► దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి స్థానచలనం
► శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం
► డీఐజీ అకున్‌సబర్వాల్
సాక్షి, వికారాబాద్: జిల్లాలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న సబ్‌ఇన్‌స్పెక్టర్ల బదిలీలు త్వరలో ఉంటాయని డీఐజీ అకున్‌సబర్వాల్ పేర్కొన్నారు. వికారాబాద్‌లోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు ఆ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఐజీ విలేకరులతో మాట్లాడారు. చాలాకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న, దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న పోలీసు అధికారుల బదిలీలు త్వరలో ఉంటాయని చెప్పారు. జిల్లాలోని తొమ్మిది మంది ఎస్‌ఐల బదిలీలకు రంగం సిద్ధం చేశామన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ బుధవారంతో ముగియనున్నందున ఏ క్షణాన్నైనా బదిలీలు జరగొచ్చని సూత్రప్రాయంగా తెలిపారు. సీఐల బదిలీలు తన పరిధిలోని అంశంకాదని అది ఐజీ చేస్తారన్నారు. దీర్ఘకాలంగా పనిచేస్తున్న సీఐల బదిలీలు త్వరలో ఉంటాయని ఆయన సంకేతాలిచ్చారు. తాండూరులో ఇటీవల జరిగిన సంఘటనలపై సమీక్షలో చర్చించినట్లు పేర్కొన్నారు. శాంతిభద్రతలు కాపాడడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందు కోసం పోలీసుశాఖ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. మార్చి చివరిదశలో ఉన్నందున బడ్జెట్ అంశంపై కూడా సమీక్షలో చర్చించినట్లు వివరించారు. సమావేశంలో పరిగి, తాండూరు డీఎస్పీలు అశ్వక్ అహ్మద్, రామచంద్రుడు, సీఐలు పాల్గొన్నారు.