అతికినట్లు సరిపోయింది
బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ పేదల సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదపడేలా ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. సంప్రదాయ బడ్జెట్‌కు భిన్నంగా వాస్తవిక కోణంలో, తెలంగాణ రాష్ట్రానికి అతికినట్లు బడ్జెట్ ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి బడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రంగాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చారని, పూర్తి సమతౌల్యతతో బడ్జెట్ రూపొందించారని ప్రశంసించారు. నిరుపేదలు, మహిళలు, చిరుద్యోగుల జీవన ప్రమాణాలు పెంచేలా బడ్జెట్‌లో కేటాయింపులున్నాయన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతి, కులవృత్తుల ప్రోత్సాహకానికి అత్యధిక నిధులు కేటాయించడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. సమైక్య పాలనలో విస్మరణకు గురైన అనేక రంగాలు, వర్గాలకు ఈసారి బడ్జెట్‌లో ఎక్కువ కేటాయింపులు చేశారని అభినందించారు. ఆర్థిక వనరులను సరిగ్గా అంచనా వేయడంతోపాటు రాష్ట్రావసరాలను సరిగ్గా అర్థం చేసుకుని తెలంగాణలోని మానవవనరులను సంపూర్ణంగా వినియోగించుకునేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. బడ్జెట్ రూపకల్పన విషయంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసినప్పటికీ ఆర్థిక శాఖ అత్యంత సమర్థంగా నిర్వహణ, ప్రగతి పద్దుల కింద నిధులు కేటాయించిందన్నారు
సీఎంకు అభినందనల వెల్లువ...
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి దోహదపడే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు సీఎం కేసీఆర్‌ను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో కలసి అభినందనలు తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో యాదవులు, కుర్మలు సీఎంకు గొర్రెలు బహుకరించగా మత్య్యకారులు చేపలు, వలను బహుకరించారు. కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ కింద ఆర్థిక సాయాన్ని పెంచినందుకు, గర్భిణుల ప్రసవాలకు ప్రత్యేక నగదు ప్రోత్సాహం ప్రకటించినందుకు మహిళా ఎమ్మెల్యేలు సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు.