నేరెళ్ల వేణుమాధవ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకుంటున్న ఆనంద్ (ఫైల్)
వారు గొంతుతో మాయ చేస్తారు.. తమ స్వరంతో పలు రకాల ధ్వనులను అనుకరిస్తూ ఆశ్చర్య పరుస్తారు.. ప్రకృతి సవ్వడులు.. పక్షులు, జంతువుల అరుపులు, ప్రముఖులను అనుకరిస్తూ వాహ్వా అనిపిస్తారు. తమ కళతో ప్రజలను రంజింపచేస్తారు మిమిక్రీ కళాకారులు..ప్రపంచ ప్రఖ్యాత ధ్వని అనుకరణ సామ్రాట్ నేరేళ్ల వేణుమాధవరావు జన్మదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 28న ప్రపంచ మిమిక్రీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ఆర్మూర్: ధ్వని అనుకరణలో సత్తా చాటుతున్నారు జిల్లాకు చెందిన పలువురు కళాకారులు.. ఆర్మూర్ పట్టణానికి చెందిన బోండ్ల నారాయణ, నాగుబాయిల కుమారుడు బోండ్ల ఆనంద్ అనే యువకుడు 24 ఏళ్లుగా మిమిక్రీ రంగంలో రాణిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. చిన్నతనం నుంచే కళల వైపు ఆకర్షితుడైన ఆనంద్ తన గురువు జాదూ యుగంధర్ రంగనాథ్ వద్ద మిమిక్రీ మెలకువలు నేర్చుకున్నాడు. మిమిక్రీ సీనియర్ కళాకారుడు, మెజీషియన్ అయిన తన గురువుతో కలిసి ఇప్పటి వరకు సుమారు ఐదు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఆనంద్ తన మిమిక్రీ ద్వారా సినీ నటులు, రాజకీయ నాయకులను, పశు, పక్షాదులు, వాహన సముదాయాలకు సంబంధించిన దాదాపు 62 రకాల ధ్వనులను పలికించగలడు. ప్రతి ఏటా ఆర్మూర్‌లో నిర్వహించే దసరా ఉత్సవాల్లో ఆనంద్ మిమిక్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
రెండు దశాబ్దాలకు పైగా ధ్వని అనుకరణతో మన్ననలు పొందుతున్న ఆనంద్ పలు బిరుదులను సైతం సొంతం చేసుకున్నాడు. ప్రపంచ ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ పేరిట నెలకొలి్పన అవార్డును సైతం ఆనంద్ అందుకున్నాడు. మూడేళ్ల క్రితం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మిమిక్రీ కళాకారుల వర్క్‌షాప్‌లో నేరెళ్ల వేణమాధవ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని సైతం అందుకున్నాడు. జిల్లా కేంద్రంలోని ఆక్స్‌ఫార్డ్ స్కూల్‌లో కావ్య విద్యా విషయక సమాఖ్య ఆధ్వర్యంలో మిమిక్రీ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. తెలంగాణ జానపద కళాకారుల సంఘం వారు మిమిక్రీ కళారత్న అవార్డును, కావ్య విద్య విషయ సమాఖ్య వారు మిమిక్రీ స్టార్ బిరుదును ప్రదానం చేశారు.
రుణపడి ఉంటా
మిమిక్రీ కళను నమ్ముకొన్న నన్ను ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రతీ ఒక్కరికీ రుణపడి ఉంటాను. నా తల్లిదండ్రులు, గురువు రంగనాథ్, భారత్ గ్యాస్ మేనేజర్ సుమన్ ప్రోత్సాహంతో మిమిక్రీ చేస్తున్నా. ఈ కళను మరింత మెరుగు పర్చుకొని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనే సంకల్పంతో కష్టపడుతున్నాను.
– బోండ్ల ఆనంద్
సత్తా చాటుతున్న తండ్రీకూతుళ్లు..
నిజామాబాద్‌కల్చరల్ : మిమిక్రీలో రాణిస్తూ ఇంటిపేరుగా మార్చుకున్నాడు మల్లాపూర్ గ్రామానికి చెందిన శంకర్.. ఆయన దివ్యాంగుడైనా కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నారు. సినీ తారలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల్లో ప్రముఖ వ్యక్తుల కంఠధ్వనులను అనుకరించడం, ప్రకృతి శబ్ధాలను పలకడంలో పట్టు సాధించారు. మిమిక్రీతో పాటు వెంట్రిలాక్విజం కూడా నేర్చుకున్నారు. ఆయనతో కూతురు భార్గవిని కూడా మిమిక్రీ రంగంలోకి దిగించి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందుతున్నారు తండ్రీకూతుళ్లు.. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల వేణుమాధవ్ ఆధ్వర్యంలో 2017లో జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యశాలలో భార్గవి తొలి ప్రదర్శన ఇచ్చి ఎంతగానో ఆకట్టుకుంది.
ప్రశంసలే బహుమానాలు
కళాకారులకు ప్రేక్షకుల ప్రశంసలే బహుమానాలు. వారి ప్రోత్సహంతో ముందకు సాగుతున్నా. కళను ప్రదర్శిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాను.
– శంకర్
Comments
Please login to add a commentAdd a comment