రుణాల లబ్ధిదారులకు ఖాతాలు తెరిపించాలి
కలెక్టర్ నీతూ ప్రసాద్
ముకరంపుర : జిల్లాలో రాయితీ రుణాలు మంజూరైన లబ్ధిదారులకు వెంటనే బ్యాం కు ఖాతాలు తెరిపించాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ బ్యాంకు మేనేజర్లను కోరారు. కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో సోమవారం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ రాయితీ రుణాలకు మంజూరు ఉత్తర్వులను జారీచేసినట్లు తెలిపారు. బ్యాంకు మేనేజర్లు లబ్ధిదారుల పేర్లపైన ఖాతాలను తెరిచి రుణాలు మంజూరయ్యేలా చూడాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ 5344 లక్ష్యం కాగా.. 3156 మంజూరు చేసినట్లు తెలిపారు. బీసీ కార్పొరేషన్ 2304 లక్ష్యం కాగా.. 1856, ఎస్టీ కార్పొరేషన్ 167 లక్ష్యం కాగా.. 150 మంజూరు ఇచ్చినట్లు తెలిపారు. బ్యాంకు లింకేజీలో 92 శాతం లక్ష్యం సాధించామని, మార్చి 31 నాటికి వంద శాతం లక్ష్యం సాధిస్తామన్నారు.
మహిళా సంఘాలకు లింకేజీ రుణం రూ.472 కోట్లు లక్ష్యం కాగా.. 628కోట్ల లక్ష్యం సాధించినట్లు తెలిపారు. మెప్మా ద్వారా రూ.100 కోట్ల బ్యాంకు లింకేజీ లక్ష్యం కాగా.. రూ.107 కోట్లను రుణాలుగా ఇచ్చినట్లు తెలిపారు. వ్యవసాయ రుణ లక్ష్యాలలో 68 శాతం సాధించినట్లు తెలిపారు. రూ.3980 కోట్ల రుణ లక్ష్యంలో రూ.1785 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు.
రుణాల రికవరీలో ప్రభుత్వ యంత్రాంగం బ్యాంకర్లకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని బ్యాంకర్లను కోరారు. మండలస్థాయిలో ఏర్పాటు చేసిన రుణ రికవరీ కమిటీలు నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం గ్రామాల్లో పర్యటించి రుణాలు వసూలు చేయాలని కోరారు. ఏజేసీ నాగేంద్ర, ఎల్‌డీఏం చౌదరి, నాబార్డు ఏజీఎం రవిబాబు, ఎస్‌బీహెచ్ ఏజీఎం గంగాధరరావు, ఆంధ్రాబ్యాంకు ఏజీఎం సత్యనారాయణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.