ప్రజల గుండెల్లో నేటికీ వైఎస్
షర్మిల పరామర్శ యాత్రకు అపూర్వ స్పందన
త్వరలోనే జిల్లాలో మూడో విడత యాత్ర
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి
భూపాలపల్లి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నేటికీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. వైఎస్ తనయ, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో చేపట్టిన రెండో విడత పరామర్శ యాత్ర మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సిపేటలో శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాఘవరెడ్డి మాట్లాడారు. మహానేత వైఎస్ అకాల మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో 73 మంది చనిపోయారని, మొదటి, రెండో విడత యాత్రల్లో షర్మిల 62 కుటుంబాలను పరామర్శించారని చెప్పారు.
మూడో విడతలో భాగంగా మిగిలిన భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాలోని 11 కుటుంబాలను ఈ నెల 21, 22 తేదీల్లో పరామర్శిస్తారని తెలిపారు. జిల్లాలో షర్మిల చేపట్టిన తొలి, మలి విడత యాత్రలకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందన్నారు. యాత్ర విజయవంతానికి సహకరించిన ప్రజలు, వైఎస్ అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, పోలీసులు, జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను యూత్ర సందర్భంగా ప్రజలు గుర్తు చేసుకున్నారన్నారు. నల్లకాల్వలో తమ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట కోసం ఆరేళ్లయినా ప్రతీ కుటుంబాన్ని పరామర్శిస్తున్నట్లు రాఘవరెడ్డి తెలిపారు.