తలకు గాయమై విద్యార్థి మృతి
* ఉపాధ్యాయుడు కొట్టడం వల్లే చనిపోయాడంటున్న కుటుంబ సభ్యులు
* సంబంధం లేదన్న స్కూల్ యాజమాన్యం
హాలియా: నల్లగొండ జిల్లా హాలియా మండలం తిరుమలగిరిలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థి తలలో రక్తం గడ్డకట్టడంతో మృతిచెందాడు. ఉపాధ్యాయుడు కొట్టడంతో ఇలా జరిగిందని కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. అయితే తాము విద్యార్థిని కొట్టలేదని పాఠశాల యాజమాన్యం తెలిపింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హాలియా మండలం ఎల్లాపురం తండాకు చెందిన రమావత్ చందు (7) తిరుమలగిరిలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతున్నాడు.
శనివారం హోంవర్క్ చేయలేదని టీచర్ చందును దండించే క్రమంలో పిల్లవాడి తల గోడకు తగలడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. వెంటనే కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకుని చందును హాలియాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విద్యార్థి తలకు తీవ్రగాయమైందని, హైదరాబాద్‌కు తీసుకెళ్లి న్యూరో సర్జన్‌కు చూపించాలని అక్కడి వైద్యులు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు చందునుఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు.
విద్యార్థి తలలో చిన్నమెదడు వద్ద నరం చితికి తీవ్రరక్తస్రావం జరిగిందని, అందుకే మృతి చెందాడని వైద్యులు చెప్పినట్లు వారు తెలిపారు. తమ పిల్లవాడి మృతికి టీచరే కారణమని ఆరోపించారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బ్రహ్మచారి మాట్లాడుతూ హోంవర్క్ చేయలేదని విద్యార్థిపై ఎలాంటి చర్యా తీసుకోలేదని పేర్కొన్నారు. చందు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత తరగతి గదిలోకి వెళ్లి వాంతికి చేసుకున్నాడని, ఈ విషయాన్ని తమకు తోటి విద్యార్థులు చెప్పగానే వెంటనే చందు తండ్రికి సమాచారం ఇచ్చామని చెప్పారు.