వనపర్తి రూరల్ పోలీస్‌స్టేషన్‌ను ఇసుక దుమారం చుట్టుముట్టింది. గత కొన్నిరోజులుగా నెలకొన్న కోల్డ్‌వార్ చినికి చినికి గాలి వానగా మారింది.
వనపర్తి రూరల్/టౌన్, న్యూస్‌లైన్: వనపర్తి రూరల్ పోలీస్‌స్టేషన్‌ను ఇసుక దుమారం చుట్టుముట్టింది. గత కొన్నిరోజులుగా నెలకొన్న కోల్డ్‌వార్ చినికి చినికి గాలి వానగా మారింది. ఈ పరంపరంలో గురువారం విధులకు వెళ్లి వచ్చిన ఓ పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఇసుక అక్రమరవాణా సందర్భంగా స్థానిక పోలీసులకు లభించే కానుకల విషయంలో గత కొంతకాలంగా కుమ్ములాటలు తలెత్తాయి.
వనపర్తి మండలం చిట్యాల కేంద్రంగా జరుగుతున్న రవాణాలో కొందరు వ్యాపారులు పోలీస్‌శాఖలో ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ.. గత రెండేళ్లుగా యథేచ్ఛగా తమ వ్యాపారాన్ని మూడుపూలు, ఆరుకాయలుగా కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇసుక వ్యాపారుల నుంచి వచ్చే కానుకల విషయంలో కిందిస్థాయి సిబ్బందికి ఉన్నతాధికారులకు గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. ఇదిలాఉండగా, గురువారం చిట్యాల వాగునుంచి ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను రూరల్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ భూపాల్ పట్టుకున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కొందరు వ్యాపారులు పోలీస్‌శాఖ ఉన్నతాధికారులకు..‘మీ కానిస్టేబుల్ బేరసారాలు అడుతున్నాడు’ అంటూ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. గ్రామస్తుల ముందే ఫోన్‌లో సదరు కానిస్టేబుల్‌ను ఛీవాట్లు పెట్టడంతో మనస్తాపం చెంది పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఈ సంఘటన వనపర్తి పట్టణం, మండలంలో సంచలనం రేకెత్తించింది. పోలీస్ అధికారులు డిపార్టుమెంట్ పరువుపోకుండా అసలు విషయాన్ని దాచిపెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అపస్మారకస్థితిలోకి భూపాల్
ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వనపర్తి రూరల్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ భూపాల్(28) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. రాజనగరం గ్రామ శివారులో పురుగుమందు తాగిన అతని స్థానికులు గమనించి చికిత్స కోసం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. మెరుగైన వైద్యం కోసం బాధితుడిని కర్నూలుకు తరలించారు. కాగా, విషయం తెలుసుకున్న బాధితుడి భార్య శిరీష వనపర్తి ఏరియా ఆస్పత్రికి చేరుకుని పోలీసులు ప్రతి చిన్న పనికి డిన్నర్‌లంటూ ఇంట్లో ఉన్నవాడిని పిలిపించుకుని ఇలాచేశారేమిటని పోలీసులను నిలదీసింది.
సీఐ మధుసూదన్‌రెడ్డి ఏమన్నారంటే..
బీట్ వేసిన ప్రాంతాన్ని వదిలి కానిస్టేబుల్ భూపాల్ చిట్యాలకు వెళ్లి ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకోవటానికి వెళ్లటంతో గ్రామస్తులు ఫోన్‌చేసి భూపాల్‌పై పలు ఆరోపణలు చేశారు. దీంతో ఏమిటని ప్రశ్నించాను. కాసేపటికే భూపాల్ పురుగుమందు తాగాడని తెలిసింది. అతన్ని వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాం. మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లాం. ప్రస్తుతం కర్నూలులోని గౌరీ గోపాల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతునానడు.
కారణాలు తెలియవు : ఎస్‌ఐ రాంబాబు
విధి నిర్వాహణలో ఉండి ఇలా ఎందుకు చేశారో తెలియదు. ఇసుక విషయమని ఆరోపణలు వచ్చినా స్వయంగా ఆయనతో మాట్లాడితేనే అసలు విషయం తెలుస్తుంది. వైద్యులు రెండురోజుల తర్వాత మాట్లాడటానికి అవకాశం ఇస్తామని చెప్పారు.