‘సక్సెస్’ ఫెయిల్
‘పేదవాడికి పెద్ద చదువులు భారం కావద్దు.. మారుతున్న కాలంతోపాటు ప్రతి విద్యార్థికీ ఆంగ్ల మాధ్యమంలో విద్య అవసరం.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చు.. దేశానికి కావాల్సిన విలువైన మానవ వనరులను మన రాష్ట్రం నుంచి కూడా అందించవచ్చు...’
- వైఎస్ రాజశేఖరరెడ్డి, దివంగత ముఖ్యమంత్రి
మహోన్నత ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనను వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టారు. ఆయన తదనంత రం పాలకులు ఈ పథకాన్ని ఒక్కో మెట్టు దిగజార్చుతూ వచ్చారు. ‘సక్సెస్’ను ఫెయిల్యూర్ దిశగా నడిపించారు. ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడంతో ఉపాధ్యాయులూ ఆంగ్లబోధనను నిర్లక్ష్యం చేశారు. కనీస విద్యార్థులు కూడా లేరనే నెపంతో సగానికి పైగా సక్సెస్ పాఠశాలలను మూసివేత దిశగా తీసుకెళ్తున్నారు.
ఖమ్మం: ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం మూలంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ విద్య మిథ్యగా మారింది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన జరపాలని 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సక్సెస్ పాఠశాలలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఆంగ్లమాధ్యమ బోధనకు వసతులు కల్పించారు. దీనిలో భాగంగా జిల్లాలో 337 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 264 స్కూల్స్‌ను సక్సెస్ బళ్లుగా ఎంపిక చేశారు. దీనికి అనుగుణంగా అదనపు నిధులు, కంప్యూటర్లు, మౌలిక సదుపాయాలు కల్పించారు.
ప్రతి పాఠశాలకు అంతకుముందున్న ఉపాధ్యాయులకు తోడు ఆంగ్లమాధ్యమంలో గణితం, భౌతికశాస్త్రం, సాంఘికశాస్త్రం బోధించేందుకు ఉపాధ్యాయులను నియమించారు. అప్పటి వరకు ప్రైవేట్ పాఠశాలకు వెళ్లే విద్యార్థులను కూడా ఇంగ్లిష్ మీడియం ఉంద ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఉత్సాహం చూపారు. ఇలా తెలుగు, ఇంగ్లిష్ మీడియం విద్యార్థులతో కళకళలాడిన ప్రభుత్వ పాఠశాలలు నేడు వెలవెలబోతున్నాయి.
పలు పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధించే ఉపాధ్యాయులు కరువయ్యారు. ఉన్నవారిలోనూ అంకితభావం లోపిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇంగ్లిష్ మీడియంలో చేరుదామని వచ్చిన విద్యార్థులను తెలుగుమీడియంలో చేరేలా ఉపాధ్యాయులే ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా జిల్లాలో కనీస విద్యార్థుల సంఖ్య లేని సక్సెస్ పాఠశాలలు 143 వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
జిల్లాలో 45 సక్సెస్ పాఠశాలల్లో 25 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉండటం గమనార్హం.
దీనిలో మధిర మండలం మర్లపాడు పాఠశాలలో ఇద్దరు, చింతకాని మండలం నాగులవంచ, ఖమ్మం అర్బన్ మండలం పాపటపల్లి, ఎర్రుపాలెం మండలం రాజుపాలెం పాఠశాలలో నలుగురు, వేంసూరు మండలం కుంచపర్తి, వైరా మండలం పాలడుగు పాఠశాలల్లో ఆరుగురు విద్యార్థులు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా ఉన్నత పాఠశాలల్లో కనీసం 75 విద్యార్థుల సంఖ్యకు తక్కువగా ఉన్న పాఠశాలలను ఎత్తివేసేందుకు లెక్కలు తీశారు. వీటి ప్రకారం జిల్లాలో మైదానం, ఏజెన్సీ ప్రాంతాల్లో 622 పాఠశాలలకు మూసివేత ముప్పు పొంచివున్నట్లు నిర్ధారించారు. ఇందులో 143 సక్సెస్ పాఠశాలలు ఉండటం గమనార్హం. జిల్లాలో రెండువేల మంది ఉపాధ్యాయులను పనిచేస్తున్న చోట నుంచి బదిలీ చేయాల్సి ఉంది. వీరిలో అత్యధికమంది స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ)లు సక్సెస్ పాఠశాలల్లో పనిచేస్తున్న వారే ఉన్నట్లు తెలిసింది.
ఆంగ్లబోధనను బలోపేతం చేస్తున్నాం: రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆంగ్లమాధ్యమ విద్య అనివార్యం అవుతోంది. ఇంగ్లిష్ మీడియం చదవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులను సక్సెస్ పాఠశాలల్లో చేర్పిస్తున్నాం. గతంలో సక్సెస్ పాఠశాలల్లో చేరేందుకు వచ్చిన విద్యార్థులను పలువురు ఉపాధ్యాయులు నిరుత్సాహ పరిచారు. తెలుగు మీడియంలో చేర్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను నిరుత్సాహ పరిచిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటాం. గడిచిన రెండు సంవత్సరాలుగా సక్సెస్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించారు. జిల్లాలో సక్సెస్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం.
‘మహా’ ఆశయానికి తూట్లు..
Published Tue, Oct 14 2014 2:26 AM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM
Advertisement
Advertisement