
బర్డ్‌ఫ్లూపై ఇంత నిర్లక్ష్యమా?
పశుసంవర్ధక శాఖ అధికారులపై కేంద్ర బృందం ఫైర్
20 రోజుల నుంచి ఏం చేస్తున్నారని మండిపాటు..
16 మొబైల్ హెల్త్ టీంలు, బర్డ్‌ఫ్లూ కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు
వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష, నేడు మంత్రితో భేటీ
హైదరాబాద్: బర్డ్‌ఫ్లూపై రాష్ట్ర యంత్రాంగం నిర్లక్ష్యం వహించడంపై సెంట్రల్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీం(కేంద్ర బృందం) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 20 నుంచి కోళ్లు మరణిస్తుంటే ఏం చేస్తున్నారంటూ మండిపడింది. బుధవారమే రాష్ట్రానికి వచ్చిన కేంద్ర అధికారులు గురువారం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం తొర్రూరు పరిసర ప్రాంతాలను, బర్డ్‌ఫ్లూ వచ్చిన కోళ్ల ఫారాలను క్షుణ్నంగా పరిశీలించారు. ఆ తర్వాత జరిగిన సమీక్షలో పశుసంవర్థక శాఖ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. బర్డ్‌ఫ్లూ ఉన్నట్లు గ్రహించిన వెంటనే సంబంధిత ప్రాంతంలోని కోళ్లను చంపడానికి నాలుగు రోజుల సమయం తీసుకోవడంపై విస్మయం వ్యక్తంచేశారు. యుద్ధప్రాతిపదికన ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్ల ఫారాలను తక్షణమే పూర్తిస్థాయిలో శుభ్రపరచకపోతే ప్రస్తుత వాతావరణంలో వెరస్ గాలిలో కలిసిపోయే ప్రమాదముందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే శాంపిళ్లు సేకరించి పరీక్షలు నిర్వహించడంలోనూ, ప్రజలను అప్రమత్తం చేయడంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందని కేంద్ర బృందం అభిప్రాయపడినట్లు సమాచారం.
తక్షణ చర్యలు చేపట్టిన బృందం: జాతీయ అంటువ్యాధుల సంస్థ(ఎన్‌ఐసీడీ) జాయింట్ డెరైక్టర్లు డాక్టర్ ఎస్.కె.జైన్, డాక్టర్ కర్మాకర్, ప్రత్యేక నిపుణుడు డాక్టర్ ప్రణయ్‌వర్మ, ఛాతీ వైద్య నిపుణుడు డాక్టర్ పవన్‌కుమార్‌తో కూడిన కేంద్ర బృందం తొర్రూరు పరిసర ప్రాంతాల్లో పర్యటించి యుద్ధప్రాతిపదికన చర్యలకు శ్రీకారం చుట్టారు. తక్షణమే తొర్రూరులో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 16 మొబైల్ హెల్త్ టీంలను ఏర్పాటు చేశారు. సమీపంలోని వనస్థలిపురం ఆసుపత్రిలో ప్రత్యేక బర్డ్‌ఫ్లూ వార్డును ఏర్పాటు చేశారు. కోళ్ల ఫారాల్లో పనిచేస్తున్న 18 మంది సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం వైద్యారోగ్య శాఖ అధికారులతోనూ కేంద్ర బృందం సమీక్ష నిర్వహించింది. శుక్రవారం ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో సమావేశంకానుంది. అలాగే గాంధీ ఆసుపత్రిని, ఐపీఎం ల్యాబ్‌ను సందర్శించనుంది. మరోవైపు ఇప్పటివరకు 1.20 లక్షల కోళ్లను చంపేసినట్లు, 84 వేల గుడ్లను ధ్వంసం చేసినట్లు పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. కోళ్లను, గుడ్లను ఎక్కడికీ తరలించకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కాగా, తమకు జరిగిన నష్టంపై ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని కోళ్ల ఫారాల యజమానులు కోరుతున్నారు.