తడిసినా.. ‘మద్దతుకే కొనాలి..
మహబూబాబాద్, న్యూస్‌లైన్ : తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు డిమాండ్ చేశారు. శనిగపురంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆ పార్టీ నాయకులు సందర్శించి, తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం రవీందర్‌రావు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో శుక్రవారం కురిసిన అకాల వర్షానికి సుమారు 10వేల బస్తాల ధాన్యం పూర్తిగా తడిచిపోయిందన్నారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో లేకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు అండగా ఉండి ఉద్యమిస్తామన్నారు. న్యాయం జరిగేంత వరకు టీఆర్‌ఎస్ రైతులకు అండగా ఉంటుందన్నారు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్‌నాయక్ మాట్లాడుతూ నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే రైతులు నష్టపోయారని అన్నారు. అనంతరం రవీందర్‌రావు ఆర్డీఓ మధుసూదన్‌నాయక్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ అకాల వర్షంతో నష్టపోయిన పరిస్థితుల గురించి వివరించారు. అన్ని విధాలా రైతాంగాన్ని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో మార్నేని వెంకన్న, డోలి లింగుబాబు, వెంకన్న, వెంకటాద్రి, ఉపేంద్ర, వీరేందర్ పాల్గొన్నారు.