నిరుద్యోగులకు మొండి చెయ్యి
సంగారెడ్డి క్రైం: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచినా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేకపోయిందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు బి.రవీందర్ విమర్శించారు. అధికారంలోకి వస్తే లక్షమందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న కేసీఆర్ హామీ అమలు కాకపోగా, ఆయన కుటుంబానికి మాత్రం ఉద్యోగాలు వచ్చాయన్నారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోవడం లేదన్నారు.
ముఖ్యంగా సీఎం సొంత జిల్లాలోనే అనేకమంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా వాటి నివారణకు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకోకపోగా వారి కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదన్నారు. కొత్త పింఛన్లు రాకపోగా ఉన్న పింఛన్లు ఊడిపోవడంతో అనేకమంది అర్హులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
ఈ క్రమంలో ‘ఆసరా’ అందక అనేకమంది వృద్ధులు పిట్టల్లా రాలుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారు. వేసవిలో విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికలే టార్గెట్‌గా వైఎస్సార్ సీపీ ముందుకెళ్తుందన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నట్టు తెలిపారు. పార్టీలో యువకులు కీలక పాత్ర పోషిస్తున్నందున వారికి పదవులు కట్టబెట్టి పార్టీ కార్యక్రమాలను చురుగ్గా చేపడతామన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.