నేడే రాహుల్ రాక
నిర్మల్ అర్బన్ : కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ గురువారం జిల్లాకు వస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు రాహుల్ గాంధీ కిసాన్ సందేశ్ యాత్ర పేరుతో జిల్లాలో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి ఆయన నిర్మల్‌కు చేరుకోనున్నారు. ఇప్పటికే ఆయన రూట్‌మ్యాప్ ఖరారు కావడంతో నేతలు ఏర్పాట్లను వేగవంతం చేశారు. నిర్మల్ పట్టణంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. దారి పొడవునా ప్రచార ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
పార్టీ రాష్ట్ర స్థాయి నేతలంతా ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. మూడు, నాలుగు రోజులుగా ఏర్పాట్లను దగ్గరుండి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. పర్యటనను విజయవంతం చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు.
ఎస్పీజీ గుప్పిట్లో నిర్మల్...
రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో నిర్మల్, మామడ, లక్ష్మణచాంద ప్రాంతాల్లో స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్(ఎస్పీజీ), నిఘా విభాగం భద్రతా ఏర్పాట్లను నిర్వహిస్తోంది. జిల్లా ఎస్పీ తరున్‌జోషితోపాటు జాతీయ స్థాయి భద్రతా అధికారులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రాహుల్‌గాంధీ గురువారం రాత్రి నిర్మల్‌లో బస చేస్తుండడంతో ఇప్పటికే భద్రతను ముమ్మరం చేశారు. రాహుల్ పర్యటించే రూట్లలో పోలీసులు బృందాలతో తనిఖీలు చేయించారు. ఇప్పటికే నిర్మల్ ప్రాంతాన్ని ఎస్పీజీ గుప్పిట్లోకి తీసుకొంది.
భారీ ఏర్పాట్లు..
రాహుల్‌గాంధీ పర్యటన నేపథ్యంలో పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లను చేశారు. డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పర్యటనను పార్టీ రాష్ట్రస్థాయి నేతలు పర్యవేక్షిస్తున్నారు. వారం రోజులుగా పార్టీ ప్రముఖులు నిర్మల్‌కు వచ్చి ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. నిర్మల్ పట్టణంతోపాటు మామడ మండలం కొరిటికల్, లక్ష్మణచాంద మండలం లక్ష్మణచాంద, పొట్టపెల్లి, రాచాపూర్, వడ్యాల్ గ్రామాల్లో ఏర్పాట్లు చేశారు. శుక్రవారం వడ్యాల్‌లో నిర్వహించే బహిరంగ సభకు జనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేకంగా సభా వేదికను తయారు చేశారు.