అకాల వర్షం.. అతలాకుతలం
రాష్ట్రవ్యాప్తంగా గాలివాన బీభత్సం
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది.. గురువారం అర్ధరాత్రి నుంచి కురిసిన కుండపోత వర్షాలు, ఈదురుగాలులతో తీవ్ర నష్టం వాటిల్లింది. వాన ధాటికి ఇళ్లు కూలిపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. మామిడి, మొక్కజొన్న, వరి పంటలకు నష్టం వాటిల్లింది. పిడుగుపాటు కారణంగా పలువురు మృతిచెందారు.
దెబ్బతిన్న పంటలు
నల్లగొండ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షంతో అన్ని నియోజకవర్గాల్లో నిమ్మ, మామిడి, బత్తారుు, సపోటా తోటలు దెబ్బతిన్నాయి. తుంగతుర్తిలో 200 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. హుజూర్‌నగర్‌లో సుమారు 140 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. చౌటుప్పల్ మార్కెట్‌లో 2 వేల ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్ మండలాల్లో మూసీ ఆయకట్టులో కోతకు వచ్చిన ధాన్యం నేలకొరిగింది.
గాలివాన బీభత్సం
నిజామాబాద్ జిల్లాలో కలెక్టరేట్‌తోపాటు పలు చోట్ల ఉన్న భారీ వృక్షాలు కూలిపోయాయి. 700 స్తంభాలు కూలిపోగా.. విద్యుత్ శాఖకు రూ.30 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా. మాక్లూర్ మండలంలో పది ఇళ్లు ధ్వంసం కాగా, 30 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం కొనుగోలు కేంద్రంలో వర్షపు నీటి కి వడ్లు కొట్టుకుపోయాయి.
తడిసిన ధాన్యం
కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కారణంగా కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, మంథని, పెద్దపల్లి డివిజన్లలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యూర్డుల్లో రైతులు అమ్మకానికి తెచ్చిన ధాన్యం నీటిపాలైంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయూలంటూ మంథని మార్కెట్‌లో రైతులు ధర్నా చేశారు.
దెబ్బతిన్న ఇళ్లు..
ఆదిలాబాద్ జిల్లాలోని తాండూరు, బేల, తానూరు, జన్నారం, సిర్పూర్, బెల్లంపల్లి మండలాల్లో భారీ వర్షాల కారణంగా పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. మామడ మండలం పొన్కల్‌లో పిడుగుపడి తోట లస్మవ్వ (55) మృతి చెందింది. నిర్మల్ మండలం మంజలాపూర్, చెన్నూరు, జైపూర్ మండలాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. కోటపల్లి మండలంలో 220 ఎకరాల్లో, బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలో 1,500 ఎకరాల్లో మామిడి నేలరాలింది.
తడిసి ముద్దయిన ఓరుగల్లు
వరంగల్ జిల్లాలో మూడు రోజులుగా గాలివాన బీభత్సం సష్టిస్తోంది. శుక్రవారం కూడా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వర్షంతో పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. చెట్లు కూలడంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యూరుు. డోర్నకల్, నెల్లికుదురు, ఏటూరునాగారం, నర్సంపేట, చెన్నారావుపేట తదితర మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.
మెతుకు సీమకు భారీ నష్టం
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లాలో భారీగా పంటలు దెబ్బతిన్నా యి. 101.28 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, 1,034.20 హెక్టార్లలో మామిడి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. దుబ్బాక, దౌలతాబాద్, మిరుదొడ్డి, కల్హేర్, జిన్నారం, కౌడిపల్లి, నంగనూరు మండలాల్లో వరి దెబ్బతింది.
రంగారెడ్డిలో బీభత్సం..
రంగారెడ్డి జిల్లాలో ఈదురు గాలులకు చెట్లు విరిగిపడ్డాయి. పలుచోట్ల ఇళ్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అరటి, వరి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. మామిడి కాయలు నేలరాలాయి.
పాలమూరులో వడగళ్ల వాన
మహబూబ్‌నగర్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. పలు చోట్ల భారీగా వడగళ్లు కురిశాయి. ఆత్మకూర్ మండలంలోని మస్తీపూర్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు రెండు స్తంభాలు, మానవపాడు మండల కేంద్రంలో రెండు గుడిసెలు కూలిపోయాయి.
మామిడికి దెబ్బ..
ఖమ్మం జిల్లాలోని చర్ల, దమ్మపేట, సత్తుపల్లి, వేంసూరు మండలాలు మినహా మిగతా 37 మండలాల్లో భారీ వర్షం కురిసింది. చాలాచోట్ల మామిడి దెబ్బతిన్నది. అరటి, బొప్పాయిలకూ నష్టం వాటిల్లింది.
ఇద్దరు చిన్నారులను మింగిన వాన నీటి గుంత
జహీరాబాద్ టౌన్: భారీ వర్షంతో నీరు నిండిన ఓ గుంత ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. మెదక్ జిల్లా జహీరాబాద్ పట్టణంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అండర్ బ్రిడ్జితో పాటు తవ్విన గుంతలో నీరు చేరింది. శుక్రవారం బాగారెడ్డిపల్లి కాలనీకి చెందిన బుడగ జంగం నర్సింలు కుమారుడు ప్రభుదాస్ (13), కిష్టయ్య కుమారుడు గణేశ్ (14)లు ఆ నీటి గుంతలోకి దిగి.. మునిగిపోయారు. సాయంత్రం ఓ మేకల కాపరి గుంత పక్కన బట్టలు, చెప్పులు చూసి బాగారెడ్డిపల్లి వాసులకు సమాచారమిచ్చారు. పిల్లల బంధువులు వెళ్లిచూసి, దుస్తులు తమవారివిగా గుర్తుపట్టారు. పోలీసులు మృతదేహాలను బయటికి తీయించారు.