
ఆ రోజు 1947 ఆగస్టు 15.. ఆంగ్లేయుల పీడ విరగడంతో భారతావని వెలుగు దివ్వెలతో పండుగ జరుపుకుంటోంది. కానీ హైదరాబాద్ స్టేట్ మాత్రం నిరంకుశ నిజాం నీడలో.. చిమ్మచీకట్లు కప్పుకుని ఉంది. ఓ వైపు దేశమంతా సంబురాలు జరుపుకుంటుంటే.. మన తెలంగాణ ప్రాంతం మాత్రం రజాకార్ల ఆగడాలతో కన్నీళ్లు కారుస్తోంది. కానీ.. ఏడిచిన ఆ కళ్లే.. రానురాను ఎరుపెక్కాయి. ఆనాటి ప్రభుత్వ దాష్టీకాలు, రజాకార్ల దౌర్జన్యాలపై నిప్పులు కురిపించాయి. తరతరాలుగా పట్టిపీడిస్తున్న నిజాం సర్కారును కూలదోసేందుకు.. స్వతంత్ర భారతంలో స్వేచ్ఛావాయువులను పీల్చేందుకు పదమూడు నెలల పాటు తెలంగాణ ప్రజలు ఉద్యమించారు. ఈ పోరులో మన ఇందూరు కీలకమైన పాత్ర పోషించింది. ఆనాడు జరిగిన పోరాటంలో ఎంతోమంది జిల్లావాసులు రజాకార్ల తుపాకులకు ఎదురొడ్డి పోరాడారు. ఎంతోమంది తమ ప్రాణాలనూ అర్పించి.. అమరులయ్యారు. ఎట్టకేలకు 1948 సెప్టెంబర్ 17వరకు హైదరాబాద్ స్టేట్ భారతావనిలో కలిసింది.
చీకటిపాలనకు చరమగీతం
నిజామాబాద్ కల్చరల్: నా తెలంగాణ కోటి రతనాల వీణ.. తెలంగాణలోని సబ్బండ వర్ణాలకు నినాదంగా మారింది. అంత గొప్ప పేరొందిన కవితను దాశరథి నిజామాబాద్ జిల్లా కేంద్ర ఖిల్లా జైలు గోడలపై బొగ్గుతో రాశారంటే జిల్లా జైలుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎన్నో పోరాటాల అనంతరం తెలంగాణలో 1948 సెప్టెంబర్ 17 రోజున నిజాం పాలన అంతమైంది. భారత సైన్యం పోలీస్ యాక్షన్ ద్వారా హైదరాబాద్ స్టేట్‌ను హస్తగతం చేసుకోవడంతో రజాకారుల మారణహోమం ఆగింది.
నిజాం నిరంకుశ పాలన
హైదరాబాద్ సంస్థానానికి మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆనాటి నవాబుగా కొనసాగిన నిరంకుశుడు. బ్రిటీష్‌వారి అండదండలతో ఇక్కడి ప్రజలను అణచివేయడానికి కుట్రలు పన్నారు. ముస్లిం రజాకార్లు అమాయక ప్రజలను హింసించేవారు. హైదరాబాద్ స్టేట్‌లో ఆనాడు తెలంగాణ, మరఠ్వాడ, కర్ణాటక అనే మూడు భాషల ప్రాంతాలున్నాయి. జాగిర్దారులు, నవాబులు, దొరలు, దేశ్‌ముఖ్‌లు, వతందారులు, పట్నెలు తదితరులు నిజాంకు సహకరించారు. ఖాసీం రజ్వీ ఆధ్వర్యంలో రజాకార్లు ప్రజలను హింసించేవారు. ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడేవారు.
హైదరాబాద్‌కు విముక్తి
నిజాం ఉస్మాన్‌అలీఖాన్ చేస్తున్న దురాగతాలను భారత ప్రభుత్వం ఆగ్రహానికి లోను చేసింది. ఇందులో భాగంగానే ఆలీంఖాన్‌ను లొంగదీయడం ఒకటే మార్గమని భావించి సర్దార్ వల్లబాయ్ పటేల్ నేతృత్వంలోని భారత సైనిక బలగాలు హైదరాబాద్‌ను ముట్టడించాయి. దీంతో సెప్టెంబర్ 17న నిజాం నవాబు లొంగిపోయాడు. తెలంగాణ స్వతంత్ర భారతావణిలో అంతర్భాగమైంది.
‘బానిస’వాడకు విముక్తి
భారత సైన్యం రజాకార్లను బంధించిన డాక్‌బంగ్లా ఇదే..(నేటి ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్)
నిజాం హయాంలో రజాకార్ల హింసకు వ్యతిరేకంగా పోరాడిన ఘనత బాన్సువాడవాసులది. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసి విముక్తి పొందారు. పల్లెల్లో రజాకర్లను ఎదురించలేక కొంతమంది గ్రామీణులు వారి ఇళ్ళలో బానిసలుగా పనులు చేస్తూ జీవించారు. అప్పుడు ఈ ప్రాంతాన్ని బానిసవాడ అని పిలిచేవారు. రజాకార్ల దౌర్జన్యాలు భరించలేక ప్రజలు పోరుబాట పట్టారు. చివరకు ఆపరేషన్ పోలో పేరుతో 1948 సెప్టెంబర్ 14న భారత సైన్యం బాన్సువాడ తాలుకాకేంద్రాన్ని చుట్టుముట్టింది. రజాకర్ల కోసం సైనికులు అడుగడుగునా వేట కొనసాగించారు. ప్రజల్లో నూతనోత్సాహంతో సైన్యానికి సహకరించారు. భారత సైన్యం ఐదువందల మంది రజాకర్లను అరెస్ట్ చేసి డాక్‌బంగ్లా(ఆర్‌అండ్‌బీ అతిథిగృహం)లో నిర్భందించింది. చేతికి చిక్కిన రజాకార్లను ప్రజలు చితకబాదారు. కొందర్ని హత్యచేసి మంజీరనదిలో పడేశారు. అనంతరం బానిసవాడగా ఉన్న ప్రాంతం బాన్సువాడగా మారింది.
రజాకర్లపై రణం కట్టి..
తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లపై తూటాలు పేల్చిన ఫిరంగి
మోర్తాడ్(బాల్కొండ): అవి అఖండ భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించిన రోజులు.. దేశమంతటా మువ్వన్నెల జెండా ఎగురవేసి సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ తెలంగాణలో మాత్రం నిజాం రజాకార్లు నిరంకుశంగా పాలన సాగిస్తున్నారు. రజాకార్ల ఆగడాలు శృతి మించడంతో తెలంగాణ సాయుధ పోరాటానికి ఉద్యమకారులు పిలుపునిచ్చారు. కొందరు హింసా మార్గంలో మరి కొందరు బాపూజీ చూపిన అహింసా మార్గంలో తెలంగాణ విముక్తి కోసం ఉద్యమాన్ని కొనసాగించారు. తెలంగాణ విముక్తి కోసం రజాకార్లపై రణం కట్టి, కత్తిపట్టి విరోచితంగా పోరాటం సాగించిన ఖిల్లాగా నిజామాబాద్‌కు ఘనమైన చరిత్రను మన ఉద్యమకారులు సొంతం చేశారు. తెలంగాణ విముక్తి కోసం చేసిన పోరాటంలో ఎందరో అమరులయ్యారు. మరెందరో జైలు పాలయ్యారు. వారి పోరాట ఫలితంగానే 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్య్రం లభించింది. అఖండ భారతావనిలో తెలంగాణ ఒక భాగమైంది.
ఆర్య సమాజ్ కీలక పాత్ర
తెలంగాణ విముక్తి కోసం సాగించిన ఉద్యమంలో ఆర్య సమాజ్ కీలక ప్రాత పోషించింది. ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. చౌట్‌పల్లి నారాయణరెడ్డి ఆర్య, చౌట్‌పల్లి శ్రీనివాస్‌రెడ్డి, పడిగెల హన్మాండ్లు, నారాయణ లింగారెడ్డి, నీలకంఠ నారాయణ, పడకల్ శ్రీనివాస్‌రెడ్డి, శంభులింగం, లక్ష్మాగౌడ్, బ్రహ్మయ్య, వెంకటస్వామి, బొంబాయి నర్సింహారెడ్డి, నర్సింహారావు, నరసింహశాస్త్రి, కొండా నారాయణ, ఉప్పు లక్ష్మయ్య, జె.హన్మంత్‌రెడ్డి, టి.రంగారెడ్డిలు రామానంద తీర్థ స్టేట్ కాంగ్రెస్ ఉద్యమానికి ప్రభావితులయ్యారు. ఉద్యమాన్ని ఉవెత్తుకు తీసుకువెళ్లడానికి మన వారు రామానంద తీర్థకు ఎంతో సహకరించారు. 1947 ఆగస్టు 15న దేశమంతటా త్రివర్ణ పతాకం ఎగురవేయడానికి సన్నాహాలు జరుగుతుంటే నిజాం పాలనలో ఉన్న మనకు ఆ స్వేచ్ఛను రజాకర్లు హరించారు. కానీ మన సమరయోధులు మాత్రం రజాకర్ల ఆజ్ఞలను లెక్క చేయకుండా మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు.
ప్రజాసేవలో తరించిన తెలంగాణ ఉద్యమకారులు
తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన పలువురు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పదవులను పొందారు. ప్రజాసేవలో తరించిన వారిలో ఎం. నారాయణరెడ్డి, అర్గుల్ రాజారాం, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు. సుంకెట్‌కు చెందిన ఎం. నారాయణరెడ్డి ఎంపీగా, ఎమ్మెల్యేగా జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. బడుగుల నేతగా గుర్తింపు పొందిన అర్గుల్ రాజారాం బాల్కొండ నియోజకవర్గానికి నాలుగుమార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడంతో పాటు చేనేత, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రిగా విశిష్టమైన సేవలు అందించారు. ఇప్పటికి అర్గుల్ రాజారాం అంటే తెలియనివారు లేక పోవడం విశేషం. చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎంపికయ్యారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధులకు ఆవాసం ఇచ్చిన మోర్తాడ్ బురుజు
రజాకార్ల హింసలు
ఆనాటి రజాకారుల దుచ్చార్యలు ప్రత్యక్షంగా చూశాను. ప్రజలను గోరాతిగోరంగా హింసించేవారు. నిజాంకు వ్యతిరేకంగా ఏ పని చేసినా జైలుకు పంపేవారు. మా వారిని 13 నెలలు ఖిల్లా జైలులో బంధించారు. రజాకారులు ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు.
– విజయలక్ష్మి, స్వాతంత్య్ర సమరయోధుడి భార్య, సుభాష్‌నగర్
విమోచన దినం
స్వాతంత్య్రం వచ్చే నాటికి దాదాపు 500 పైచిలుకు సంస్థానాలు ఉండేవి. వీటన్నింటిని భారత్‌దేశంలో విలీనం చేయాల్సిన గురుతర బాధ్యతను సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వీకరించారు. నిజాంపాలనలో ప్రజల బాధలను తెలుసుకొని నిజాం ఉస్మాన్ అలీఖాన్‌ను భారత్ సైనిక బలగాలతో హైదరాబాద్‌ను చుట్టుముట్టి లొబర్చుకున్నాడు. తెలంగాణ స్వాతంత్య్రం వచ్చిన రోజు ఇది.
– ఏనుగు బాల్‌రెడ్డి, ఎల్లమ్మగుట్ట
ఖిల్లా జైలులో కవులు
చరిత్రకు నిదర్శనం ఇందూరు ఖిల్లా జైలు. తెలంగాణ విమోచన సమయంలో అనేక మందిని ఈ జైల్లో బంధించారు. అందులో దాశరథి రంగాచార్యులు, విఠల్‌దాస్, నల్లనర్సింహారెడ్డి, అళ్వారులు, రాధాకృష్ణమోదాని, ఆకుల పెద్దచిన్నయ్య తదితరులను జైల్లో ఉంచారు. రజాకారులకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఖిల్లా జైల్లో వేసి హింసించారు.
– నారాయణరెడ్డి, గాందేయవాది
విమోచనంలో ఆర్యసమాజ్ కీలక పాత్ర
నిత్యం హోమంతో పాటు దేశభక్తిని ప్రబోధించడమే కాకుండా నిజాం వ్యతిరేక పోరాటంలో కార్యకర్తకు ప్రేరణ ఇచ్చింది ఆర్యసమాజం. 1939 జనవరి 30న ఇందూరు జిల్లాలో నిజాం నిరసన దినాన్ని నిర్వహించారు. 1943లో కాశీనాథశాస్త్రి అధ్యక్షతన ఆర్య సమావేశాన్ని నిర్వహించారు. 1946లో దార్‌గల్లిలో 50 మంది రజాకారుల సైన్యంపై ఆర్యసమాజం కార్యకర్తలు దాడి చేశారు. దీంతో నిజాం ప్రభుత్వం మూడేండ్లు సంస్థ ప్రతినిధులను ఖిల్లా జైల్లో బంధించారు.
- తులసీదాస్ ఆర్య, గౌతంనగర్
Comments
Please login to add a commentAdd a comment