వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాల పెంపునకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాలు పెంచే ప్రక్రియ దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిబంధనల ప్రకారం కాంట్రాక్టు అధ్యాపకుల రెగ్యులరైజేషన్ కుదరదని ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆ నివేదికను పరిశీలించడంతోపాటు కాంట్రాక్టు అధ్యాపకులకు వేతనాలను ఏ మేరకు పెంచాలన్న విషయంపై అధ్య యనం చేసి నివేదిక అందజేసేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, జేఎన్‌టీ యూ, ఉస్మానియా, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీలు ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, ప్రొఫెసర్ రామచంద్రం, ప్రొఫెసర్ సీతారామరావుతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ అధ్యయనం దాదాపు పూర్తయింది.
కాంట్రాక్టు అధ్యాపకులకు కనీసంగా నెలకు రూ.42 వేలకు పైగా వేతనాలు ఇచ్చేలా కమిటీ తమ నివేదికను సిద్ధం చేసినట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం వర్సిటీల్లో కొంత మంది కాంట్రాక్టు అధ్యాపకులకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకే గౌరవ వేతనాలు వస్తున్నాయి. మరికొందరికి రూ.35 వేల వరకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారు పని చేస్తున్న కాలాన్ని బట్టి సీనియారిటీ ఆధారంగా ఆ వేతనం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన తక్కువ సీనియారిటీ కలిగిన అధ్యాపకునికి కూడా నెలకు రూ.45 వేలకు పైగా వేతనాలు వచ్చే అవకాశం ఉంది.
2,500 మందికి ప్రయోజనకరం..: ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ నెల 10న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. ఆయన రాగానే నివేదికను అందజేయనున్నారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఆమోదంతో వేతనాల పెంపునకు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని వర్సిటీల్లో 2,500 మందికి పైగా కాంట్రాక్టు అధ్యాపకులు పని చేస్తున్నారు. ఈ నిర్ణయంతో వారందరికి ప్రయోజనం చేకూరనుంది.