జిల్లాలో జోరుగా ‘మిషన్ కాకతీయ’
ముమ్మరంగా సాగుతున్న చెరువుల పనులు
పడావుగా రూ.30 లక్షలతో నిర్మించిన పైలాన్
ఆవిష్కరణపై అధికారుల్లో అనుమానం!
వరంగల్ : మిషన్ కాకతీయ పేరిట నిర్వహిస్తున్న చెరువుల పునరుద్ధరణ స్ఫూర్తిని అందరికీ చాటి చెప్పాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లాలోని చిన్న నీటివనరుల శాఖ జిల్లా కార్యాలయంలో పైలాన్ నిర్మించింది. ప్రస్తుతం జిల్లాలో చెరువుల పునరుద్ధరణ పనులు జోరుగా సాగుతున్నారుు. మిషన్ కాకతీయ స్ఫూర్తిని తెలిపేందుకు అన్ని హంగులతో నిర్మించిన పైలాన్ మాత్రం పడావుగా మారింది. పైలాన్ ఆవిష్కరణతోనే మిషన్ కాకతీయ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం మొదట భావించింది. కాకతీయుల పరిపాలన కేంద్రంగా ఉన్న జిల్లా కేంద్రంలోని పైలాన్ నిర్మాణాన్ని ఈ ఏడాది జనవరి 6న చేపట్టింది. రూ.30 లక్షలతో పైలాన్‌ను అద్భుతంగా నిర్మించారు. కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతితో జనవరి 29 ఈ పైలాన్‌ను ఆవిష్కరించి పథకం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్ర మంత్రి పర్యటనలో జాప్యం కావడం, వెంటనే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక నియమావళి అమల్లోకి రావడంతో పైలాన్ ఆవిష్కరణ జరగలేదు. చెరువుల పునరుద్ధరణ పనులు ఎండాకాలంలోనే చేయాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వేచి చూస్తే ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో జిల్లాలో అధికారులే చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు అందరు ఇదే బిజీలో ఉన్నారు. పైలాన్ విషయాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జిల్లాకు వచ్చినా పైలాన్ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొత్తంగా పైలాన్‌ను ఆవిష్కరణకు నోచుకుంటుందా లేదా అనేది అనుమానంగా మారింది.
ముమ్మరంగా ‘చెరువు’ పనులు
జిల్లాలో 5,839 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులతో 3,55,037 ఎకరాల సాగు భూమికి నీటిని అందించే అవకాశం ఉంది. మొదటి దశలో జిల్లాలోని 1,173 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 845 చెరువుల పునరుద్ధరణ కోసం రూ.330.64 కోట్లు మంజూరు చేసింది. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వాటిలో 562 చెరువుల పనుల నిర్వహణకు కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్ ప్రక్రియ ముగిసింది. 289 చెరువల పనులు మొదలయ్యాయి. ఇన్నాళ్లు శాసనమండలి ఎన్నిక కారణంగా పనుల ప్రారంభం నెమ్మదిగా సాగింది.
‘మిషన్’ పైలాన్ సంగతేంది!
Published Sun, Apr 5 2015 12:54 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement