Success Schools
-
సక్సెస్ స్కూళ్లలో ఇక పూర్తిగా ఇంగ్లిష్ మీడియం
విద్యార్థులకు బోధనపై ప్రభుత్వ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గతంలో ఏర్పాటు చేసిన సక్సెస్ స్కూళ్లను ఈ విద్యాసంవత్సరం నుంచి పూర్తిస్థాయి ఆంగ్ల మాధ్యమిక పాఠశాలలుగా మార్పుచేశారు. ఇప్పటి వరకూ సమాంతరంగా తెలుగు, ఆంగ్ల మాధ్యమ తరగతులతో నడుస్తున్న ఈ స్కూళ్లన్నీ ఇక నుంచి పూర్తిస్థాయి ఇంగ్లిషుమీడియం పాఠశాలలుగా కొనసాగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో 3,428 సక్సెస్ స్కూళ్లు ఉన్నాయి. 2014-15 విద్యా సంవత్సరంలో సక్సెస్ స్కూళ్లలో చేరిన విద్యార్థుల్లో 31.36 శాతం మంది ఇంగ్లిషు మీడియంలో చేరినవారే. సక్సెస్ స్కూళ్లలోని ప్రస్తుత తెలుగు మాధ్యమిక విద్యార్థులను (9, 10 మినహాయించి) రెండు కి లోమీటర్ల లోపు దూరంలో ఉన్న ఇతర హైస్కూళ్లలోకి మార్పు చేయనున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ స్కూళ్లలో కేవలం ఆంగ్లమాధ్యమ విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలని పదో తరగతి వర కూ అందులోనే కొనసాగించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. అయితే ఈ స్కూళ్లలో ఇప్పటికే తొమ్మిది, పదో తరగతి చదువుతున్న తెలుగు మాధ్యమం విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండేందుకు వారిని అక్కడే యథాతథంగా అవే మాధ్యమాల్లో కొనసాగించాలని సూచించింది. టీచర్ల నియామకం ఇలా ఈ స్కూళ్లలో ఆంగ్లమాధ్యమంలో బోధించడానికి ఉత్సుకత చూపే టీచర్లను గుర్తించి నియామకం చేసే బాధ్యతను జిల్లా విద్యాధికారులకు అప్పగించారు. వీరికి వేసవి తదితర సెలవుల కాలంలో ఆంగ్ల మాధ్యమంలో నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నారు. దశలవారీగా పరీక్షల విధానంలో మార్పులు: ఆంగ్ల మాధ్యమికాలుగా ప్రారంభమవుతున్న ఈ స్కూళ్లలో దశలవారీగా పరీక్షల విధానాన్ని మార్చుకుంటూ వెళ్లనున్నారు. -
ప్రైవేట్ విద్యాసంస్థలతో ప్రభుత్వం కుమ్మక్కు
కరీంనగర్: ప్రైవేటు విద్యాసంస్థలతో ప్రభుత్వం కుమ్మక్కైందని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆరోపించారు. అందుకే టీఆర్ఎస్ సర్కార్ కేజీ టు పీజీ విద్య విధానం అమలుచేయడం లేదని మండిపడ్డారు. బుధవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ 2008లోనే వైఎస్ఆర్ ఆంగ్ల మాధ్యమంలో భోదన మొదలు పెట్టారని చెప్పారు. దశలవారీగా అమలుచేసేందుకు సక్సెస్ స్కూల్స్ మొదలు పెట్టారని తెలిపారు. టీచర్ల క్రమబద్ధీకరణ పేరుతో ఆంగ్ల మాధ్య పాఠశాలలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో 50 సక్సెస్ స్కూల్స్ మూతపడ్డాయని చెప్పారు. బంగారు తెలంగాణ అంటున్న కేసీఆర్ చిత్తశుద్ధి ఉంటే విద్యాహక్కు చట్టం అమలుచేయాలని హితవు పలికారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా కేజీ టు పీజీ పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
‘మహా’ ఆశయానికి తూట్లు..
‘సక్సెస్’ ఫెయిల్ ‘పేదవాడికి పెద్ద చదువులు భారం కావద్దు.. మారుతున్న కాలంతోపాటు ప్రతి విద్యార్థికీ ఆంగ్ల మాధ్యమంలో విద్య అవసరం.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చు.. దేశానికి కావాల్సిన విలువైన మానవ వనరులను మన రాష్ట్రం నుంచి కూడా అందించవచ్చు...’ - వైఎస్ రాజశేఖరరెడ్డి, దివంగత ముఖ్యమంత్రి మహోన్నత ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనను వైఎస్ఆర్ ప్రవేశపెట్టారు. ఆయన తదనంత రం పాలకులు ఈ పథకాన్ని ఒక్కో మెట్టు దిగజార్చుతూ వచ్చారు. ‘సక్సెస్’ను ఫెయిల్యూర్ దిశగా నడిపించారు. ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడంతో ఉపాధ్యాయులూ ఆంగ్లబోధనను నిర్లక్ష్యం చేశారు. కనీస విద్యార్థులు కూడా లేరనే నెపంతో సగానికి పైగా సక్సెస్ పాఠశాలలను మూసివేత దిశగా తీసుకెళ్తున్నారు. ఖమ్మం: ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం మూలంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ విద్య మిథ్యగా మారింది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన జరపాలని 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సక్సెస్ పాఠశాలలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఆంగ్లమాధ్యమ బోధనకు వసతులు కల్పించారు. దీనిలో భాగంగా జిల్లాలో 337 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 264 స్కూల్స్‌ను సక్సెస్ బళ్లుగా ఎంపిక చేశారు. దీనికి అనుగుణంగా అదనపు నిధులు, కంప్యూటర్లు, మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రతి పాఠశాలకు అంతకుముందున్న ఉపాధ్యాయులకు తోడు ఆంగ్లమాధ్యమంలో గణితం, భౌతికశాస్త్రం, సాంఘికశాస్త్రం బోధించేందుకు ఉపాధ్యాయులను నియమించారు. అప్పటి వరకు ప్రైవేట్ పాఠశాలకు వెళ్లే విద్యార్థులను కూడా ఇంగ్లిష్ మీడియం ఉంద ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఉత్సాహం చూపారు. ఇలా తెలుగు, ఇంగ్లిష్ మీడియం విద్యార్థులతో కళకళలాడిన ప్రభుత్వ పాఠశాలలు నేడు వెలవెలబోతున్నాయి. పలు పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధించే ఉపాధ్యాయులు కరువయ్యారు. ఉన్నవారిలోనూ అంకితభావం లోపిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇంగ్లిష్ మీడియంలో చేరుదామని వచ్చిన విద్యార్థులను తెలుగుమీడియంలో చేరేలా ఉపాధ్యాయులే ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా జిల్లాలో కనీస విద్యార్థుల సంఖ్య లేని సక్సెస్ పాఠశాలలు 143 వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో 45 సక్సెస్ పాఠశాలల్లో 25 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉండటం గమనార్హం. దీనిలో మధిర మండలం మర్లపాడు పాఠశాలలో ఇద్దరు, చింతకాని మండలం నాగులవంచ, ఖమ్మం అర్బన్ మండలం పాపటపల్లి, ఎర్రుపాలెం మండలం రాజుపాలెం పాఠశాలలో నలుగురు, వేంసూరు మండలం కుంచపర్తి, వైరా మండలం పాలడుగు పాఠశాలల్లో ఆరుగురు విద్యార్థులు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా ఉన్నత పాఠశాలల్లో కనీసం 75 విద్యార్థుల సంఖ్యకు తక్కువగా ఉన్న పాఠశాలలను ఎత్తివేసేందుకు లెక్కలు తీశారు. వీటి ప్రకారం జిల్లాలో మైదానం, ఏజెన్సీ ప్రాంతాల్లో 622 పాఠశాలలకు మూసివేత ముప్పు పొంచివున్నట్లు నిర్ధారించారు. ఇందులో 143 సక్సెస్ పాఠశాలలు ఉండటం గమనార్హం. జిల్లాలో రెండువేల మంది ఉపాధ్యాయులను పనిచేస్తున్న చోట నుంచి బదిలీ చేయాల్సి ఉంది. వీరిలో అత్యధికమంది స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ)లు సక్సెస్ పాఠశాలల్లో పనిచేస్తున్న వారే ఉన్నట్లు తెలిసింది. ఆంగ్లబోధనను బలోపేతం చేస్తున్నాం: రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆంగ్లమాధ్యమ విద్య అనివార్యం అవుతోంది. ఇంగ్లిష్ మీడియం చదవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులను సక్సెస్ పాఠశాలల్లో చేర్పిస్తున్నాం. గతంలో సక్సెస్ పాఠశాలల్లో చేరేందుకు వచ్చిన విద్యార్థులను పలువురు ఉపాధ్యాయులు నిరుత్సాహ పరిచారు. తెలుగు మీడియంలో చేర్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను నిరుత్సాహ పరిచిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటాం. గడిచిన రెండు సంవత్సరాలుగా సక్సెస్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించారు. జిల్లాలో సక్సెస్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. -
మూతబడులు!
నల్లగొండ అర్బన్ : రేషనలైజేషన్ (విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్ల కేటాయింపు-హేతుబద్ధీకరణ)తో జిల్లాలో 470 ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితి నెలకొంది. వీటిలో 270 ప్రైమరీ స్కూళ్లు, 200 హైస్కూళ్లు, సక్సెస్ స్కూళ్లు ఉండనున్నాయి. దసరా సెలవుల్లోనే రేషనలైజేషన్ అమలు చేయాలంటూ ప్రభుత్వం శనివారం జీఓనంబరు 6 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రేషనలైజేషన్ కు సంబంధించిన మార్గదర్శకాలను వెల్లడించింది. 20మంది విద్యార్థుల కన్నా తక్కువగా ఉన్న ప్రాథమిక పాఠశాలలను దగ్గరలోని ప్రాథమిక పాఠశాలల్లో, 75మంది విద్యార్థులకన్నా తక్కువగా ఉండే హైస్కూళ్లను మూసివేసి సమీపంలోని హైస్కూళ్లలో విలీనం చేసే విధంగా గైడ్‌లైన్స్ రూపొందించారు. ఇదే నిబంధన ఇంగ్లీష్ మీడియంలోని సక్సెస్ హైస్కూళ్లకు కూడా వర్తింపచేయాలని నిర్ణయించారు. రేషనలైజేషన్ పూర్తయితే పెద్దసంఖ్యలో ఉపాధ్యాయుల ఖాళీలకు గ్రహణం వీడనుంది. అధికంగా ఉన్న ఉపాధ్యాయులను సమీపంలోని స్కూళ్లకు బదిలీచేస్తే డీఎస్సీ ప్రకటన ఇప్పట్లో సాధ్యమయ్యేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. పరస్పర విరుద్ధంగా నిబంధనలు.. విద్యాహక్కు చట్టం ప్రకారం కిలోమీటర్ దూరంలోపే ప్రభుత్వ పాఠశాల ఉండాలని నిబంధనలున్నాయి. మరోవైపు 20మంది పిల్లలకన్నా తక్కువ సంఖ్య ఉన్న (19 మంది విద్యార్థులున్నా సరే) ప్రైమరీ స్కూళ్లను మూసివేయాలని రేషనలైజేషన్‌లో నిబంధన పెట్టారు. అదే విధంగా జిల్లాలో ప్రస్తుతం 20మందిలోపు ఉన్న పాఠశాలలు 270 దాకా ఉన్నాయి. వీటిని మూసివేస్తే ఒక్కో పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులున్నా, సగటున 550 మంది టీచర్లు మిగులుతారు. వీరిని ఉపాధ్యాయ ఖాళీలున్న ఇతర పాఠశాలల్లోకి బదిలీ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు తగ్గే అవకాశముంటుంది. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఒకింత నిరాశను మిగిల్చే పరిణామమిది. అంతేకాకుండా 75 మంది విద్యార్థులకన్నా తక్కువ ఉన్న హైస్కూళ్లను కూడా సమీపంలోని హైస్కూళ్లలో విలీనం చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. జిల్లాలో దాదాపు 200కు పైగా హైస్కూళ్లు, సక్సెస్ సూళ్లపై కూడా రేషనలైజేషన్ ప్రభావం పడనుంది. సక్సెస్ స్కూళ్ల పేరుతో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టి అదనపు సెక్షన్లు ఏర్పాటు చేశారు. చాలా పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు 60 నుంచి 70 మంది విద్యార్థులే చదువుతున్నారు. వీటిని కూడా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని వల్ల ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులను కూడా ఇతర చోట్ల సర్దుబాటు చేస్తారు. దీంతో ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య ఇంకా తగ్గే అవకాశముంది. మూతబడేది ఇలా.. గుర్రంపోడు మండల పరిధిలోని పోచంపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో 50మంది, తెలుగు మీడియంలో 40 మంది విద్యార్థులు చదువుతున్నారు. 75 మంది కన్నా తక్కువ ఉన్న స్కూళ్లను ఎత్తివేయాలనే నిబంధనలో పేర్కొన్నారు. దీంతో తెలుగు, ఇంగ్లిష్ మీడియం రెండూ ఎత్తివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జిల్లాలో ఇలాంటి పాఠశాలలు అనేకం ఉన్నాయి. ఇవి కాకుండా యూపీఎస్‌లలో కూడా 6వ తరగతిలో 20 మంది, 7వ తరగతిలో 20 మంది లేకపోతే ఆ పాఠశాలను కూడా మూసివేయాలని నిబంధనలు రూపొందించడంతో అనేక యూపీఎస్‌ల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్నది. విద్యా సంవత్సరం మధ్యలో రేషనలైజేషన్ తగదు : టీఆర్టీఎఫ్ వేసవి సెలవుల్లో రేషనలైజేషన్ ప్రక్రియ చేపడితే బాగుండేదని టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నంద్యాల మోహన్‌రెడ్డి, నిమ్మనగోటి జనార్దన్ అన్నారు. విద్యా సంవత్సరం మధ్యలో ఇలాంటి నిబంధనలు తీసుకరావడం వల్ల ఇటు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇబ్బందికరమే. అందుకే ప్రస్తుత రేషనలైజేషన్‌ను వ్యతిరేకిస్తున్నాం. గ్రామీణ విద్యార్థులు సక్సెస్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. వారిని పక్క గ్రామాలకు వెళ్లి వేరే స్కూళ్లో చదవాలంటే మానేసి పరిస్థితి ఏర్పడుతుంది. రేషనలైజేషన్ ఉద్దేశం పాఠశాలలను ఎత్తివేసే లక్ష్యంతో ఉండకూడదు. దీని ప్రభావం డీఎస్సీ నోటిఫికేషన్‌పై కూడా ఉంటుంది.