడ్డంకులు ఎదురైన చోట ఆ ప్రవాహం ఆగిపోలేదు అక్కడే మరో మలుపు తీసుకుని గమ్యం వైపు సాగింది. అదే విధంగా కుటుంబ పరిస్థితి సహకరించక అడుగు ముందుకు పడక ఆగాల్సి వచ్చిన చోట విశ్రాంతి తీసుకోలేదు. తన ప్రతిభకు మరింత పదును పెట్టారు. అందుకే తన గొంతును ఆసరగా చేసుకుని ప్రపంచాన్ని మూడు సార్లు చుట్టిరాగలిగారు. ఓ కొత్త కళకు ప్రాణం పోశారు. దానికి శాస్త్రరూపం ఇచ్చారు. నేడు ప్రత్యక్షంగా పరోక్షంగా వందల మందికి మిమిక్రీ కళతో గుర్తింపు ఉపాధి లభించేలా చేశారు. మరెందరికో స్ఫూర్తి ప్రదాత అవగలిగారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూత