
చట్టాలపై విద్యార్థులు అవగాహన కల్గి ఉండాలి
- జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నీలిమ
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : విద్యార్థులు, యువత విధిగా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నీలిమ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక, సంక్షేమ గురుకుల కళాశాల, పాఠశాలను ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల పరిసరాలు, సౌకర్యాలు, విద్యాబోధనను పరిశీలించారు. అనంతరం మెస్‌లు, డైనింగ్ హాల్‌లను తనిఖీ చేసి భోజనం, కూరలను ఆమె తనిఖీ చేశారు.
అనంతరం విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ అలవర్చుకోవాలని, ర్యాగింగ్ చట్టరిత్యా నేరమని చెప్పారు. ర్యాగింగ్ నివారణకు ప్రతీ ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలన్నారు. 18 సంవత్సరాల వయస్సు నిండకుండా, డ్రైవింగ్ లెసైన్స్‌లు లేకుండా వాహనాలు నడపడం నేరమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ జీవన్‌గౌడ్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.