డిటెయిన్ చేశారని విద్యార్థుల ఆందోళన
గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో ఘటన
ఇబ్రహీంపట్నం: కళాశాలకు హాజరైనప్పటికీ.. తమను డిటెయిన్ చేశారని విద్యార్థులు మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. బీటెక్ సివిల్ బ్రాంచ్‌లో యాజమాన్య కోటా కింద చదువుతున్న 140 మంది విద్యార్థుల అటెండెన్స్‌ను తక్కువగా చూపిస్తూ జేఎన్‌టీయూకు కళాశాల యాజమాన్యం రిపోర్టు చేసింది. దీంతో ఆ విద్యార్థులను డిటేయిన్ చేస్తూ ఆదేశాలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏబీవీపీ నాయకులతో కలిసి కళాశాలకు వచ్చి ప్రిన్సిపాల్ పార్థసారథిని నిలదీశారు. సకాలంలో ఫీజు చెల్లించలేదన్న కారణంతో ఉద్దేశపూర్వకంగా యాజమాన్యం ఈ చర్యకు పాల్పడిందని ఆరోపించారు. పార్థసార థి మాట్లాడుతూ హాజరు విషయంలో ఉన్నది ఉన్నట్లుగా తాము రిపోర్టు పంపినట్లు తెలిపారు. విద్యార్థులను డిటేయిన్ చేస్తారని ఊహించలేదని తెలిపారు.
విద్యార్థులపై పోలీసులకు ఫిర్యాదు
తమ డెరైక్టర్ రవీందర్‌రెడ్డిపై విద్యార్థులు దాడి చేశారని, కాలేజీ అద్దాలు పగులగొట్టారని కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏబీవీపీ నాయకులు ఉదయ్‌కుమార్, వినోద్, శాంతికుమార్, సంపత్, అర్జున్, దిలీప్‌కుమార్, క్రాంతికుమార్, శిరీష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. విద్యార్థులను సెక్యూరిటీ గార్డు కొట్టారని ఏబీవీపీ నేతలు ఆరోపించారు.