ఐటీ కంపెనీలో పని చేస్తున్న రవీంద్రకు పెళ్లై ఐదేళ్లు గడిచినా సంతానం కలగలేదు. దంపతులిద్దరూ డాక్టర్‌ను సంప్రదించారు. వీర్యకణాల సంఖ్య బాగా తగ్గిపోవడమే దీనికి కారణమని వారు తేల్చి చెప్పారు. ఉప్పల్‌కు చెందిన సతీష్, కూకట్‌పల్లికి చెందిన అశోక్‌కు వివాహమై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగడం లేదు. ఈ సమస్య వీరిద్దరిదే కాదు నగరంలోని ఐటీ దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న ఎక్కువ మంది యువకులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా మనిషి శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. వృషణాలకు ఇంతకన్నా ఒకట్రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ ఉండాలి. ఒకవేళ ఏదైన కారణంతో వృషణాల వద్ద వేడి పెరిగితే అందులో ఉండే శుక్రకణాల సంఖ్య తగ్గడం ఖాయమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. యువకుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గడానికి కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ల నుంచి వెలువడే రేడియేషనే ప్రధాన కారణమని స్పష్టం చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో
హైదరాబాద్: నగరంలో పలువురు ఐటీ, దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న చాలామంది వీర్యకణాల తగ్గుదల సమస్యతో బాధపడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. వీళ్లు పైకి చూడ్డానికి శారీరక దృఢత్వం, ఆరోగ్యంగా కన్పించినా.. వీరిలో వీర్యకణాల సంఖ్య చాలా తక్కువగా నమోదవుతోంది. టైట్ జీన్స్ వేసుకోవడం, మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లకు తోడు రోజంతా కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌తో పనిచేయడంతో వాటి నుంచి వెలువడే రేడియేషన్ స్త్రీ, పురుషుల హార్మన్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయడుతున్నారు.
వైద్య ఆరోగ్యశాఖ తాజా గణాంకాల ప్రకారం 2010లో 15శాతం మంది యువకుల్లో వీర్యకణాల తగ్గుదల కనిపించగా.. 2014లో అది 25 శాతానికి పెరిగింది. ప్రస్తుతం 40 శాతానికి చేరుకుంది. 2020 నాటికి 50 శాతం మంది యువకుల్లో వీర్యకణాలు తగ్గే ప్రమాదం పొంచి ఉన్నట్లు ప్రకటించింది. నిజానికి ఆరోగ్యవంతమైన 70 కిలోల యువకుడి వీర్యంలో ప్రతి మిల్లీలీటర్‌కు 39 మిలియన్ల శుక్ర కణాలుంటాయి. కంప్యూటర్, సెల్‌ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్‌తో చాలా మంది యువకుల్లో 15 మిలియన్ల కంటే (లో స్పెర్మ్ కౌంట్) తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఒకవేళ ఆశించినస్థాయిలో కణాలు ఉన్నప్పటికీ.. వాటిలో చలనం ఉండటం లేదు. ప్రధానంగా సంతాన లేమికి ఇదే ప్రధాన కారణమని వైద్యులు భావిస్తున్నారు.
ఐటీ, అనుబంధ రంగాల్లోనే అధికం..
ఒకప్పుడు పాతికేళ్లకే పెళ్లి చేసుకుని, ఏడాది తిరగకముందే పిల్లల్ని కనేవారు. కానీ ప్రస్తుతం చాలా మంది ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల వేటలో పడి 30 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లికి సిద్ధపడుతున్నారు. దీనికి తోడు గంటల తరబడి ల్యాప్‌టాప్‌లను ఒడిలో పెట్టుకుని పని చేస్తుండటంతో ఉష్ణోగ్రతలకు హార్మోన్లలో సమతుల్యత లోపిస్తోంది. ఆకలేసినప్పుడల్లా క్యాంటిన్‌లో రెడీమేడ్‌గా దొరికే పిజ్జాలు, బర్గర్లతో కడుపు నింపుకోవడంతో ఇది స్త్రీ, పురుషుల హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీకెండ్ పార్టీల పేరుతో మద్యం అతిగా తీసుకోవడంతోనూ శృంగార సమస్యలు తలెత్తుతున్నాయి. పెళ్లై నాలుగైదేళ్లు దాటినా పిల్లలు పుట్టకపోవడంతో చివరకు సంతాన సాఫల్య కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఇలా పిల్లల కోసం సంతాన సాఫల్య కేంద్రాలకు పరుగులు తీస్తున్న బాధితుల్లో అత్యధికులు ఐటీ, అనుబంధ రంగాల్లో పని చేస్తున్న వారే కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment