విద్యార్థినికి చికిత్స అందిస్తున్న దృశ్యం
రాయపోలు(దుబ్బాక)/మోపాల్(నిజామాబాద్ రూరల్): ఊరికి దూరంగా ఉన్న గురుకుల పాఠశాల విద్యార్థినులపై కీటకాలు దాడి చేస్తున్నాయి. సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లోని గురుకుల విద్యార్థినులపై కీటకాలు దాడి చేయటంతో పలువురు విద్యార్థినులు గాయపడ్డారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం మొండిచింత సమీపంలోని ఓ ప్రైవేటు భవనంలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇందులో 215 మంది వరకు విద్యార్థినులు ఉన్నారు. బుధవారం రాత్రి విద్యార్థులు నిద్రిస్తుండగా.. ఓ రకమైన పురుగులు వారిపై దాడి చేశాయి.
90 మంది విద్యార్థినులతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులకు గాయాలయ్యాయి. ముఖం, చేతులు, వీపు ప్రాంతాలలో పురుగులు తాకిన ప్రాంతంలో బొబ్బలు వచ్చి గాయాలయ్యాయి. దౌల్తాబాద్ పీహెచ్‌సీ ఇన్‌చార్జి వైద్యాధికారి డా.రమాదేవి శుక్రవారం పాఠశాలలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి విద్యార్థినులకు వైద్యం అందించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. పాఠశాల భవనానికి కిటికీలు సరిగా లేకపోవడంతో పురుగులు దాడిచేశాయని విద్యార్థులు చెబుతున్నారు.
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో గురువారం రాత్రి 15 మంది విద్యార్థులను పురుగులు కుట్టడంతో వారి ముఖాలపై దద్దుర్లు ఏర్పడ్డాయి. స్టాఫ్‌నర్సు మాధురి విద్యార్థినులకు ప్రథమ చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి సంజీవ్‌కుమార్, ఓఎస్‌డీ ముస్తాఫా శుక్రవారం ఉదయం గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థినులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment